ఇది రాజకీయ అంశం కాదు... అందరం కలిసి పోరాడదాం: సజ్జల | Sajjala Ramakrishna Reddy Calls For Rayalaseema Lift Irrigation Project To Become A Peoples Movement, More Details | Sakshi
Sakshi News home page

ఇది రాజకీయ అంశం కాదు... అందరం కలిసి పోరాడదాం: సజ్జల

Mar 1 2026 4:11 PM | Updated on Mar 1 2026 6:05 PM

Sajjala Calls for Rayalaseema Lift Irrigation Project to Become a Peoples Movement

కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.   వైఎస్‌ జగన్‌ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.78 అడుగులు నిర్మిస్తుంటే.. చంద్రబాబు వచ్చి దాన్ని 41 అడుగులకు కుదించారని మండిపడ్డారు.  కేంద్ర ప్రభుత్వం ఎత్తు కుదిస్తుంటే చంద్రబాబు కిమ్మనలేదన్నారు. ప్రతీ రైతు దీని గురించి ప్రశ్నించాలి.. ప్రతీ ఇంట్లో చర్చ జరగాలి.. ఇది రాజకీయ సమస్య కాదని సజ్జల తెలిపారు. 

‘మన హక్కును మనం రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటం ఇది.  ప్రతి ఒక్కరూ కింది స్థాయి టీడీపీ నాయకుడి నుంచి చంద్రబాబు వరకూ వారిని ప్రశ్నించాలి. కూటమిలో సభ్యులైన జనసేన, బీజేపీ నాయకులను సైతం ప్రశ్నించాలి. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను చంద్రబాబు వెంటనే మొదలు పెట్టాలి. పక్క రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను చట్టపరంగా అడ్డుకోవాలి.  అడ్డగోలుగా కడుతున్న ప్రాజెక్టులను ఆపించే ప్రయత్నం చేయాలి. కేంద్రంలో భాగస్వామిగా ఉంటే అదనంగా తీసుకురావాల్సింది పోయి...ఉన్నవాటిని కట్‌ చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ఆనాడు కేంద్రంలో భాగస్వామి కాకపోయినా పోలవరాన్ని 45 మీటర్లకు నిర్మిస్తే..భాగస్వామిగా ఉండి చంద్రబాబు 41 మీటర్లకు కుదించేందుకు ఒప్పుకోవడం దారుణం.  చంద్రబాబు 2014–19 మధ్య పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నం చేస్తే.. జగన్‌ వచ్చాక పోరాడి నిధులు సాదించి 45 మీటర్ల మేర పనిచేశారు. 

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని వదిలేసి..ఎప్పుడో దశాబ్ధాలు పట్టే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. మా పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్‌..దాన్ని నిలబెట్టుకోవడం తక్షణ కర్తవ్యం. రాష్ట్ర రైతాంగంపై చంద్రబాబు  కొట్టబోతున్న దెబ్బ ఎంత నష్టాన్ని చేకూరుస్తుందో ప్రజలు గమనించాలి. పక్క రాష్ట్రాలు అడ్డగోలు ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదో అర్ధం కావడం లేదు. కనీసం ఖండించడమో.. అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా ఉపక్రమించడం లేదు. రాయలసీమ లిఫ్ట్‌ కోసం ప్రజలందరూ భాగస్వామ్యులయ్యేలా మేం ముందుకు అడుగులు వేస్తాం. ఆ దిశగా నేడు గ్రేటర్‌ రాయలసీమ నేతలమంతా సమావేశమయ్యాం. 

ప్రజల్లో చైతన్యం పెంచి...వారిని కూడా ఉద్యమంలోకి తీసుకురావాలని నిర్ణయించాం. కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలన్నిటిని కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రూపకల్పన చేస్తాం. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో చంద్రబాబు ద్రోహంపై చర్చ జరిగేలా చైతన్యవంతులను చేస్తాం. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, కూటమి నేతలపై ఒత్తిడి తీసుకొస్తాం. కళాశాలలు, యూనివర్సిటీల్లోనూ యువతలో చర్చ జరిగే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. భవిష్యత్తులో మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కూడా ఉద్యమంలో పాల్గొంటారు. ఇది రాజకీయ అంశం కాదు...అందరం కలిసి పోరాడదాం’ అని సజ్జల స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement