Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

FinanceMinistry asks PSU banks and insurers to cut costs and shift to EVs1
కఠిన పొదుపు దిశగా కదలండి

న్యూఢిల్లీ: కఠిన పొదుపు దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎలక్ట్రిక్‌ వాహనాలకు (ఈవీలు) మళ్లాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, బీమా సంస్థలను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ప్రజలు పెట్రోల్‌/డీజిల్‌ వినియోగాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఈ సూచన చేసింది. బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని, విదేశీ పర్యటనలు మానుకోవాలని, ఇంటి నుంచే పనిచేయాలని, కార్లలో ఒంటరిగా వెళ్లకుండా ఇతరులతో కలసి ప్రయాణించాలంటూ ప్రధాని దేశ ప్రజలను కోరడం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధంతో క్రూడ్, బంగారం ధరలు భారీగా ఎగబాకి.. దిగుమతి బిల్లు భారమవుతోంది. ఫలితంగా రూపాయి నేలచూపులు చూస్తోంది. దీంతో ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, బీమా, ఆర్థిక సంస్థల అధికారులు, సిబ్బందిని ఈవీల్లో ప్రయాణించాలని కోరింది. పెట్రోల్, డీజిల్‌ వాహనాల స్థానంలో ఈవీలను అద్దెకు తీసుకోవాలని సూచించింది. తప్పనిసరి అయితే తప్పించి అన్ని సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్‌ రూపంలో నిర్వహించుకోవాలని కూడా ఆర్థిక శాఖ కోరింది.

Gold industry Body meets with Piyush Goyal to discuss of a Bullion Bank2
బులియన్‌ బ్యాంక్‌ కావాలి

