రఫేల్ విమానాలపై మాక్రాన్‌ కీలక వ్యాఖ్యలు.. | Emmanuel Macron Says Rafale boost to India | Sakshi
Sakshi News home page

రఫేల్ విమానాలపై మాక్రాన్‌ కీలక వ్యాఖ్యలు..

Feb 19 2026 9:54 PM | Updated on Feb 20 2026 11:00 AM

Emmanuel Macron Says Rafale boost to India

ఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. భారత్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. భారత్‌ అంటే తనకు చాలా ఇష్టమని.. ఐ లవ్ యువర్ కంట్రీ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో భారత్‌- ఫ్రాన్స్‌ల మధ్య రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు అంశంలో వస్తున్న విమర్శలను  తోసిపుచ్చారు. ఈ యుద్ధ విమానాలు భారత్‌ను బలీయమైన సైనిక శక్తిగా మారుస్తాయని తెలిపారు. అదేవిధంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయని చెప్పుకొచ్చారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాక్రాన్‌ మాట్లాడుతూ.. భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్న బంధం ప్రత్యేకమైనది. వ్యూహాత్మక ప్రయోజనాలున్న అనేక రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. భారత ప్రభుత్వానికి, దసో ఏవియేషన్‌కు మధ్య జరుగుతున్న చర్చల్లో రఫేల్‌ కొనుగోళ్లు ఓ భాగం. దీనిపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ డీల్‌ భారత్‌ను సైనికపరంగా మరింత శక్తిమంతం చేస్తుంది. స్థానికంగా మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుంది.

ఇటీవల భారత్‌- ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలను ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని నిర్ణయించాం. ఇందులో రఫేల్‌ ఒప్పందం కీలకపాత్ర పోషిస్తుంది. 114 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం, భారత రక్షణ సన్నద్ధతకు వ్యూహాత్మక బలాన్ని ఇస్తుంది’ అని మాక్రాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరిక మేరకు.. ఈ ఒప్పందంలో ‘మేక్ ఇన్ ఇండియా’ విధానానికే పెద్దపీట వేస్తామని మాక్రాన్‌ హామీ ఇచ్చారు. గరిష్ట సంఖ్యలో భారతీయ విడిభాగాలు, కీలక పరికరాలను భారత్‌లోనే తయారు చేయడానికి, నిర్మించడానికి మేం కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement