నేను రబ్బర్‌ స్టాంప్‌ను కాదు: రాహుల్‌ | MP Rahul Gandhi Serious Letter On CBI Director Selection Process, Flags Lack Of Transparency, Post Viral On Social Media | Sakshi
Sakshi News home page

Rahul Gandhi: నేను రబ్బర్‌ స్టాంప్‌ను కాదు

May 13 2026 9:19 AM | Updated on May 13 2026 10:23 AM

MP Rahul Gandhi Serious Letter On CBI Director selection process

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తదుపరి నూతన సారథి ఎంపిక ప్రక్రియలో అవలంభించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలను తనకు తెలియజేయని కారణంగా ఉన్నతస్థాయి ఎంపిక ప్యానెల్‌లో ఇకపై భాగస్వామిగా కొనసాగబోనని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు.

మంగళవారం ఢిల్లీ ప్రధాని అధికార నివాసం 7, లోక్‌కళ్యాణ్‌ మార్గ్‌లో జరిగిన భేటీలో ప్యానెల్‌ సభ్యుని హోదాలో రాహుల్‌ పాల్గొన్నారు. ప్యానెల్‌ చైర్‌పర్సన్‌ ప్రధాని మోదీ, సభ్యునిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ హాజరయ్యారు. ‘‘ఏఏ అంశాల ప్రాతిపదికన తుది అభ్యర్థులను ఎంపికచేశారనే కీలక సమాచారాన్ని ఇచ్చేందుకు సెలక్షన్‌ కమిటీ నిరాకరించింది. తద్వారా ఎంపిక ప్యానెల్‌ భేటీని ఎన్‌డీఏ సర్కార్‌ అలంకారప్రాయంగా మార్చింది. ఇలాంటి పక్షపాత ప్యానెల్‌లో నేను కొనసాగబోను. కొనసాగి విపక్షనేతగా రాజ్యాంగబద్ధ బాధ్యతను విస్మరించజాలను. అందుకే నా విముఖతను స్పష్టంగా తెలియజేస్తున్నా’’ అని రెండు పేజీల లేఖలో రాహుల్‌ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు.

ఇదిలా ఉండగా.. మే 24వ తేదీతో ప్రస్తుత సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో స్వీయ మదింపు పత్రాలు సహా ప్రభుత్వ నిఘా నివేదికలను పరిశీలించి తుది అభ్యర్థుల జాబితా పరిశీలనకు ఎంపిక ప్యానెల్‌ సమావేశంకాగా రాహుల్‌ తన విముఖత వ్యక్తంచేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement