న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎన్ఎస్ఐసీ ఓఖ్లా మైదానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న 17వ ‘ఇండియా ఆర్ట్ ఫెయిర్ 2026’ కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో అనేక వినూత్న కళాఖండాలు కొలువుదీరాయి. శిథిలాల్లో దాగున్న జ్ఞాపకాలను, వలసల తాలూకు ఆవేదనను ప్రతిబింబించేలా కళాకారుడు గిర్జేష్ కుమార్ సింగ్ రూపొందించిన శిల్పాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. కూల్చివేసిన ఇళ్లకు సంబంధించిన ఇటుకలనే ముడిసరుకుగా మార్చుకుని, వాటికి అద్భుతమైన జీవం పోయడం ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రదర్శనశాల ముఖద్వారం వద్దే ఇటుకల కుప్పలా కనిపించే ఈ ఆవిష్కరణను గమనిస్తే శిథిలాల నుంచి కొత్త జీవం మొలకెత్తుతున్నట్లుగా కనిపిస్తుంది. ఏళ్ల తరబడి ఎందరో నివసించిన ఇళ్లు నేలమట్టమైనప్పుడు, ఆ శిథిలాల మధ్యే కొత్త మొక్కలు చిగురించడం అభివృద్ధి పేరిట జరుగుతున్న మార్పులకు ప్రతీకగా కనిపిస్తుంది. గిర్జేష్ కుమార్ సింగ్ రూపొందించిన ‘హాల్ ముకామ్: కరెంట్ అడ్రస్’ (ప్రస్తుత చిరునామా) అనే ప్రదర్శనలో భాగంగా ఈ ఇటుక శిల్పాలు ఈ భావజాలాన్ని మరింత లోతుగా వివరిస్తున్నాయి. ఇళ్లు కూల్చిన చోట సేకరించిన ఇటుకలను ముక్కలుగా చేసి, వాటిని పేర్చి, వలస వెళ్తున్న సామాన్యుల రూపాలను ఆయన మలిచారు.
ఈ శిల్పాల్లో ముఖ్యంగా 'ఇన్ ట్రాన్సిట్' పేరుతో రూపొందించిన కళాఖండాలు చూపరులను ఆలోచింపజేస్తున్నాయి. చేతిలో సంచులు పట్టుకుని, మరో సంచిని కాళ్ల మధ్య ఉంచుకుని, వలస వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఓ వృద్ధుడి ప్రతిమ అత్యంత సహజంగా కనిపిస్తోంది. ఇక్కడ ఇటుక అనేది కేవలం భౌతికమైన వస్తువు మాత్రమే కాదు, మానవ జీవితంలో ఏ చిరునామా కూడా శాశ్వతం కాదనే సత్యాన్ని చాటిచెప్పే ఒక ప్రతీక. సొంత ఊరుని, గూడుని వదిలి వలస వెళ్లే క్రమంలో మనుషులు తమ వెంట తీసుకెళ్లేది కేవలం సంచులను మాత్రమే కాదు, ఆ పాత ఇళ్లతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను, చేదు తీపి అనుభవాలను కూడా బరువుగా మోస్తారని ఈ శిల్పాలు నిశ్శబ్దంగా నినదిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని సేమ్రాలో జన్మించిన గిర్జేష్ కుమార్ సింగ్ అలహాబాద్, వారణాసిలలో విద్యనభ్యసించి, బరోడాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పట్టా పొందారు. ప్రస్తుతం వడోదరను తన నివాసంగా మార్చుకున్న ఆయన తన కళా సృజనలో వలసలు, అస్థిత్వం, నిర్వాసితుల ఇతివృత్తాలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు మనం చూస్తున్న వలసల సంక్షోభం, యుద్ధ విధ్వంసాల నేపథ్యంలో, గిర్జేష్ సృష్టించిన ఈ ఇటుక శిల్పాలు కేవలం కళాఖండాలుగానే కాకుండా, ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
భవనాలు కేవలం ఇటుకలు, సిమెంట్ తో కట్టిన కట్టడాలు మాత్రమే కావని, వాటికి మనుషులతో ఉన్న అనుబంధమే అసలైన జీవమని ఆయన తన కళ ద్వారా చాటిచెబుతున్నారు. కేవలం ఇటుకలే కాకుండా ఈ ఆర్ట్ ఫెయిర్‌లో కళాకారులు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ, అనేక వినూత్న ప్రయోగాలు చేశారు. మహిళల రక్షణను ఉద్దేశించి బ్లేడ్లతో తయారు చేసిన ‘అన్ టచబుల్’ బ్రాలెట్, దీపావళి టపాసుల (పాపింగ్ స్ట్రిప్స్) తో సృష్టించిన కళాఖండాలు, చన్నపట్నం చెక్క బొమ్మలతో రూపొందించిన భారీ ఛాండ్లియర్ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మనం నిత్యజీవితంలో చూసే వస్తువుల వెనుక ఎంతో శక్తివంతమైన కథలు ఉంటాయని ఈ 17వ ఇండియా ఆర్ట్ ఫెయిర్ నిరూపిస్తోంది.
ఇది కూడా చదవండి: UAE: స్కూళ్లు బంద్.. సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా


