సంతానోత్సత్తి రేటుపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు | RSS Chief Mohan Bhagwat Backs Three-Child Policy | Sakshi
Sakshi News home page

సంతానోత్సత్తి రేటుపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

Feb 18 2026 11:18 AM | Updated on Feb 18 2026 11:24 AM

RSS Chief Mohan Bhagwat Backs Three-Child Policy

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్‌ మోహన్ భగవత్ హిందువులకు కీలక పిలుపునిచ్చారు. ప్రతి హిందూ కుటుంబం కనీసం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యూపీలోని లక్నోలో జరగిన ఒక  కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుతానికి హిందువులకు ఎటువంటి ముప్పు లేకపోయినప్పటికీ, వివాహంలోని అసలైన ఉద్దేశాన్ని హిందువులు గుర్తుంచుకోవాలన్నారు. కేవలం వ్యక్తిగత కోరికల నెరవేర్పు కోసం మాత్రమే కాకుండా, సృష్టిని ముందుకు తీసుకెళ్లడమే వివాహ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

సగటు సంతానోత్పత్తి రేటు మూడు కంటే తక్కువగా ఉన్న సమాజాలు భవిష్యత్తులో అంతరించిపోయే ప్రమాదం ఉందని వస్తున్న విశ్లేషణలను భగవత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని, హిందూ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలను కనడం గురించి ఆలోచించాలని ఆయన కోరారు. ముఖ్యంగా కొత్తగా వివాహమైన జంటలకు ఈ అంశంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజ మనుగడకు జనాభా సమతుల్యత ఎంతో అవసరమని మోహన్‌ భగవత్‌ అభిప్రాయపడ్డారు.

హిందూ సమాజాన్ని ఐక్యం చేయడంతో పాటు సాధికారత దిశగా అడుగులు వేయాలని భగవత్‌ పిలుపునిచ్చారు. ‘మనకు ప్రస్తుతానికి ఎటువంటి ముప్పు లేదు, కానీ నిరంతరం అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం’ అని ఆయన వ్యాఖ్యానించారు. తగ్గుతున్న హిందూ జనాభా పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూనే, ప్రలోభాలు లేదా బలవంతపు మత మార్పిడులను అరికట్టాలని కోరారు. అలాగే అక్రమ చొరబాటుదారులను గుర్తించి, వారిని దేశం నుండి బహిష్కరించాలని అన్నారు.

‘మాతృశక్తి’ని కుటుంబానికి పునాదిగా అభివర్ణించిన ఆయన మహిళలను ఎప్పుడూ బలహీనులుగా చూడకూడదని భగవత్‌ పేర్కొన్నారు. మహిళలకు ఆత్మరక్షణలో తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. భారతీయ సంప్రదాయం మహిళలకు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చిందని, కేవలం బాహ్య రూపాన్ని బట్టి కాకుండా వారిలోని గుణాలను అనుసరించి గౌరవించడం మన సంస్కృతిలో భాగం అని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి: భారత్‌కు సుందర్ పిచాయ్.. ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement