హోలీలో విషాదం: మనవడిపై నాన్నమ్మ పైశాచికం | Woman throws scalding hot water on grandson | Sakshi
Sakshi News home page

హోలీలో విషాదం: మనవడిపై నాన్నమ్మ పైశాచికం

Mar 5 2026 8:51 AM | Updated on Mar 5 2026 9:01 AM

Woman throws scalding hot water on grandson

నాగ్‌పూర్: రంగుల పండుగ హోలీ వేళ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అల్లరి చేస్తూ, తనపై రంగు చల్లాడన్న కోపంతో, మనవడిపై ఒక నాన్నమ్మ తన పైశాచికాన్ని చూపింది. నాగ్‌పూర్ జిల్లా కోరాడి ప్రాంతంలోని ఆరామ్‌షీన్ వార్డు-2లో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ ఉదంతానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓమ్ అనే నాలుగేళ్ల బాలుడు తన ఇంటి బయట రంగుల నీళ్ల బాటిల్‌తో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అతడి నాన్నమ్మ సింధు థాకరే కట్టెల పొయ్యిపై నీళ్లు కాచుకుని బకెట్‌తో వెళుతోంది. ఇంతలో ఆ బాలుడు పొరపాటున ఆమెపై రంగు నీళ్లు జల్లాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సింధు.. తన చేతిలో ఉన్న మరుగుతున్న నీళ్లను ఆ బాలునిపై పోసింది. ఈ ఊహించని దాడితో ఆ పసివాడు విలవిలలాడిపోయాడు.

ఆ సమయంలో అక్కడే ఉన్న మరో మహిళ వెంటనే స్పందించి, ఆ చిన్నారిపై చన్నీళ్లు పోసి, ఉపశమనం కలిగించే ప్రయత్నించింది. ఆ తర్వాత నిందితురాలు కూడా పశ్చాత్తాపంతో బాలునిపై చన్నీళ్లు పోయడం వీడియోలో కనిపించింది. ఈ ఘటనలో బాలుడికి నడుము కింది భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సుమారు 45 శాతం మేర శరీరం కాలిపోవడంతో బాలుడిని నాగ్‌పూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  నిందితురాలు సింధు థాకరేపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బారాబంకిలో ఘర్షణ
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో హోలీ వేడుకలు హింసాత్మకంగా మారాయి. రంగులు చల్లుకునే విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం చివరికి ముష్టిఘాతాలకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేసుకోవడంతో  11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 10 నిమిషాల పాటు కొనసాగిన ఈ  ఘర్షణ స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ప్రత్యర్థి వర్గం తన ఇంట్లోకి చొరబడి ఆడవారిపై కూడా దాడులు చేశారని స్థానికుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇది కూడా చదవండి: ‘నీలి విషం’ బారిన 61 శాతం భారతీయులు

Advertisement
 
Advertisement
Advertisement