ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆందోళన చెందుతున్నట్టుగా నిత్యావసర ధరలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పూణేలో నిత్యాసవరాలు ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే రవాణా ఖర్చులు పెరిగి, అన్ని రాష్ట్రాల్లోనూ నూనె ధరలు మరో 10-15శాతం పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యుద్ధ వాతావరణం నేపథ్యంలోని పూణేలోని సామాన్యులవంటగదిపై ప్రభావం చూపుతోంది. వంట నూనెలు, పప్పుధాన్యాలు , డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగిపోయాయి. హోల్ సేల్ మార్కెట్‌లో లీటరుకు రూ. 3-4 వరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల సోయాబీన్, పామాయిల్ వంటి వాటిని బయోడీజిల్ తయారీకి మళ్లిస్తున్నారు. దీనివల్ల ఆహార అవసరాలకు నూనెల కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి.
డ్రై ఫ్రూట్స్: ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి రావాల్సిన షిప్‌మెంట్‌లు ఆగిపోవడంతో ఖర్జూరం ధరలు 10-20శాతం పెరిగాయి. బాదం, పిస్తా ధరలు కూడా 5-8శాతం వరకు పెరిగాయి.
ఇదీ చదవండి: మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్ డీల్ హాట్ టాపిక్
ఇతర రాష్ట్రాల పరిస్థితి
ప్రస్తుతం భారతదేశం వంట నూనెల అవసరాలలో సుమారు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ మార్పులు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు లీటరుకు 5 - 10 వరకు పెరిగాయి. పండుగల సీజన్ దగ్గర పడుతుండటంతో డిమాండ్ పెరిగి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వేరుశనగ నూనెకు ప్రధాన కేంద్రమైన గుజరాత్‌లో ఎగుమతులు ప్రభావితమై దేశీయంగా ధరల్లో కొంత అస్థిరత కనిపిస్తోంది. సోయాబీన్ , ఆవనూనె ఎక్కువగా పండే మధ్యప్రదేశ్ , రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా స్థానిక మార్కెట్లలో ధరలు స్వల్పంగా పెరిగాయి.
ఇదీ చదవండి: దేశంలో చమురు నిల్వల పరిస్థితి ఏంటి? ఎల్‌పీజీ దొరుకుతుందా?


