అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువ‌తి మృతి | Nalgonda Navya Reddy Dead In USA Road Accident | Sakshi
Sakshi News home page

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నవ్యరెడ్డి మృతి

May 18 2026 12:27 PM | Updated on May 18 2026 2:08 PM

Nalgonda Navya Reddy Dead In USA Road Accident

సాక్షి, నల్లగొండ: విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలై, తమకు చేదోడువాదోడుగా టుందనుకున్న కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ ఇంటి దీపం శాశ్వతంగా ఆరిపోయింది. రూ.50 లక్షలు అప్పు చేసి మరీ అమెరికా పంపిన  కౌలు రైతు దంపతులకు తీరని శోకం మిగిలింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టుకు చెందిన నవ్య అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్‌రెడ్డి, శోభ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు నవ్య (24) బీటెక్‌ పూర్తి చేయడంతో ఎంఎస్‌ కోసం రెండున్నర సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లింది. చిన్న కూతురు ప్రస్తుతం బీటెక్‌ చదువుతోంది. నవ్య చికాగో రాష్ట్రంలోని రోజ్‌ వెల్‌ యూనివర్సిటీలో రెండున్నర సంవత్సరాల నుంచి ఎంఎస్‌ చదువుతోంది.

శనివారం రాత్రి కారులో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వెనుక నుంచి మరో కారు ఢీకొట్టడంతో నవ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు స్నేహితురాలు ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. నవ్య మృతి విషయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశానికి సమాచారం అందించారు. తక్షణమే వారు స్పందించి అమెరికా నుంచి నవ్య మృతదేహాన్ని సొంతూరికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు నవ్య తల్లిదండ్రులు తెలిపారు.

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి.. 
నవ్య 10వ తరగతి నల్లగొండలోని ఎంవీఆర్‌ స్కూల్‌లో, ఇంటర్‌ గీతాంజలి కాలేజీలో, బీటెక్‌ హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ కళాశాలలో పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి ఎంఎస్‌ చదువుతోంది. తన కూతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వార్త తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. తన కూతురు ఉన్నత విద్యావంతురాలై విదేశంలో ఉద్యోగం చేసి ఇంటి దీపంగా వెలుగుతుంది అనుకుంటే రోడ్డు ప్రమాదం ఇంటి దీపాన్ని ఆర్పిందని నవ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.  

చేసిన అప్పులు తీరకముందే.. 
గడుసు శ్రీనివాసరెడ్డి, శోభ దంపతులు సొంతంగా భూమి లేకున్నా ప్రతి సంవత్సరం 10 నుంచి 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట పడిస్తూ తమ ఇద్దరు కూతుళ్లను చదివిపిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం పెద్ద కూతురు నవ్యను ఉన్నత విద్య కోసం అమెరికా పంపేందుకు రూ.30 లక్షలు బ్యాంకు రుణం, రూ.20 లక్షలు ప్రైవేట్‌ అప్పు చేశారు. చేసిన అప్పు తీరక ముందే కుమార్తె కానరాని లోకానికి పోయిందని తల్లడిల్లిపోతున్నారు. పెద్ద కూతురు ఉన్నత విద్య చదివి ఉద్యోగం చేస్తే చిన్న కూతురికి, తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది అనుకుంటే అప్పులతో పాటు కన్నీరే మిగిలిందని రోదిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement