నీట్ పేపర్ లీక్: సుప్రీంకోర్టులో సంచలన పిటిషన్ | NEET-UG 2026 Paper Leak Sparks Outrage, Petition Filed To Replace NTA, Conduct Re Exam Under Supreme Court Supervision | Sakshi
Sakshi News home page

నీట్ పేపర్ లీక్: సుప్రీంకోర్టులో సంచలన పిటిషన్

May 13 2026 11:54 AM | Updated on May 13 2026 12:38 PM

Scrap NTA Reconduct NEET-UG 2026 SC Plea Sparks Fresh Uproar

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మే 3న జరిగిన ఈ వైద్య విద్య ప్రవేశ పరీక్ష రద్దు కావడంతో దేశం ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ని పూర్తిగా పక్కనబెట్టి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మళ్లీ పకడ్బందీగా పరీక్షను నిర్వహించాలని కోరుతూ ‘ఫైమా’ అత్యున్నత న్యాయస్థానంలో ఓ సంచలన పిటిషన్ దాఖలు చేసింది.

ఎన్టీఏ రద్దు.. సిస్టమ్ ఫెయిల్యూర్
ఇది కేవలం ఒక చిన్న పొరపాటు కాదని, ఎన్టీఏ వ్యవస్థాగత వైఫల్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ‘ది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇడియా మెడికల్‌ అసోసియేషన్‌( ఫైమా) తరపు న్యాయవాది తన్వీ దూబే పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన, స్వయంప్రతిపత్తి గల కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. దాదాపు ఒకేరకమైన పరిస్థితుల్లో 2024లోనూ ఇలాంటి లీక్ జరగడం ఎన్టీఏ అసమర్థతకు అద్దం పడుతోందని ఆరోపించారు.

సీబీఐ దర్యాప్తు.. 30 లక్షలకు ప్రశ్నపత్రం
వాట్సాప్, టెలిగ్రామ్ వేదికగా పరీక్షకు ముందే లీకైన ఈ పేపర్ కోసం బ్రోకర్లు అభ్యర్థుల నుంచి రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన ఓ హాస్టల్ యజమాని ఇచ్చిన సమాచారంతో ఈ బాగోతం వెలుగుచూసింది. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి మొదలైన ఈ లీక్ స్కామ్‌పై ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగి మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో 15 మందిని అరెస్ట్ చేసింది. నాలుగు వారాల్లోగా సీబీఐ దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో స్పష్టం చేశారు.

ఆన్‌లైన్ పరీక్ష.. పటిష్ట పర్యవేక్షణ
భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు జరగకుండా ఉండాలంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)విధానాన్ని తీసుకురావాలని ఫైమా సూచించింది. భౌతికంగా పేపర్లు చేతులు మారకుండా ప్రశ్నపత్రాలను డిజిటల్ లాకింగ్ చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఫోరెన్సిక్ సైంటిస్ట్‌తో కూడిన ఓ ఉన్నత స్థాయి పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలోనే పారదర్శకంగా మళ్లీ నీట్-యూజీ 2026 పరీక్షను నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.
 

Advertisement
 
Advertisement
Advertisement