ఇరాన్ కొత్త నాయకుడికి షాకిచ్చిన ట్రంప్ | US Trump Key Comments Over Iran Leadership | Sakshi
Sakshi News home page

ఇరాన్ కొత్త నాయకుడికి షాకిచ్చిన ట్రంప్

Mar 6 2026 8:37 AM | Updated on Mar 6 2026 8:55 AM

US Trump Key Comments Over Iran Leadership

వాషింగ్టన్‌: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. అమెరికా అధ్యక్ష్యుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపికలో అగ్రరాజ్యం పాత్ర ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అయతొల్లా అలీ ఖమేనీ కొడుకు మోజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీంగా ఎంపిక అయ్యారనే ప్రచారంపైనా ట్రంప్ తీవ్రంగా స్పందించారు.

ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా మోజ్తబాను చూడటం దాదాపుగా అసాధ్యం అని ట్రంప్ తేల్చేశారు. రాయిటర్స్ మీడియాకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ భవిష్యత్తు కోసం జరిగే నాయకత్వ ఎంపికలో మేము (అమెరికా) భాగం కావాలి. అప్పుడే ఎంపికలో పారదర్శకత ఉంటుంది. ప్రతీ ఐదు సంవత్సరాలకొకసారి మళ్లీ ఇదే చేయాల్సిన అవసరం ఉండదు. ఇరాన్‌కు, ఆ దేశ ప్రజలకు గొప్ప సేవ అందించే నాయకుడిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మోజ్తబాను తదుపరి నాయకుడిగా పరిగణించడం అసాధ్యమనే రీతిలో ఆయన మాట్లాడినట్లు సదరు మీడియా సంస్థ కథనం ఇచ్చింది.

మరోవైపు.. ఇరాన్ మాజీ రాజకుమారుడు రెజా పహ్లవికి ఆ అవకాశం ఉండొచ్చా? అని రాయిటర్స్ ప్రతినిధి వేసిన ప్రశ్నకు.. ఎంపికలో ఎంతో మంది పేర్లను పరిశీలించవచ్చు. అది ఇప్పుడే చెప్పలేం అని ట్రంప్ బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ కొత్త నాయకుడి ఎంపికలో అమెరికా ప్రమేయం ఉండాల్సిందేనన్న ట్రంప్ ప్రకటన చేయడం ద్వారా మధ్య ప్రాచ్యంలో మిడిల్ ఈస్ట్‌లో అమెరికా ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ వ్యాఖ్యలు ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటనకు, రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 28న(2026)అమెరికా‌ ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో అయతొల్లా ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు మరణించారు. ఆయన మరణాంతరం గార్డియన్ కౌన్సిల్‌కు చెందిన అయతొల్లా అలిరెజా ఆరఫీని (ఖమేనీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు కూడా) తాత్కాలిక సుప్రీం లీడర్‌గా నియమించారు. ఆపై మార్చి 4న ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఖమేనీ తనయుడు మోజ్తబాను అధికారికంగా ఎన్నుకుంది. అయితే ఈ ఎంపిక సజావుగా జరగలేదని, ఇందులో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒత్తిడి ఉందని పలు కథనాలు చెబుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement