కూర చేసే విషయంలో అత్తతో మనస్పర్ధలు.. టెక్కీ ఆత్మహత్య | Bengaluru Techie Dies After Dispute With Mother-In-Law Over Cooking | Sakshi
Sakshi News home page

కూర చేసే విషయంలో అత్తతో మనస్పర్ధలు.. టెక్కీ ఆత్మహత్య

Mar 4 2026 9:46 AM | Updated on Mar 4 2026 10:17 AM

Bengaluru Techie Dies After Dispute With Mother-In-Law Over Cooking

బెంగళూరు: కూర చేసే విషయంలో అత్తతో మనస్పర్ధలు తలెత్తడంతో టెక్కీగా విధులు నిర్వహిస్తున్న కోడలు ఆత్మహత్య చేసుకుంది. కోడలి ఆత్మహత్యతో అత్త పరారైంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

భారత్‌ సిలికాన్‌ సిటీ బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టెక్‌ కంపెనీ డెల్‌ మాజీ ఉద్యోగి సుష్మ(35) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఐదేళ్ల క్రితం పునీత్ కుమార్‌తో సుష్మ వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు. బెంగళూరులో నివాసం ఉంటున్నారు.

అయితే, పునీత్‌కుమార్‌ దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం సుష్మ, ఆమె అత్త కల్పన మధ్య వంట చేసే విషయంలో వాగ్వాదం జరిగింది. అత్త తనను వంట చేసేందుకు అనుమతించకపోవడంతో పాటు ఇతర విషయాల్లో తనని వేధిస్తుందని మనోవేధనకు గురైంది. దీంతో ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కానీ సుష్మ కుటుంబ సభ్యులు మాత్రం అత్తింటి అరళ్లకు తాళలేక తమ కుమార్తె ప్రాణం తీసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుష్మ కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్త పునీత్‌కుమార్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అత్తకోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement