విజయ్‌ సర్కార్‌ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్‌ నేత జోస్యం | Vijay's TVK Government Won't Last 6 Months: DMK MLA Big Prediction | Sakshi
Sakshi News home page

విజయ్‌ సర్కార్‌ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్‌ నేత జోస్యం

May 18 2026 10:49 AM | Updated on May 18 2026 12:19 PM

Vijay's TVK Government Won't Last 6 Months: DMK MLA Big Prediction

సాక్షి, చెన్నై:  అధికారం చేపట్టి ఇంకా నెలరోజులు కూడా కాకుండానే  తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, టీవీకే (TVK) కూటమి ప్రభుత్వంపై సీనియర్  డీఎంకే (DMK) నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నిలబడదని,  డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ త్వరలోనే మళ్లీ సీఎం అవుతారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది.

"మా తలైవరే తదుపరి ముఖ్యమంత్రి. మరో నాలుగు లేదా ఆరు నెలల్లో మా నాయకుడు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు" అని ఆయన ధీమా వ్యక్తం చేయడం విశేషం. రాధాకృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి విజయ్ కార్యాలయం గానీ, టీవీకే పార్టీ గానీ, లేదా ఆధవ్ అర్జున గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. టీవీకే, డీఎంకే పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

దక్షిణ తమిళనాడులో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో రాధాకృష్ణన్ మాట్లాడుతూ... అధికార తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, విల్లివాక్కం నియోజకవర్గం నుండి విజయం సాధించిన ఆధవ్ అర్జునకు బహిరంగ సవాల్ విసిరారు. ఆధవ్ అర్జున తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరుచెందూర్‌లో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు.ఈ ప్రభుత్వం మహా అయితే మరో నాలుగు నెలలు మాత్రమే మనుగడ సాగిస్తుందంటూ జోస్యం చెప్పారు. గత ఏప్రిల్ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘనవిజయం సాధించకముందు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ మళ్లీ సీఎం అవుతారని పేర్కొన్నారు.

అంతేకాదు ‘‘నీకు నిజంగా దమ్ముంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్, నేను కూడా చేస్తాను. మనమిద్దరం తిరుచెందూర్‌లో తలపడదాం. ఇది మా సొంత గడ్డ, ఇక్కడ మేము ఎవరినైనా ఓడిస్తాం" అని రాధాకృష్ణన్ అర్జునకు సవాల్‌ విసిరారు.

కాగా తిరుచెందూర్ నియోజకవర్గం గత 25 ఏళ్లుగా రాధాకృష్ణన్‌కు కంచుకోటగా ఉంది. ఆయన మొదట 2001లో డీఎంకే బద్ధశత్రువైన ఏఐఏడీఎంకే (AIADMK) తరపున ఇక్కడి నుండి గెలిచారు. ఆ తర్వాత 2009లో డీఎంకేలో చేరి, అప్పటి నుండి ఈ స్థానాన్ని తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలలోనే విజయ్ సాధించిన విజయం అతిపెద్ద సంచలనంగా నిలిచింది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగానే 108 స్థానాలను కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీకి కేవలం 10 స్థానాల దూరంలో నిలిచినప్పటికీ, గత 62 ఏళ్లుగా తమిళనాడును మారుమార్చిపాలిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారు.తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో మాజీ డీఎంకే నాయకుడు, ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీలో ఉన్న వి.ఎస్. బాబు చేతిలో  మాజీ ముఖ్యమంత్రి  స్టాలిన్‌ ఓటమి పాలయ్యారు. 

ఆ తర్వాత వారం రోజుల పాటు జరిగిన తీవ్ర రాజకీయ డ్రామా అనంతరం కాంగ్రెస్, రెండు లెఫ్ట్ పార్టీలు, విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) మద్దతుతో టీవీకే మెజారిటీ మార్కును దాటింది.  దీంతో ఆ తర్వాత జరిగిన విశ్వాస పరీక్షలో కూడా 144-22 ఓట్ల తేడాతో మెజారిటీ నిరూపించుకున్న తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి వచ్చి అగ్రపీఠాన్ని అధిరోహించారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పాలన, నియామకాలు, పరిపాలనాపరమైన నిర్ణయాలపై డీఎంకే నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement