పశ్చిమాసియాలో యుద్ధం వేళ.. ఎస్-400లపై భారత్‌ కీలక నిర్ణయం | Indian Air Force Gets Defence Board Nod To Buy 5 S-400s Air Defence Systems From Russia, More Details Inside | Sakshi
Sakshi News home page

భారత్‌కు మరో ఐదు ఎస్-400లు.. గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది..

Mar 4 2026 11:06 AM | Updated on Mar 4 2026 11:17 AM

Indian Air Force gets defence board nod to buy 5 S-400s from Russia

న్యూఢిల్లీ: రష్యా నుంచి మరో ఐదు ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత వాయుసేన చేసిన ప్రతిపాదనకు డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ బోర్డ్‌ (డీపీబీ) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో బాలిస్టిక్ క్షిపణులు, కామికాజీ డ్రోన్లదే ఆధిపత్యం. ఈ ఘర్షణ పరిస్థితుల మధ్య ఎస్-400 కొనుగోళ్లకు డీపీబీ నుంచి నిర్ణయం రావడం గమనార్హం.

కొనుగోలు ప్రతిపాదనలను డీపీబీ పరిశీలించి, తదుపరి దశకు పంపించే బాధ్యత వహిస్తుంది. భారత వాయుసేన ప్రతిపాదనకు రక్షణ కార్యదర్శి రాజేశ్‌ కుమార్ సింగ్ నేతృత్వంలోని డీపీబీ తాజాగా ఆమోదముద్ర వేయడంతో ఇప్పుడు ఇది రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) వద్దకు వెళ్తుంది. ఎస్‌-400ల కొనుగోళ్ల అవసరం ఉందని డీఏసీ అధికారికంగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. డీఏసీ ఆమోదం తెలిపిన తర్వాతే ధర నిర్ణయ కమిటీ ఏర్పాటు అవుతుంది. కొనుగోలు ధర నిర్ణయించిన తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్‌) తుది ఆమోదం తెలుపుతుంది.

ప్రస్తుతం భారతదేశం వద్ద మూడు ఎస్-400 వ్యవస్థలు ఉన్నాయి. మరో రెండు ఈ ఏడాది భారత సాయుధ దళాల్లో చేరనున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400 వ్యవస్థ అద్భుతంగా పని చేసింది. భారత్ శత్రు వైమానిక స్థావరాలు, గగన రక్షణ రాడార్లు, కమాండ్ నియంత్రణ వ్యవస్థలపై దాడి చేసినప్పుడు పాకిస్థాన్ యుద్ధ విమానాలు,  ఎలక్ట్రానిక్ స్పై విమానాలు మన గగనతలంలోకి రాకుండా ఎస్-400 నిరోధించింది. 2025 మే 10న తెల్లవారుజామున బ్రహ్మోస్ రావల్పిండిలోని చక్లాలా వైమానిక స్థావరంలో పాకిస్థాన్ వాయుసేన ఉత్తర కమాండ్ నియంత్రణ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసింది.  ఆ తర్వాత పాకిస్థాన్ భయపడిపోయి చర్చలకు ముందుకు వచ్చింది.

ఇది చదవండి: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా?

రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పుడు 13 రష్యా పాంట్సిర్ ఎస్-1 స్వయంచాలిత (సెల్ఫ్‌-ప్రొపెల్లెడ్‌) క్షిపణి వ్యవస్థ కొనుగోలు ప్రతిపాదన కోసం ఎదురుచూస్తోంది. ఈ ప్రతిపాదన భారత వాయుసేన, ఆర్మీ నుంచి రావాల్సి ఉంది. ఇవి భూమి నుంచి గగనతలంలోని లక్ష్యాలను టార్గెట్‌ చేసే మధ్య శ్రేణి క్షిపణులు, స్వల్పశ్రేణి రాకెట్లు, కామికాజీ డ్రోన్లను ఎదుర్కొంటాయి.   

Advertisement
 
Advertisement
Advertisement