న్యూఢిల్లీ: పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు, అదే సమయంలో ఆభరణాల తయారీకి అవసరమైన పసిడిని దేశీయంగానే సమకూర్చుకునేందుకు జ్యుయలరీ పరిశ్రమ ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టింది. బులియన్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. తద్వారా దేశంలోపలే నిరుపయోగంగా ఉన్న పసిడిని వినియోగంలోని తీసుకురావచ్చని సూచించింది. ఆల్‌ ఇండియా జ్యుయలర్స్‌ అండ్‌ గోల్డ్‌స్మిత్‌ ఫెడరేషన్‌ (ఏఐజేజీఎఫ్‌) ప్రతినిధులతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ నిర్వహించిన సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఇళ్లు, సంస్థలు, పెట్టుబడి వాహకాలు కలిగి ఉన్న బంగారాన్ని సమీకరించి జ్యుయలరీ రంగానికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తగిన కార్యాచరణను రూపొందించాలని ఆభరణాల పరిశ్రమ మంత్రిని కోరింది. బులియన్‌ బ్యాంక్‌ ప్రతిపాదనపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటును పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి నుంచి హామీ లభించింది. ఈ కమిటీని కనుక ఏర్పాటు చేస్తే అందులో ప్రభుత్వం, ఆభరణాల రంగం, బులియన్‌ మార్కెట్, ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి.బ్యాంక్‌ మాదిరే.. ప్రతిపాదిత బులియన్‌ బ్యాంక్‌ అన్నది కేంద్రీకృత సంస్థగా పనిచేయనుంది. ఈ బ్యాంక్‌ దేశీయంగా ఉన్న పసిడిని సమీకరించి, అరువు కింద పరిశ్రమకు ఇస్తుంది. ఇళ్లలోని, సంస్థల నిర్వహణలోని (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు) బంగారాన్ని సమీకరించి.. ఆభరణాల సంస్థలు, ఎగుమతిదారులు, రిఫైనరీలు, తయారీదారులకు సరఫరా చేయనుంది. ఇళ్లు, సంస్థల వద్ద 25,000–35,000 టన్నుల పసిడి ఉంటుందని అంచనా. గోల్డ్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు) సైతం పెద్ద మొత్తంలో భౌతిక బంగారాన్ని (పెట్టుబడులకు బ్యాకెండ్‌గా) ఖజానాల్లో కలిగి ఉన్నాయని ఏఐజేజీఎఫ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈటీఎఫ్‌ల్లోకి వచ్చే ప్రతి రూపాయి తాజా పెట్టుబడికి అనుగుణంగా పసిడి దిగుమతులకు అదనపు డిమాండ్‌ ఏర్పడుతుందని పేర్కొంది. కనుక బులియన్‌ బ్యాంక్‌ ద్వారా ఈటీఎఫ్‌లు తమ నిర్వహణలోని భౌతిక బంగారంలో 20–30 శాతాన్ని బాడుగ కింద ఇచ్చేందుకు అనుమతించాలని సూచించింది. దీనివల్ల ఆభరణాల వినియోగానికి సంబంధించి పసిడి దిగుమతుల డిమాండ్‌ను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నది పరిశ్రమ సూచన. రూపాయి విలువను, ఫారెక్స్‌నిల్వలను కాపాడుకునేందుకు పసిడి, వెండి దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాన్ని ప్రభుత్వం ఇటీవలే 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం తెలిసిందే. అలాగే, ఆభరణాల ఎగుమతిదారులకు అడ్వాన్స్‌డ్‌ అథరైజేషన్‌ స్కీమ్‌ కింద పసిడి దిగుమతులను కఠినతరం చేయడంతో పరిశ్రమ ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఎన్‌ఎస్‌ఈలో ఈజీఆర్‌ల ట్రేడింగ్‌ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ (ఈజీఆర్‌లు)లో లైవ్‌ ట్రేడింగ్‌ ప్రారంభించినట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. నియంత్రిత స్పాట్‌ గోల్డ్‌ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు ఇది సాయపడుతుందని పేర్కొంది. అహ్మదాబాద్, ముంబైలో సేకరణ, ఖజానా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు.. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులోనూ కొత్త కేంద్రాలను సోమవారం నుంచి యాక్టివేట్‌ చేసినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 120 కేంద్రాలకు నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్టు తెలిపింది. సెబీ నమోదిత ఖజానాల్లో భౌతిక బంగారాన్ని డిపాజిట్‌ చేసి, ఆ రిసీట్స్‌పై స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లో ట్రేడింగ్‌కు వీలుగా అందుబాటులోకి వచ్చిందే ఈజీఆర్‌.

Salesforce Reskills 3000 Workers as AI Agents Reshape Jobs and Budgets3
ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలిచ్చి మరీ..

సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి పాత ఉద్యోగాలను వేగంగా మార్చేస్తోంది. గ్లోబల్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్‌ఎం) దిగ్గజం సేల్స్‌ఫోర్స్ ప్రస్తుతం ఏజెంటిక్ ఏఐ కార్యకలాపాల నేపథ్యంలో అంతర్గత పునర్నిర్మాణం, బడ్జెట్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా సాంప్రదాయక విధుల్లో ఉన్న సుమారు 3,000 మంది ఉద్యోగులను కొత్త నైపుణ్యాలతో సేల్స్‌ విభాగంలోకి మళ్లించినట్లు కంపెనీ చీఫ్ డిజిటల్ ఎవాంజెలిస్ట్ వాలా అఫ్షర్ వెల్లడించారు. మే 18న తన తొలి అధికారిక భారత పర్యటనలో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్గతంలో మానవ వనరులు అవసరమైన కొన్ని తక్కువ ప్రభావం చూపే పనులను ఇప్పుడు ఏఐ ఏజెంట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని వాలా అఫ్షర్ పేర్కొన్నారు. దీనివల్ల కంపెనీలో మిగిలిన ప్రతిభావంతులైన ఉద్యోగులను తొలగించకుండా వారికి తగిన శిక్షణ ఇచ్చి సేల్స్ ఫంక్షన్‌కు అనుగుణంగా మార్చినట్లు తెలిపారు.‘ఏఐ ఏజెంట్ల వినియోగం భారీగా పెరిగింది. ఇప్పటివరకు ఆయా పనులు నిర్వహించిన ఉద్యోగులకు రీ-స్కిలింగ్‌ అందించాం. బయటి నుంచి ఎవరినీ కొత్తగా నియమించుకోకుండానే అంతర్గత వ్యాపార విభాగాల నుంచే ఈ 3,000 మందిని సేల్స్ పాత్రల్లోకి డిప్లాయ్ చేశాం. ఈ ప్రక్రియ బడ్జెట్ వ్యయాలపై కూడా ప్రభావం చూపుతుంది. బడ్జెట్లు మారుతాయి. కొన్నిసార్లు నాయకత్వ శైలి మారుతుంది. దీనివల్ల మధ్యస్థాయి మేనేజ్‌మెంట్ తగ్గి కంపెనీ మరింత సమర్థంగా మారుతుంది. అందుకు అనుగుణంగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్లను కూడా పునసమీక్షించుకోవాల్సి ఉంటుంది’ అని వాలా అఫ్షర్ చెప్పారు.2024లోనే కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ బెనియోఫ్ కోడింగ్, ఉత్పాదకత పెంపునకు ఏఐ సాధనాలే సరిపోతాయని, భవిష్యత్తులో ఎక్కువ మంది ఇంజినీర్లను నియమించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. తాజా వ్యూహం దానికి అద్దం పడుతోంది. 2026 నాటికి ఆంత్రోపిక్ టోకెన్ల కోడింగ్ అవసరాల కోసమే కంపెనీ దాదాపు 300 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని బెనియోఫ్ అంచనా వేశారు.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!

Govt Tightens Belt SBI LIC Face Travel Fuel Curbs to Cut Costs Boost Economy4
ఎస్‌బీఐ, ఎల్‌ఐసీకి ప్రభుత్వం ఆదేశాలు

దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, పెరుగుతున్న దిగుమతి బిల్లులను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. వ్యయాల హేతుబద్ధీకరణ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఆర్థిక సంస్థలు తక్షణమే కాఠిన్య చర్యలను అమలు చేయాలని స్పష్టం చేసింది.ఆంక్షల పరిధిలోకి వచ్చే సంస్థలు ఇవే..ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు విస్తృత స్థాయిలో ప్రభుత్వ ఆర్థిక రంగాన్ని కదిలించనున్నాయి. ముఖ్యంగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలు, ఆర్థిక సేవల విభాగం పరిపాలనా నియంత్రణలో పనిచేసే అన్ని ఇతర ఆర్థిక సంస్థలు వీటి పరిధిలోకి రానున్నాయి.విదేశీ పర్యటనలకు కోత..కఠిన చర్యల్లో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల అధిపతులకు డీఎఫ్‌ఎస్ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విదేశీ ప్రయాణాలను నిర్ణీత పరిమితుల కంటే చాలా తక్కువగా ఉంచాలని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప అంతర్జాతీయ పర్యటనలకు అనుమతించవద్దని, సాధ్యమైన ప్రతిచోటా భౌతిక పర్యటనల స్థానంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే సమీక్షలు, చర్చలు జరపాలని స్పష్టం చేసింది. దీనివల్ల భారీగా ప్రజాధనం ఆదా అవ్వడమే కాకుండా సమయం కూడా కలిసివస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈవీ వైపు వేగంగా అడుగులువ్యాపార విస్తరణతో పాటు పర్యావరణ స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ఈ సంస్థలు ఇకపై కీలక మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న పెట్రోల్, డీజిల్‌తో నడిచే అద్దె వాహనాలను క్రమంగా పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. వాటి స్థానంలో కాలక్రమేణా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించేలా వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలని డీఎఫ్‌ఎస్ ఆదేశించింది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!

Zoho CEO Sridhar Vembu Rules Out Expanding Work From Home5
వర్క్ ఫ్రమ్ హోమ్ విస్తరణపై జోహో కామెంట్స్‌

భారతీయ ఐటీ దిగ్గజం జోహో తమ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని విస్తరించబోమని నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో పరిశోధన, అభివృద్ధి బృందాల మధ్య ముఖాముఖి చర్చలు, ప్రత్యక్ష సహకారం ఉన్నప్పుడే ఆశించిన ఉత్పాదకత, వేగవంతమైన పరిష్కారాలు లభిస్తాయని అంతర్గత సమీక్షలో తేలడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని జోహో వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు సోమవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా వెల్లడించారు.ప్రత్యక్ష సహకారంతోనే మెరుగైన పరిష్కారాలుకంపెనీ అంతర్గత చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా సొంత డెవలప్‌మెంట్ టీమ్‌లో నేనే స్వయంగా ఈ వ్యత్యాసాన్ని గమనించాను. సమస్య పరిష్కారంలో భాగస్వాములైన వ్యక్తులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోనప్పుడు వాటి పరిష్కారానికి చాలా ఎక్కువ సమయం పడుతోంది. అదే ముఖాముఖిగా కూర్చున్నప్పుడు ఆలోచనల మార్పిడి మరింత సులువుగా సాగుతుంది. దీనివల్ల అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన సాఫ్ట్‌వేర్ పరిష్కారాలు లభిస్తున్నాయి. అందుకే ఆర్‌ అండ్ డీ విభాగంలో ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోమ్‌ను విస్తరించకూడదని నిర్ణయించాం’ అని చెప్పారు.జోహో పునసమీక్షపశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని, అనవసర ప్రయాణాలను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సమయంలో అలవాటైన వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి పద్ధతులను మళ్లీ ప్రోత్సహించాలని ప్రధాని కోరారు.ప్రధాని పిలుపునకు స్పందించిన శ్రీధర్ వెంబు.. మే 11న ఒక పోస్ట్‌లో ‘గత కొన్ని నెలలుగా మా సంస్థలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని పూర్తిగా అమలు చేస్తున్నప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని పిలుపును గౌరవిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ పునసమీక్షిస్తాం’ అని పేర్కొన్నారు. అయితే, సంస్థ ప్రయోజనాలు, సాంకేతిక ఉత్పాదకతను బేరీజు వేసుకున్న తర్వాత ఈ విస్తరణ సాధ్యం కాదని జోహో తేల్చిచెప్పింది.ఇంధన పొదుపునకు ప్రత్యామ్నాయ వ్యూహాలువర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనంత మాత్రాన పర్యావరణ స్పృహను విస్మరించబోమని వెంబు స్పష్టం చేశారు. ఇంధన వినియోగాన్ని, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి జోహో ఇతర మార్గాలను అన్వేషిస్తోందని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచడం, కంపెనీ క్యాంటీన్లలో డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వంట సామగ్రిని ప్రవేశపెట్టడం వంటివి అమలు చేయబోతున్నట్లు చెప్పింది. ఇప్పటికే జోహో సంస్థ సోలార్ (సౌరశక్తి) రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. క్యాంపస్‌ల్లో ఇప్పటికే ప్రాకృతిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!

Bengaluru Maid Monthly Income Shocks Software Engineer Sparks Viral Debate6
శ్రమకే అగ్రతాంబూలం!

నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో లక్షల రూపాయల ప్యాకేజీలు తీసుకునే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల జీతాలే అందరికీ హాట్ టాపిక్. కానీ, రోజువారీ శ్రమను నమ్ముకున్న ఒక సాధారణ ఇంటి పనిమనిషి నెలవారీ సంపాదన వివరాలు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ నిపుణులను, విద్యావంతులను ఆలోచనలో పడేసాయి. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన ఇంటి పనిమనిషితో జరిపిన చిన్న సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.బెంగళూరుకు చెందిన ఆదిత్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇటీవల తన ఇంటి పనిమనిషి పదేపదే ఆలస్యంగా రావడంపై ఆమెను ప్రశ్నించాడు. సాధారణంగా మొదలైన ఈ ప్రశ్న ఆమె ఇచ్చిన సమాధానంతో ఆదిత్య అవాకయ్యేలా చేసింది. ఆమె కేవలం ఒకరి ఇంట్లోనే కాకుండా ఒక పక్కా ప్రణాళికతో బహుళ ఆదాయ వనరులను సృష్టించుకుందని తెలిసి అతను షాక్‌కు గురయ్యాడు. ఆదిత్య తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్న వివరాల ప్రకారం.. ఆమె తన దినచర్యలో భాగంగా..వేర్వేరు అపార్ట్‌మెంట్‌ల్లో నివసించే నలుగురు బ్యాచిలర్స్‌కు రోజువారీ భోజనం వండి పెడుతోంది. ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.6,000 చొప్పున తీసుకుంటోంది. దాంతో ఆమెకు రూ.24,000 లభిస్తోంది. దీనికి అదనంగా, మరో రెండు కుటుంబాలకు పూర్తిస్థాయి ఇంటి పనిమనిషిగా ఉంటూ నెలకు రూ.20,000 సంపాదిస్తోంది. మొత్తంగా ఆమె నెలవారీ ఆదాయం అక్షరాలా రూ.44,000. అంటే సంవత్సరానికి ఆమె సంపాదన రూ.5.28 లక్షలు. దేశంలో సగటు కార్పొరేట్ ఎంట్రీ-లెవల్ ఉద్యోగి జీతం కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం.ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఆదిత్య ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ‘ఇక్కడ వేలాది మంది చదువుకున్న యువత ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. కానీ సరైన నైపుణ్యం ఉంటే ఆదాయానికి కొరత లేదు’ అని పేర్కొన్నాడు. ఈ వ్యవహారం ద్వారా తాను ఒక గొప్ప విషయాన్ని గ్రహించానని ఆదిత్య రాసుకొచ్చాడు. ‘ఈ రోజు ఒక విషయం స్పష్టమైంది. ఏ పనీ చిన్నది కాదు. నైపుణ్యం, స్థిరత్వం, కష్టపడే తత్వం ఎప్పుడూ సరైన ఫలితాన్ని ఇస్తాయి’ అని అతను స్పష్టం చేశాడు.కెరీర్ వృద్ధి వర్సెస్ శారీరక శ్రమఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిపై నెటిజన్లు భిన్నమైన విశ్లేషణలు చేస్తున్నారు. ‘డిగ్రీలు లేకపోయినా ప్రాక్టికల్ నైపుణ్యాలతో స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చని నిరూపితమైంది’ అని కొందరంటున్నారు. ‘దేశంలో పట్టభద్రులైన యువత ఉద్యోగాల కోసం అల్లాడుతున్న వేళ ఇదొక ప్రత్యామ్నాయం’ అని కొందరు చెబుతున్నారు. డిగ్రీలు పూర్తి చేసినా అర్థవంతమైన ఉపాధి దొరకని దేశీయ ఉద్యోగ సంక్షోభాన్ని ఈ ఉదంతం ప్రతిబింబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.విజయానికి కొలమానం ఏది?ఈ వైరల్ కథనం మారుతున్న భారతదేశ శ్రామిక శక్తి వాస్తవ రూపానికి అద్దం పడుతోంది. విజయాన్ని కేవలం నెలవారీ జీతం అంకెలతోనే కొలవాలా? లేక భవిష్యత్తు వృద్ధి, ఉద్యోగ భద్రత, జీవన నాణ్యత ఆధారంగా అంచనా వేయాలా? అనే పెద్ద ప్రశ్నను ఇది సమాజం ముందుంచింది. ఏదేమైనా, విద్యావంతుల్లో పెరుగుతున్న నిరుద్యోగానికి, నైపుణ్య ఆధారిత పనులకు ఉన్న డిమాండ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!

Advertisement
Advertisement
Advertisement