భారత్‌కు పుతిన్‌ భారీ సాయం | Russia says ready to ship oil barrels to India Amid supply crisis | Sakshi
Sakshi News home page

భారత్‌కు పుతిన్‌ భారీ సాయం

Mar 5 2026 7:54 AM | Updated on Mar 5 2026 8:46 AM

Russia says ready to ship oil barrels to India Amid supply crisis

ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ చమురు నిల్వలు భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రష్యా మరోసారి భారత్‌కు అండగా నిలిచింది. ఇరాన్‌తో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్‌కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఏకంగా 95 లక్షల బ్యారెళ్ల చమురు కొన్ని వారాల్లోనే భారత్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో హార్మోజ్‌ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోయింది. భారత్‌ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో దాదాపు 40% హార్మోజ్‌ ద్వారా జరుగుతోంది. భారత్‌ వద్ద ప్రస్తుతం కేవలం 25 రోజులకు సరిపడ ముడి చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధమైనట్టు తెలిసింది. భారతీయ సముద్ర జలాలకు సమీపంలోనే ఉన్న నౌకలలోని దాదాపు 95 లక్షల బ్యారెళ్ల చమురు కొన్ని వారాల్లోనే భారత్‌ చేరుకోగలదని పరిశ్రమ వర్గాలు రాయిటర్స్‌ వార్తాసంస్థకు తెలిపాయి.

అయితే.. రష్యన్‌ చమురు నౌకల అసలు గమ్యస్థానం వివరాలను మాత్రం వెల్లడించడానికి సదరు పరిశ్రమ వర్గాలు నిరాకరించాయి. దీంతో, రిఫైనరీ సంస్థలకు ఊరట కలిగిస్తూ కొన్ని వారాల్లోనే ఈ చమురు నౌకలు భారత్‌ చేరుకుంటాయని మాత్రం వారు వెల్లడించారు. అదేవిధంగా గ్యాసాయిల్‌, గ్యాసోలిన్‌, ఎల్‌పీజీ కూడా పరిమిత పరిమాణంలోనే రిఫైనరీల వద్ద ఉన్నాయి. రానున్న 10-15 రోజులు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

ప్రస్తుతం యుద్ధం కారణంగా జలసంధి మార్గం దాదాపు మూతపడడంతో ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత్‌ అన్వేషించక తప్పని పరిస్థితి నెలకొంది. భారతీయ రిఫైనరీలు రోజుకు సుమారు 56 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తాయి. అమెరికా-ఇజ్రాయెల్‌ ఉమ్మడి దాడులు దరిమిలా ఇరాన్‌ ప్రతిదాడులకు పాల్పడడంతో హార్మోజ్‌ జలసంధి సమీపంలో వందలాది చమురు నౌకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చమురు సరఫరాకు రష్యా అంగీకరించినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement