రాజ్యసభ బాటలో నితీశ్‌? | Bihar CM Nitish Kumar may resign to join Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభ బాటలో నితీశ్‌?

Mar 5 2026 5:00 AM | Updated on Mar 5 2026 5:00 AM

Bihar CM Nitish Kumar may resign to join Rajya Sabha

నబీన్‌తో పాటుగా నేడు నామినేషన్‌! 

సీఎం పదవికి రాజీనామా యోచన 

కుమారుని కోసం బీజేపీతో ఒప్పందం 

సీఎం పీఠం బీజేపీకి, డిప్యూటీగా నిశాంత్‌ 

మలుపు తిరగనున్న బిహార్‌ రాజకీయాలు?

పట్నా/న్యూఢిల్లీ: బిహార్‌ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయా? జేడీ(యూ) సారథి నితీశ్‌ శకానికి తెర పడనుందా? ఏకంగా పదిసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి రికార్డు సృష్టించిన ఆయన గద్దె దిగనున్నారా? సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికై హస్తిన వెళ్లనున్నారా? ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి అప్పగించి, బదులుగా తన కుమారున్ని ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూచోబెట్టనున్నారా? ఈ మేరకు వెలువడుతున్న వార్తలు, ఊహాగానాలు సంచలనం రేపుతున్నాయి. 

నితీశ్‌కుమార్‌ రాజకీయ వారసునిగా ఆయన తనయుడు నిశాంత్‌ కుమార్‌ పేరు కొంతకాలంగా తెరపైకి వస్తోంది. నిశాంత్‌ త్వరలో రాజకీయ తీర్థం పుచ్చుకుంటారని జేడీ(యూ) నేత, రాష్ట్ర మంత్రి శ్రవణ్‌కుమార్‌ మంగళవారమే ప్రకటించారు కూడా. ఆయన్ను ఎన్డీఏ తరఫున రాజ్యసభకు పంపనున్నట్టు ఆ వెంటనే వార్తలొచ్చాయి. కానీ బుధవారం ఉదయానికల్లా పరిస్థితి మారిపోయింది. సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని నితీశ్‌ నిర్ణయించుకున్నట్టు మీడియా సంస్థల్లో వరుస కథనాలు మొదలయ్యాయి. 

కుమారుని రాజకీయ భవితవ్యం కోసమే నితీశ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అవి చెప్పుకొచ్చాయి. సీఎం పదవిని బీజేపీకి అప్పగించేలా, బదులుగా నిశాంత్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టేలా ఒప్పందం కుదిరిందని పేర్కొన్నాయి. రాజ్యసభకు వెళ్లే అంశాన్ని నితీశ్‌ తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి విజయ్‌కుమార్‌ చౌధురి స్పష్టం చేశారు. నిశాంత్‌ రాజకీయ రంగ ప్రవేశానికి కూడా రంగం సిద్ధమైందని ఆయన చెప్పారు. గురువారం ఉదయం 11.30కు నితీశ్‌ అసెంబ్లీకి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేయనున్నట్టు జేడీ(యూ) నేతలను ఉటంకిస్తూ విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.]

 బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ కూడా బిహార్‌ నుంచే రాజ్యసభ బరిలో దిగుతుండటం తెలిసిందే. ‘‘నబీన్‌తో పాటుగా నితీశ్‌ కూడా నామినేషన్‌ వేయనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది’’అని వివరించాయి. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక, అంటే మార్చి 16 అనంతరం సీఎం పదవికి నితీశ్‌ రాజీనామా చేయొచ్చని తెలిపాయి. బుధవారం పట్నాలో నెలకొన్న రాజకీయ హడావుడి కూడా ఈ దిశగా పలు సంకేతాలిచి్చంది. జేడీ(యూ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ ఝా హుటాహుటిన ఢిల్లీ నుంచి పట్నా చేరుకుని నితీశ్‌తో మూడు గంటలకు పైగా సుదీర్ఘ మంతనాలు జరిపారు. 

బీజేపీ నుంచి సీఎం పదవి చేపట్టేది ఎవరన్న చర్చ కూడా ఇప్పటికే జోరందుకుంది. గతేడాది జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 243 సీట్లకు గాను బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఏకంగా 202 స్థానాలతో ఘనవిజయం సాధించడం తెలిసిందే. బీజేపీకి 89 స్థానాలు రాగా భాగస్వామ్య పక్షాలైన జేడీ(యూ) 85, లోక్‌ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్‌) 19 స్థానాలు నెగ్గాయి. సంఖ్యా బలం రీత్యా బిహార్‌లో ఎన్డీఏ కూటమికి నాలుగు రాజ్యసభ స్థానాలు దక్కడం ఖాయం. వాటిలో బీజేపీ తన రెండు స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. జేడీ(యూ) ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోకున్నా కేంద్ర మంత్రి రామ్‌నాథ్‌ ఠాకూర్‌ను మరోసారి కొనసాగించడం ఖాయమైంది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు గురువారమే చివరి తేదీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement