పేట్రేగుతున్న పేకాట గ్యాంగ్‌ | Poker players attack sarpanch | Sakshi
Sakshi News home page

పేట్రేగుతున్న పేకాట గ్యాంగ్‌

Mar 2 2026 2:35 AM | Updated on Mar 2 2026 2:35 AM

Poker players attack sarpanch

సర్పంచ్‌ వి.శ్రీను

పోలీసులకు సమాచారం ఇచ్చాడనే అనుమానంతో సర్పంచ్‌పై దాడి 

బ్లేడుతో గొంతు కోస్తామని బెదిరింపులు

రక్షణ కల్పించాలంటున్న పలుకూరు సర్పంచ్‌ 

కందుకూరు రూరల్‌: రాష్ట్రవ్యాప్తంగా పేకాట రాయుళ్లు పేట్రేగిపోతున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఓ సర్పంచ్‌పై పేకాట నిర్వాహకులు దాడికి తెగబడిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. పలుకూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఓ బడ్డీ కొట్టు నిర్వాహకుడి ఆధ్వర్యంలో స్థానిక పొలాలు, కుంటల సమీపంలో నిత్యం పేకాట జోరుగా నిర్వహిస్తున్నారు. పేకాట శిబిరానికి వచ్చేవారికి పి.జయరాం అనే వ్యక్తి అవసరమైన సరంజామా ఏర్పాటు చేస్తుంటాడు.

 ఈ క్రమంలో పోలీసులు ఇటీవల పేకాట నిర్వాహకులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి బైండోవర్‌ చేశారు. ఆదివారం ఉదయం పేకాట నిర్వాహకుడికి చెందిన బడ్డీ కొట్టు వద్ద సర్పంచ్‌ వి.శ్రీనుకు జయరాంతో మాటామాట పెరిగి గొడవకు దారి తీసింది. పేకాట నిర్వహణపై పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటావని అనుమానిస్తూ సర్పంచ్‌పై దాడికి దిగాడు. దాడిలో సర్పంచ్‌కు గాయాలయ్యాయి. బ్లేడ్లతో గొంతు కోసి చంపుతామని బెదిరిస్తున్నారని పోలీసులు తనకు రక్షణ కల్పించాలని సర్పంచ్‌ కోరుతున్నారు. 

టీడీపీకి చెందిన కొందరు కుట్రతోనే రెచ్చగొట్టి తనపై దాడికి ఉసిగొల్పారని సర్పంచ్‌ వాపోయారు. అయితే నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో పలుకూరులో పేకాట జోరుగా సాగుతోంది. గ్రామంలో రోజూ రూ.లక్షల్లో ఆట జరుగుతుండడంతో పేకాట నిర్వాహకుడితో పాటు స్థానిక నేతలకు భారీగా కమీషన్‌ ముడుతున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement