పుచ్చకాయ చావులు: ముంబై ఘటన మరవకముందే.. | 15 Year old boy dead three children fall sick after eating watermelon | Sakshi
Sakshi News home page

పుచ్చకాయ చావులు: ముంబై ఘటన మరవకముందే..

May 12 2026 11:38 AM | Updated on May 12 2026 11:43 AM

15 Year old boy dead three children fall sick after eating watermelon

జాంజ్‌గిర్-చంపా: వేసవి తాపం నుండి ఉపశమనం పొందాలని పుచ్చకాయ తింటే, అది కాస్తా ప్రాణాలు తీసే యమపాశంలా మారుతోంది. గత నెలలో ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పుచ్చకాయ తిని మృత్యువాత పడిన ఘటన మరువక ముందే ఛత్తీస్‌గఢ్‌లో ఇదే తరహాలో మరో విషాదం చోటుచేసుకుంది. వేసవిలో అమృతంలా భావించే ఈ పండు, ఇప్పుడు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.

సరదాగా తిన్నారు.. శవమై తేలాడు
ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లా ఘుర్కోట్ గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. మేనమామ ఇంటికి వచ్చిన పిల్లలు ఆదివారం సాయంత్రం పుచ్చకాయ తిన్నారు. తిన్న కొద్దిసేపటికే 15 ఏళ్ల అఖిలేష్ ధివర్‌కు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. అఖిలేష్‌తో పాటు పండు తిన్న శ్రీ(4), పింటూ(12), హితేష్(13) అనే ముగ్గురు పిల్లలు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

బలితీసుకుంటున్న ‘జింక్ ఫాస్ఫైడ్’
గత ఏప్రిల్ 25న ముంబైలోని పైధోనీ ప్రాంతంలోనూ అబ్దుల్లా దొకాడియా కుటుంబంలోని నలుగురు సభ్యులు పుచ్చకాయ తిని మృత్యువాత పడ్డారు. అయితే వీరి  ఫోరెన్సిక్ పరీక్షల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వారి శరీర నమూనాల్లో ‘జింక్ ఫాస్ఫైడ్’ అనే ప్రమాదకరమైన రసాయనం ఉన్నట్లు తేలింది. సాధారణంగా ఎలుకల నివారణకు వాడే ఈ రసాయనం పండ్ల ద్వారా మనిషి శరీరంలోకి చేరి ప్రమాదకరంగా పరిణమిస్తోంది

అజాగ్రత్తే ప్రాణసంకటమా?
ఛత్తీస్‌గఢ్ ఘటనలో ప్రాథమికంగా ‘ఫుడ్ పాయిజనింగ్’ కారణమని వైద్యులు అనుమానిస్తున్నారు. ఉదయం కోసిన పుచ్చకాయను చాలా గంటల పాటు గాలికి వదిలేసి, సాయంత్రం తినడమే విషంగా మారి ఉండొచ్చని డాక్టర్ ఎస్.కుజుర్ తెలిపారు. పండ్లపై రసాయనాల వాడకం లేదా నిల్వ ఉంచడంలో చేసే చిన్న అజాగ్రత్తే నిండు ప్రాణాలను బలితీసుకుంటోంది. అందుకే పండ్లు కొనేటప్పుడు, తినేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement