నింగీనేలా నివ్వెరబోయేలా నీలిసంద్రం యుద్ధనౌకలను మోహరించిందా.. పోటెక్కిన అలలు సమరోత్సాహంతో ఎగసి పడుతున్నాయా.. కెరటాల హోరు స్నేహ శంఖారావం పూరిస్తోందా.. అన్నట్టు అద్భుత విన్యాసాల వీక్షణకు విశాఖ తీరం ముస్తాబైంది.
భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలను చాటేలా.. మిత్రదేశాల సమన్వయంతో జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్), మిలాన్– 2026, ఐయాన్స్ కాన్‌క్లేవ్‌లకు తూర్పు తీరం వేదికవుతోంది.
బుధ, గురువారాల్లో అద్భుత విన్యాసాలతో భారత నౌకాదళం తన సైనిక పరాక్రమ విశ్వ రూప ప్రదర్శనకు సర్వసన్నద్ధమైంది.
ఇండియన్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్)కు ముఖ్య అతిథిగా భారత సర్వసైన్యాధ్యక్షురాలు, దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారు.


