గంగాతీరంలో హై అలర్ట్.. అసలేం జరిగింది? | Threatens to Blow Up Haridwars Har Ki Pauri Arrested in Quick Action | Sakshi
Sakshi News home page

గంగాతీరంలో హై అలర్ట్.. అసలేం జరిగింది?

May 18 2026 12:22 PM | Updated on May 18 2026 12:41 PM

Threatens to Blow Up Haridwars Har Ki Pauri Arrested in Quick Action

హరిద్వార్‌: లక్షలాది మంది భక్తులు నిత్యం పుణ్యస్నానాలు ఆచరించే పవిత్ర పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రసిద్ధ ‘హర్ కీ పౌరి’ ఘాట్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ సోమవారం పోలీసులకు వచ్చిన ఒక బెదిరింపు ఫోన్ కాల్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అత్యంత రద్దీగా ఉండే ఈ ఆధ్యాత్మిక ప్రాంతంలో బాంబు హెచ్చరికల వార్త తెలియగానే నగరవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

పోలీసులను పరుగులు పెట్టించిన ఫోన్ కాల్
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఒక వ్యక్తి ఎమర్జెన్సీ నంబర్ 112 కు ఫోన్ చేశాడు. నాలుగు రోజుల్లో హర్ కీ పౌరి సహా హరిద్వార్‌లోని పలు కీలక ప్రాంతాలను బాంబులతో పేల్చేస్తామని బెదిరించాడు. ఈ హెచ్చరికతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసి, నగరం నలుమూలల హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు బహుళ పోలీస్ బృందాలను ఏకకాలంలో రంగంలోకి దించారు.

లోకేషన్ ట్రేసింగ్.. నిందితుడి అరెస్ట్
బెదిరింపు కాల్ రాగానే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్, దర్యాప్తు బృందాలు ఆ ఫోన్ నంబర్, లొకేషన్‌ను  ట్రేస్ చేశాయి. నిందితుడిని పౌరీ జిల్లాలోని యమకేశ్వర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల సోహన్ సింగ్ రావత్‌గా గుర్తించి, వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల విచారణలో ఊహించని వాస్తవం వెలుగుచూసింది. తాను పీకలదాకా మద్యం సేవించి ఉన్నానని, కేవలం మత్తులోనే ఈ బాంబు బెదిరింపు కాల్ చేశానని నిందితుడు విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.

హర్ కీ పౌరి ప్రాముఖ్యత
శ్రీ మహావిష్ణువు పాదముద్రలు ఉన్నాయని భావించే హర్ కీ పౌరి ఘాట్‌కు ఎంతో ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. ఇక్కడ సాయంత్రం జరిగే గంగా హారతికి, 12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తుతారు. ఇంతటి పవిత్రమైన ప్రదేశంపై బెదిరింపులు రావడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. నిందితుడు సోహన్ సింగ్‌పై హరిద్వార్ నగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు హరిద్వార్ ఎస్ఎస్‌పీ నవనీత్ సింగ్ భుల్లర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: రైలు బోగీలో మహిళ మొండెం.. లక్నోలో దారుణం

Advertisement
 
Advertisement
Advertisement