భారత్‌ గ్లోబల్‌ పవర్‌గా ఎదగకుండా చేయడానికే..: ఖమేనీ ప్రతినిధి | US conflict with Iran aims to block rise of India, China as global powers: Khamenei's envoy to New Delhi | Sakshi
Sakshi News home page

భారత్‌ గ్లోబల్‌ పవర్‌గా ఎదగకుండా చేయడానికే..: ఖమేనీ ప్రతినిధి

Mar 4 2026 12:42 PM | Updated on Mar 4 2026 1:15 PM

US conflict with Iran aims to block rise of India, China as global powers: Khamenei's envoy to New Delhi

న్యూఢిల్లీ: భారత్‌తో పాటు చైనాను గ్లోబల్‌ పవర్స్‌గా ఎదగకుండా చేయడానికే తమ దేశంతో అమెరికా ఘర్షణలకు దిగుతోందని ఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి (ఖమేనీ ప్రతినిధి) అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో అబ్దుల్ మజీద్ ఇవాళ ఢిల్లీలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయం నుంచి భారత్‌కు ప్రత్యేక ప్రతినిధిగా అబ్దుల్ మజీద్ ఉన్నారు.

అమెరికా అగ‍్రరాజ్య హోదాను నిలుపుకోవడానికి ప్రపంచ ఘర్షణలను ప్రోత్సహిస్తోందని అబ్దుల్ మజీద్ ఆరోపించారు. “సమీప భవిష్యత్తులో ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాలుగా భారత్, చైనా, రష్యా, అమెరికా ఉంటాయి. అయితే, భారత్ లేదా చైనా తనతో పాటు సమాన శక్తులుగా ఎదగడాన్ని అమెరికా జీర్ణించుకోదు. అందుకే దీన్ని అడ్డుకోవడానికి ఈ యుద్ధాలను ప్రేరేపించి అమెరికా తన ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటోంది” అని అబ్దుల్ మజీద్ చెప్పారు.

అమెరికా ప్రారంభించిన యుద్ధమిది..
ఈ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్ అని, ఇరాన్ కాదని అబ్దుల్ మజీద్ తెలిపారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నుంచి తమ దేశం తనను తాను రక్షించుకుంటోందని ఇరాన్‌ భద్రతాధికారి అలీ లారిజానీ కూడా ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. “మాపై దాడి చేసి మా పౌరులపై బాంబులు వేస్తున్నారు. మేము కేవలం మమ్మల్ని మేము రక్షించుకుంటున్నాం” అని చెప్పారు. యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికానే కాబట్టి దానిని ముగించాల్సింది కూడా ఆ దేశమేనని అబ్దుల్ మజీద్ తెలిపారు. వారు ఆపితే తాము కూడా ఆపుతామని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: భారత్‌కు మరో ఐదు ఎస్‌-400లు.. గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది..

ఇరాన్ రెండు యుద్ధాలు ఎదుర్కొంటోందని అబ్దుల్ మజీద్ తెలిపారు. ఒకటి అమెరికా, ఇజ్రాయెల్‌తో సైనిక ఘర్షణ, మరొకటి నకిలీ వార్తల యుద్ధం అని అన్నారు.  “అమెరికా, ఇజ్రాయెల్‌పై సైనిక యుద్ధాన్ని మేము ఎదుర్కోగలం. అయితే దీనికంటే పెద్ద మరో యుద్ధం జరుగుతోంది. అదే నకిలీ కథనాల యుద్ధం. ఈ యుద్ధంలో వారు నకిలీ వార్తలు సృష్టిస్తారు. ఇరాన్ ప్రజలు పాలన మార్పు కోరుకుంటున్నారని చెబుతారు” అని ఆయన అన్నారు. మొత్తానికి ఇతర దేశాల ఎదుగుదలను అడ్డుకోవడమే అమెరికా లక్ష్యమని, తద్వారా వాషింగ్టన్‌కు తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement