భోపాల్‌లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు నెలల గర్భిణి అయిన ట్విషా (31) భోపాల్‌లోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోవడానికి ముందు తన స్నేహితులకు పంపిన చివరి సందేశాలు వాట్సాప్ చాట్ కలకలం రేపుతోంది. తొందరపడి పెళ్లి చేసుకోవద్దు అంటూ ఆమె తన స్నేహితులకు పంపిన సందేశాలు ఆమె తీవ్రమైన మానసిక ఆందోళన, ఒంటరితనం, పెళ్లి తర్వాత వేదనలో ఉన్నట్లు ఆ మెసేజ్‌ల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఆమె ఉరి వేసుకోవడానికి ఉపయోగించినట్టు చెబుతున్న బెల్టును పోస్ట్‌మార్టంకు ఎయిమ్స్ భోపాల్‌కు పంపకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ కేసును పక్క దారి పట్టిస్తున్నారంటూ భోపాల్ పోలీసులపై ఆరోపణలు కుదిపేస్తున్నాయి. దర్యాప్తు సమగ్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలు ఏం జరిగింది?
నోయిడాకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన ట్విషా శర్మ, ఢిల్లీలో ఉద్యోగం చేసేది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన లాయర్ సమర్థ్ సింగ్‌ను డిసెంబర్ 2025లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన అయిదు నెలలకే, మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన భర్త ఇంట్లో ట్విషా శవం వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆమె మరణం ఉరి వేసుకోవడం వల్లే జరిగిందని తేలినప్పటికీ, ఆమె శరీరంపై పలు చోట్ల గాయాల గుర్తులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్‌మీడియా చాట్స్ కీలకంగా మారాయి.
మే 7న ఒక స్నేహితురాలితో వాట్సాప్ చాట్‌లో.. "నేను ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. నా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను. పెళ్లి కుటుంబాన్ని ఇస్తుంది, కానీ ఎక్కడున్నా మన కోసం మనం పని చేయడం ఆపకూడదు" అని పేర్కొంది. పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. బాగా ఆలోచించి ముందడుగు వేయండి" అని స్నేహితురాలిని హెచ్చరించింది. అలాగే తనకు ఇల్లు, స్నేహితులు బాగా గుర్తొస్తున్నారని వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో స్నేహితుడితో మాట్లాడుతూ.. "నేను చిక్కుకుపోయాను బ్రో (I am trapped bro). నువ్వు మాత్రం ఇలాంటి వాటిలో ఇరుక్కోవద్దు. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, సమయం వచ్చినప్పుడు కాల్ చేస్తాను" అని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.

న్యాయం కోసం రోడ్డెక్కిన కుటుంబం
ట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్ (రిటైర్డ్ జడ్జి)లపై కుటుంబ సభ్యులు హత్య, కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. భర్త, అత్తమామలు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారని ఆరోపించారు. నిందితులు ప్రభావవంతమైన వ్యక్తులు కావడం వల్ల వారికి ముందస్తు బెయిల్ లభించిందని, దీనివల్ల స్థానిక పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగకపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంపై న్యాయం చేయాలని, ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS Delhi)లో మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ట్విషా కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసం వెలుపల నిరసన చేపట్టారు. భోపాల్ వచ్చినప్పటి నుండి తాము ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయడం కోసం మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, పోలీస్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ట్విషా తండ్రి నవనిధి శర్మ, సోదరుడు ఆశిష్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు .స్థానిక పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నారు.నిందితుల కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉండటంతో పాటు, వారికి సమీప బంధువైన వ్యక్తి లోకాయుక్తగా ఉండటంతో కేసును ప్రభావితం చేస్తున్నారని తండ్రి నవనిధి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా కుటుంబ సభ్యుల ప్రకారం పెళ్లయిన దగ్గర్నుంచీ ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. దీంతో తిరిగి వచ్చేయాలని ఆమె భావించింది. ఇంతలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్‌కు ముందస్తు బెయిల్ లభించిందని చెప్పారు. బెయిల్‌ను సవాలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం


