అన్యాయాన్ని ప్రతిఘటించలేని ప్రభుత్వం ఎందుకు? | Roundtable meeting with YSRCP leaders from Rayalaseema Nellore and Prakasam districts | Sakshi
Sakshi News home page

అన్యాయాన్ని ప్రతిఘటించలేని ప్రభుత్వం ఎందుకు?

Mar 2 2026 2:13 AM | Updated on Mar 2 2026 2:13 AM

Roundtable meeting with YSRCP leaders from Rayalaseema Nellore and Prakasam districts

రాయలసీమ ఎత్తిపోతల ఇన్సూరెన్స్‌ లాంటి ప్రాజెక్టు

మనవేలితో మనకంటినే పొడుస్తున్నారు

ఇది సీఎం చంద్రబాబు తెలిసి చేస్తున్న అన్యాయం 

ప్రజల్లో ధర్మాగ్రహం రావాలి 

చంద్రబాబు సర్కార్‌ చేస్తున్న ద్రోహంపై క్షేత్రస్థాయి పోరాటాలకు సన్నాహాలు 

గ్రేటర్‌ రాయలసీమ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు 

సాక్షి ప్రతినిధి, కడప: పక్క రాష్ట్రాలు అన్యాయం చేస్తుంటే ప్రతిఘటించలేని ప్రభుత్వం ఎందుకని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. రాయలసీమకు జీవనాడి వంటి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనుల్ని వెంటనే పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కలి­సొచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు. కడపలో ఆదివారం రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పూర్తికోసం భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించడానికి ఉమ్మడి రాయలసీమ, నెల్లూరు, ప్రకా­శం జిల్లాల వైఎస్సార్‌సీపీ నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. 

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర కో–ఆరి్డనేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎగువ రాష్ట్రాలు చేస్తున్న అన్యాయానికి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఒక ఇన్సూరెన్స్‌ లాంటిదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి ఈ ప్రాజెక్టును చేపట్టి 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. ఇది ఒక జిల్లాకో, నాలుగు జిల్లాలకో సంబంధించిన సమస్య కాదని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయమని చెప్పారు. ఇది రాయలసీమకు చంద్రబాబు తెలిసి తెలిసి చేస్తున్న అన్యాయమన్నారు. 

రాయలసీమలోని మిగిలిన పెండింగ్‌ ప్రాజెక్టులపై కూడా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టే అవసరం లేదని, 20 టీఎంసీలతో ఒరిగేదేం లేదని, ప్రాజెక్టు మొదలేకాలేదని దుష్ప్రచారం చేయ­డం దారుణమని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తికాకపోతే ఈ ప్రాంతం నాలుగు దశాబ్దాలు వెనక్కిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు అనుమతులు లేవంటున్నారు సరే...అల్మట్టి ఏ అనుమతులతో కట్టారు, తెలంగాణలోని కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ఏ అనుమతులతో నిర్మించారో చెప్పాలని కోరారు. 

అల్మట్టి ఎత్తు పెంచేటప్పుడు, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టేటప్పుడు కూడా చంద్రబాబే సీఎంగా ఉన్నారని గుర్తుచేశారు. పక్క రాష్ట్రాలు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అల్మట్టి, దిండి, పాలమూరు–రంగారెడ్డి తదితర అక్రమ ప్రాజెక్టుల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడరని నిలదీశారు. పొరుగు రాష్ట్రాలు చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను చట్టపరంగా అడ్డుకోవాలని కోరారు. కర్ణాటక, తెలంగాణ వారు వారి అవసరాల కోసం ప్రాజెక్టులు కట్టుకుంటున్నారని, మనం కూడా ఆ విధంగా నిర్మించుకోకుండా పోతే భవిష్యత్‌ తరాలు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. 

కేంద్రంలో చంద్రబాబుకు పలుకుబడి ఉండి కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోలేకపోవడం దురదృష్టకరమన్నారు. శ్రీశైలం నుంచి 101 టీఎంసీలను తీసుకోవడానికి ఉద్దేశించి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ ప్రాజెక్టును చేపట్టారని, ఇదే తప్పు అన్నట్టు ప్రచారం చేయడం దారుణమని పేర్కొన్నారు. మనవేలితో మనకన్నే పొడిచే విధంగా చేస్తున్నారని, దీన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై చర్చ జరిగే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు. 

కళాశాలలు, యూనివర్సిటీల్లోని యువతలో కూడా చర్చ జరిగే దిశగా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రజలు కిందిస్థాయి టీడీపీ నాయకుల నుంచి చంద్రబాబు వరకు ఈ అంశంపై ప్రశ్నించాలని కోరారు. టీడీపీతోపాటు కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులను సైతం ప్రశ్నించాలని సూచించారు. రాయలసీమ లిఫ్ట్‌ కోసం జరిగే ఉద్యమంలో రానున్న రోజుల్లో తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రత్యక్షంగా పాల్గొంటారని చెప్పారు.

రైతులు, విద్యార్థులను భాగస్వాములను చేసి పోరాటం 
రాయలసీమ లిఫ్ట్‌ సాధన కో–ఆరి్డనేటర్‌ సాకే శైలజానాథ్, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లాల అధ్యక్షులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి (వైఎస్సార్‌ కడప), కాకాణి గోవర్థన్‌రెడ్డి (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు), అనంత వెంకట్రావిురెడ్డి (అనంతపురం), ఉషశ్రీ చరణ్‌ (శ్రీసత్యసాయి), ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి (అన్నమయ్య), ఎస్‌.వి.మోహన్‌రెడ్డి, (కర్నూలు), కాటసాని రాంభూపాల్‌రెడ్డి (నంద్యాల) మాట్లాడుతూ కృష్ణా పరీవాహక ప్రాంతం భవిష్యత్‌లో నీళ్లులేని దుర్భిక్షప్రాంతంగా మారనుందని చెప్పారు. 

రానున్న రోజుల్లో శ్రీశైలం నిండి రాయలసీమకు నీరు రావడం గగనమవుతుందన్నారు. ఎంతో ముందుచూపుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కోసం మార్చిలో జిల్లాస్థాయిలో, ఏప్రిల్, మే నెలల్లో నియోజకవర్గస్థాయిలో, జూన్, జూలై నెలల్లో మండలస్థాయిలో, ఆగస్టులో గ్రామస్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిచేయాలని రచ్చబండ కార్యక్రమాల్లో తీర్మానాలు చేయాలన్నారు. 

నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని విమర్శించారు. మొదట 17 టీఎంసీలున్న అల్మట్టి సామర్థ్యాన్ని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కర్ణాటక 125 టీఎంసీలకు పెంచిందని, ఇప్పుడు మళ్లీ ఆయన సీఎంగా ఉన్నప్పుడే 229 టీఎంసీలకు పెంచబోతోందని వారు పేర్కొన్నారు. రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానాలను సాకే శైలజానాథ్‌ చదివి వినిపించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement