శబరిమల: ప్రైవేట్ హోటల్స్‌కు శాశ్వతంగా చెక్! | Sabarimala Overhauls Food Rules Kudumbashree Coffee House to Step In | Sakshi
Sakshi News home page

శబరిమల: ప్రైవేట్ హోటల్స్‌కు శాశ్వతంగా చెక్!

May 18 2026 1:06 PM | Updated on May 18 2026 1:44 PM

Sabarimala Overhauls Food Rules Kudumbashree Coffee House to Step In

శబరిమల: కేరళలోని శబరిమల సన్నిధానంలో ఇకపై కలుషిత ఆహారానికి, ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రైవేట్ హోటల్స్‌కు శాశ్వతంగా చెక్ పడనుంది. పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు  నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ప్రైవేట్ కాంట్రాక్టర్ల సిండికేట్‌ను బద్దలు కొడుతూ, ఫుడ్ క్వాలిటీ కోసం ప్రముఖ విశ్వసనీయ సంస్థలను రంగంలోకి దించుతోంది.

రంగంలోకి 'కుటుంబశ్రీ'.. హెల్త్ కార్డ్ తప్పనిసరి
టెండర్ నిబంధనలను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, పంపా, సన్నిధానం వద్ద ఉన్న ఫుడ్ సెక్టార్‌లోకి కుటుంబశ్రీ, ఇండియన్ కాఫీ హౌస్, కేటీడీసీ లాంటి సంస్థలను దేవస్వం బోర్డు ఆహ్వానిస్తోంది. ఇకపై ప్రతి హోటల్ కార్మికుడికి ‘హెల్త్ కార్డ్’ ఉండటం తప్పనిసరి. ఈ కొత్త మార్గదర్శకాలను ఏమాత్రం ఉల్లంఘించినా ఫుడ్ అవుట్‌లెట్‌లను తక్షణమే మూసివేస్తారు. ఇప్పటివరకు కేవలం తనిఖీలు, జరిమానాలతో సరిపెట్టుకున్న అధికారులు ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

కాంట్రాక్టర్ల లాబీయింగ్‌కు చెక్
‘విజన్ శబరిమల’ చొరవలో భాగంగా ఈ భారీ ప్రక్షాళన జరుగుతోంది. ఇటీవల ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ స్వయంగా జరిపిన తనిఖీల్లో పారిశుద్ధ్య లోపం, కేటాయించిన దానికంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడం లాంటి పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి. కాంట్రాక్టర్లు లాబీయింగ్ చేస్తూ, రేట్లు తగ్గించే వరకు టెండర్లు వేయకుండా ఆపే పాత పద్ధతికి బోర్డు ముగింపు పలుకుతోంది. అవకతవకలను నివారించేందుకు టెండర్ ప్రక్రియ మొత్తాన్ని ‘ఈ-టెండరింగ్’ విధానంలోకి మార్చాలని యోచిస్తోంది. వ్యర్థాల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది.

భక్తుల సౌకర్యానికే తొలి ప్రాధాన్యత
మండల-మకరవిళక్కు సీజన్లో దేవస్వం బోర్డు ఉచిత అన్నదానం చేస్తున్నప్పటికీ, వేలాది మంది భక్తులు హోటళ్లపైనే ఆధారపడుతున్నారు. అయితే ఇరుకైన దారుల్లో కొట్లు ఏర్పాటు చేయడంతో భక్తుల కదలికలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, ఇకపై భక్తుల సౌకర్యానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని జయకుమార్ తెలిపారు.  ఇక మహిళల సామూహిక సంఘమైన ‘కుటుంబశ్రీ’ విషయంలో వయసు నిబంధనలను  పాటిస్తారు.

ఇది కూడా చదవండి: గంగాతీరంలో హై అలర్ట్.. అసలేం జరిగింది?

Advertisement
 
Advertisement
Advertisement