నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట! | India's Forgotten Urban Masterpiece | Sakshi
Sakshi News home page

నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట!

May 18 2026 8:42 AM | Updated on May 18 2026 8:57 AM

India's Forgotten Urban Masterpiece

మనం ఇంటి నుండి బయటకు అడుగుపెట్టగానే... ఆఫీసులు, ఆస్పత్రులు, పాఠశాలలు, మార్కెట్లు అన్నీ కేవలం 15 నిమిషాల నడక దూరంలోనే ఉంటే ఎలా ఉంటుంది? ఇదేదో ప్యారిస్‌ లేదా బార్సిలోనా లాంటి విదేశీ నగరాల్లోని అత్యాధునిక విధానం అనుకుంటున్నారా? కాదు.. పశ్చిమ దేశాలు ‘15 నిమిషాల నగరం’ (15-Minute City) అనే పదాన్ని కనిపెట్టక ముందే, మన భారతదేశంలోని పాత నగరాలు ఈ అద్భుతమైన జీవనశైలికి అసలైన చిరునామాలుగా నిలిచాయి. అయితే ఆధునికీకరణ వైపు పరుగెడుతూ, మన సొంత నమూనాను మనమే ఎలా చేజేతులా దూరం చేసుకున్నామో తెలిస్తే  ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

‘15 నిమిషాల నగరం’ అంటే ఏమిటి?
కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సరికొత్త పట్టణ ప్రణాళికే ఈ ‘15 నిమిషాల నగరం’. పని ప్రదేశాలు, కిరాణా దుకాణాలు, ఆస్పతులు, పాఠశాలలు, రవాణా సౌకర్యాలు ఇలా రోజువారీ అవసరాలన్నీ ఇంటి నుండి కేవలం 15 నిమిషాల నడక లేదా సైకిల్ ప్రయాణంలో అందుబాటులో ఉండాలన్నదే ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం. రోజువారీ ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడానికి పారిస్, బార్సిలోనా లాంటి ప్రపంచ నగరాలు ఇప్పుడు ఇదే విధానాన్ని పాటిస్తున్నాయి.

మన పాత నగరాలే దానికి జీవన ఉదాహరణలు
నిజానికి ఈ మోడల్ భారతదేశానికి ఏమాత్రం కొత్త కాదు. పాత ఢిల్లీ, ముంబైలోని కొన్ని ప్రాంతాలు, బెంగళూరులోని బసవనగుడి, అలాగే హైదరాబాద్, చెన్నైలోని పాత కాలపు వీధుల్లో ప్రజల నివాసాలు, వాణిజ్య సముదాయాలు కలిసిపోయి ఉండేవి. ఇళ్ల కిందే దుకాణాలు, గుడి పక్కనే బడి, కూరగాయల మార్కెట్లు, మందుల షాపులు అన్నీ కూతవేటు దూరంలోనే దొరికేవి. అప్పట్లో నగరాలను ప్రత్యేకంగా డిజైన్ చేయకపోయినా, అన్నీ దగ్గరగా ఉండటం వల్ల ప్రజలు నడిచి వెళ్లడానికే ఎక్కువ ఆసక్తి చూపేవారు.

ఎక్కడ దారి తప్పాం?
కాలక్రమంలో మన పట్టణీకరణ విధానం పూర్తిగా దారి తప్పింది. విశాలమైన రోడ్లు, భారీ గేటెడ్ కమ్యూనిటీలు, శివార్లలో ఐటీ కారిడార్ల నిర్మాణం కారణంగా నగరాల రూపురేఖలు విచ్ఛిన్నమయ్యాయి. ఆఫీసులు నివాస ప్రాంతాలకు దూరంగా వెళ్లిపోయాయి, నడక తగ్గిపోయింది. ఉదాహరణకు బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రాంతాల్లో ఆఫీసులు, మాల్స్ దగ్గరగానే ఉన్నట్లు అనిపించినా, సరైన దారులు లేక ఆ కొద్ది దూరం వెళ్లడానికే నిత్యం గంటల కొద్దీ ట్రాఫిక్‌లో నరకం చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ముంబై ఇప్పటికీ ఎందుకు భిన్నం?
దేశంలో అత్యంత జనసాంద్రత కలిగిన ముంబై నగరం ఈ ‘15 నిమిషాల నగరం’ విధానానికి నేటికీ చాలా దగ్గరగా ఉంటుంది. ముంబైలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు సొంత వాహనాలపై ఆధారపడకుండానే రైల్వే స్టేషన్లు, కిరాణా షాపులు, రెస్టారెంట్లు, ఆస్పత్రులకు సులభంగా చేరుకోగలరు. ముంబైలో జనసాంద్రత ఎక్కువ అని విమర్శలు ఉన్నప్పటికీ, ఆ సాంద్రతే అన్నీ అందుబాటులో ఉండేలా చేసింది. ప్లానర్లు ఇప్పుడు కృత్రిమంగా సృష్టించాలని చూస్తున్న ‘మిక్స్‌డ్-యూజ్’ విధానాన్ని ముంబై ఏనాడో ఒంటపట్టించుకుంది.

నడవలేని ఫుట్‌పాత్‌లు.. ప్రాణసంకటమైన రోడ్లు
15 నిమిషాల నగరం వినడానికి చాలా బాగున్నా, ఆచరణలో మన దేశంలో ఎదురవుతున్న అతిపెద్ద అడ్డంకి ‘ఫుట్‌పాత్‌లు’. నేటి భారతీయ నగరాలు పాదచారులకు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఫుట్‌పాత్‌లు మధ్యలోనే మాయమైపోతాయి, లేదా వాహనాల పార్కింగ్, ఆక్రమణలతో నడవడానికి వీల్లేకుండా మారిపోయాయి. ఇక రోడ్డు దాటడం పెద్దలకే ఒక సాహసం అయితే, పిల్లలు, వృద్ధుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. సైకిల్ ట్రాక్‌లు కూడా పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి. సురక్షితమైన దారులు లేకుండా ఈ అద్భుతమైన పద్ధతిని అమలు చేయడం అసాధ్యం.

మళ్లీ మన పాత దారికి వెళ్లాల్సిన సమయం
కరోనా తర్వాత పెరిగిన వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, విపరీతమైన ట్రాఫిక్, కాలుష్యం, ఇంధన ధరల పెరుగుదల లాంటి కారణాలతో స్థానికంగానే అన్నీ అందుబాటులో ఉండే జీవనశైలిపై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. గంటల తరబడి ప్రయాణాలు చేయలేక యువత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ తరుణంలో భారతదేశం విదేశాల నుంచి ఈ ‘15 నిమిషాల నగరం’ ఆలోచనను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన పాత నగరాల స్ఫూర్తిని కోల్పోకుండా, ఆధునికతను జోడిస్తూ, మళ్లీ పాదచారులకు అనుకూలమైన నగరాలను నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఇది కూడా చదవండి: బిందెడు నీరు.. బతుకంతా కన్నీరు!

Advertisement
 
Advertisement
Advertisement