చైనాలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు | 5.2 Magnitude Quake Rocks China, Buildings Flattened | Sakshi
Sakshi News home page

చైనాలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు

May 18 2026 10:10 AM | Updated on May 18 2026 10:45 AM

5.2 Magnitude Quake Rocks China, Buildings Flattened

గ్వాంగ్సీ : చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతాన్ని భయంకరమైన ప్రకృతి విపత్తు వణికించింది. సోమవారం తెల్లవారుజామున సంభవించిన 5.2 తీవ్రత గల భారీ భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ప్రాణభయంతో ఒక్కసారిగా ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీశారు. కళ్ల ముందే క్షణాల వ్యవధిలోనే పలు బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇద్దరు మృత్యువాత 
గ్వాంగ్సీ పరిధిలోని లియోజౌ నగరం, అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాలను ఈ భూకంపం అత్యంత తీవ్రంగా కుదిపేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరొకరు గల్లంతైనట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా, సీసీటీవీ తమ కథనాల్లో వెల్లడించాయి. ఈ విపత్తులో గాయపడిన మరో నలుగురు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని ఉన్నతాధికారులు తెలిపారు.

నేలమట్టమైన 13 భవనాలు
భారీ ప్రకంపనల ధాటికి ఆ ప్రాంతంలో ఏకంగా 13 భవనాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయని అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా ప్రాణనష్టాన్ని నివారించే ఉద్దేశ్యంతో ప్రభావిత ప్రాంతాల నుంచి ఏకంగా 7,000 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర ప్రతిస్పందన బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక, పునరావాస కార్యక్రమాలను  నిర్వహిస్తున్నాయి.

 
 
రైల్వే వ్యవస్థపై ప్రభావం
భూకంపం దెబ్బకు రైల్వే వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. రైల్వే మౌలిక సదుపాయాలకు వాటిల్లిన నష్టాన్ని, భద్రతా పరిస్థితులను అంచనా వేసేందుకు నిపుణుల బృందాలు విస్తృత తనిఖీలు ప్రారంభించాయి. ఈ క్రమంలో రైళ్ల రాకపోకలకు, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఆఫ్టర్ షాక్స్ (మరిన్ని ప్రకంపనలు) వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో, అదనపు నష్టం జరగకుండా నివారించేందుకు అత్యవసర సహాయక సిబ్బందిని భారీ సంఖ్యలో మోహరించారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement