‘పహల్గాం’ దర్యాప్తు: ‘గోప్రో’లో కీలక రహస్యాలు? | Pahalgam attack NIA approaches China for GoPro Camera | Sakshi
Sakshi News home page

‘పహల్గాం’ దర్యాప్తు: ‘గోప్రో’లో కీలక రహస్యాలు?

Mar 3 2026 8:59 AM | Updated on Mar 3 2026 9:05 AM

Pahalgam attack NIA approaches China for GoPro Camera

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోర ఉగ్రదాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడులకు సంబంధించిన కీలక ఆధారంగా భావిస్తున్న ఒక 'గోప్రో' (GoPro) కెమెరా మూలాలను వెతుక్కుంటూ భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇప్పుడు చైనా గడప తొక్కేందుకు సిద్ధమయ్యింది. నాడు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 25 మంది పర్యాటకులతో పాటు  స్థానికుడొకరు ప్రాణాలు కోల్పోయిన తెలిసిందే. ఈ దాడికి ముందు ఉగ్రవాదులు నిర్వహించిన రేక్కీ, వారి కదలికలకు సంబంధించిన దృశ్యాలు 'గోప్రో హీరో 12 బ్లాక్' కెమెరాలో నిక్షిప్తమైనట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ క్రమంలో ఆ పరికరానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు చైనా ప్రభుత్వానికి ‘లెటర్ రోగేటరీ’ పంపేందుకు జమ్ము కోర్టు ‘ఎన్ఐఏ’కు అనుమతినిచ్చింది.

దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ తొలుత నెదర్లాండ్స్‌లోని గోప్రో తయారీ సంస్థను సంప్రదించగా, విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఆ నిర్దిష్ట సీరియల్ నంబర్ గల కెమెరాను చైనాకు చెందిన ‘ఏఈ గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్’ అనే డిస్ట్రిబ్యూటర్ సంస్థకు సరఫరా చేసినట్లు తయారీదారు తెలిపారు. అంతేకాకుండా ఈ పరికరం 2024, జనవరి 30న చైనాలోని డాంగ్‌గువాన్ ప్రాంతంలో యాక్టివేట్ అయినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా తెలిసింది. అయితే ఆ తర్వాత ఆ కెమెరా ఎవరి చేతులు మారింది? అంతిమంగా ఉగ్రవాదుల వద్దకు ఎలా చేరింది? అనే  వివరాలు తమ వద్ద లేవని సదరు సంస్థ పేర్కొంది. దీంతో ఆ కెమెరాను కొనుగోలు చేసిన వ్యక్తి, దాని వినియోగదారుడు, దానికి సంబంధించిన సాంకేతిక రికార్డులను సేకరించేందుకు చైనా అధికారుల న్యాయ సహాయం తప్పనిసరని ఎన్ఐఏ భావిస్తోంది.

భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన ఈ పహల్గాం దాడి అనంతరం భారత్ అత్యంత కఠినంగా స్పందించింది. గత ఏడాది మే 7వ తేదీ తెల్లవారుజామున ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి, శత్రువుల నెట్‌వర్క్‌ను దెబ్బతీసింది. ఈ దాడులకు ప్రధాన కారకులైన సులైమాన్ షా, హమ్జా అఫ్గానీ అలియాస్ అఫ్గాన్, జిబ్రాన్ అనే ముగ్గురు ఉగ్రవాదులను దాచిగామ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

ఇది కూడా చదవండి: నేడు ఆకాశంలో అద్భుతం.. అంతటా ‘బ్లడ్ మూన్’ సందడి!

Advertisement
 
Advertisement
Advertisement