బులియన్‌ బ్యాంక్‌ కావాలి | Gold industry Body meets with Piyush Goyal to discuss of a Bullion Bank | Sakshi
Sakshi News home page

బులియన్‌ బ్యాంక్‌ కావాలి

May 19 2026 12:45 AM | Updated on May 19 2026 12:45 AM

Gold industry Body meets with Piyush Goyal to discuss of a Bullion Bank

ఇళ్లు, సంస్థల వద్ద పసిడిని సమీకరించాలి 

ఆభరణాల పరిశ్రమకు రుణం కింద ఇవ్వాలి 

ప్రభుత్వానికి పరిశ్రమ సూచన 

కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్‌తో చర్చలు

న్యూఢిల్లీ: పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు, అదే సమయంలో ఆభరణాల తయారీకి అవసరమైన పసిడిని దేశీయంగానే సమకూర్చుకునేందుకు జ్యుయలరీ పరిశ్రమ ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టింది. బులియన్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. తద్వారా దేశంలోపలే నిరుపయోగంగా ఉన్న పసిడిని వినియోగంలోని తీసుకురావచ్చని సూచించింది. 

ఆల్‌ ఇండియా జ్యుయలర్స్‌ అండ్‌ గోల్డ్‌స్మిత్‌ ఫెడరేషన్‌ (ఏఐజేజీఎఫ్‌) ప్రతినిధులతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ నిర్వహించిన సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. 

ఇళ్లు, సంస్థలు, పెట్టుబడి వాహకాలు కలిగి ఉన్న బంగారాన్ని సమీకరించి జ్యుయలరీ రంగానికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తగిన కార్యాచరణను రూపొందించాలని ఆభరణాల పరిశ్రమ మంత్రిని కోరింది. బులియన్‌ బ్యాంక్‌ ప్రతిపాదనపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటును పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి నుంచి హామీ లభించింది. ఈ కమిటీని కనుక ఏర్పాటు చేస్తే అందులో ప్రభుత్వం, ఆభరణాల రంగం, బులియన్‌ మార్కెట్, ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి.

బ్యాంక్‌ మాదిరే.. 
ప్రతిపాదిత బులియన్‌ బ్యాంక్‌ అన్నది కేంద్రీకృత సంస్థగా పనిచేయనుంది. ఈ బ్యాంక్‌ దేశీయంగా ఉన్న పసిడిని సమీకరించి, అరువు కింద పరిశ్రమకు ఇస్తుంది. ఇళ్లలోని, సంస్థల నిర్వహణలోని (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు) బంగారాన్ని సమీకరించి.. ఆభరణాల సంస్థలు, ఎగుమతిదారులు, రిఫైనరీలు, తయారీదారులకు సరఫరా చేయనుంది. ఇళ్లు, సంస్థల వద్ద 25,000–35,000 టన్నుల పసిడి ఉంటుందని అంచనా. 

గోల్డ్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు) సైతం పెద్ద మొత్తంలో భౌతిక బంగారాన్ని (పెట్టుబడులకు బ్యాకెండ్‌గా) ఖజానాల్లో కలిగి ఉన్నాయని ఏఐజేజీఎఫ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈటీఎఫ్‌ల్లోకి వచ్చే ప్రతి రూపాయి తాజా పెట్టుబడికి అనుగుణంగా పసిడి దిగుమతులకు అదనపు డిమాండ్‌ ఏర్పడుతుందని పేర్కొంది. కనుక బులియన్‌ బ్యాంక్‌ ద్వారా ఈటీఎఫ్‌లు తమ నిర్వహణలోని భౌతిక బంగారంలో 20–30 శాతాన్ని బాడుగ కింద ఇచ్చేందుకు అనుమతించాలని సూచించింది. 

దీనివల్ల ఆభరణాల వినియోగానికి సంబంధించి పసిడి దిగుమతుల డిమాండ్‌ను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నది పరిశ్రమ సూచన. రూపాయి విలువను, ఫారెక్స్‌నిల్వలను కాపాడుకునేందుకు పసిడి, వెండి దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాన్ని ప్రభుత్వం ఇటీవలే 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం తెలిసిందే. అలాగే, ఆభరణాల ఎగుమతిదారులకు అడ్వాన్స్‌డ్‌ అథరైజేషన్‌ స్కీమ్‌ కింద పసిడి దిగుమతులను కఠినతరం చేయడంతో పరిశ్రమ ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.  

ఎన్‌ఎస్‌ఈలో ఈజీఆర్‌ల ట్రేడింగ్‌
ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ (ఈజీఆర్‌లు)లో లైవ్‌ ట్రేడింగ్‌ ప్రారంభించినట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. నియంత్రిత స్పాట్‌ గోల్డ్‌ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు ఇది సాయపడుతుందని పేర్కొంది.  అహ్మదాబాద్, ముంబైలో సేకరణ, ఖజానా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు.. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులోనూ కొత్త కేంద్రాలను సోమవారం నుంచి యాక్టివేట్‌ చేసినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 120 కేంద్రాలకు నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్టు తెలిపింది. సెబీ నమోదిత ఖజానాల్లో భౌతిక బంగారాన్ని డిపాజిట్‌ చేసి, ఆ రిసీట్స్‌పై స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లో ట్రేడింగ్‌కు వీలుగా అందుబాటులోకి వచ్చిందే ఈజీఆర్‌.

Advertisement
 
Advertisement
Advertisement