నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దాంతో రక్తంలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదకరమా? నేను ఇకపై డయాబెటిక్‌గా ఉండాల్సి వస్తుందా?
– శైలజ, గుంటూరు.
గర్భధారణ సమయంలో కొంతమంది మహిళల్లో రక్తంలో షుగర్ స్థాయి పెరగవచ్చు. దీనిని ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. ఇది గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల ప్రభావం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం కారణంగా వస్తుంది. ఇది సాధారణంగా 24 నుంచి 28 వారాల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది.
అందుకే ప్రతి గర్భిణీకి ఓజీటీటీ అనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు. కొంతమంది మహిళల్లో ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గత గర్భధారణలో జెస్టేషనల్ డయాబెటిస్ ఉండటం, కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉండటం, 35 ఏళ్లకు పైబడిన వయస్సు, అధిక బరువు వంటి కారణాలు ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నప్పుడు తల్లి, బిడ్డకు కొన్ని సమస్యలు రావచ్చు. బిడ్డ బరువు ఎక్కువగా పెరగడం, ఉమ్మనీరు ఎక్కువ కావడం, డెలివరీ సమయంలో ఇబ్బందులు, డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత బిడ్డకు శ్వాస సమస్యలు లేదా తక్కువ షుగర్ లెవల్స్ రావచ్చు, కానీ ఇవి సాధారణంగా చికిత్సతో నియంత్రించవచ్చు. ఇది నిర్ధారణ అయిన తర్వాత మీరు డైట్ పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో షుగర్ స్థాయిలను తరచూ చెక్ చేసుకోవాలి.
డైట్‌తో నియంత్రణలో లేకపోతే సురక్షితమైన మందులు లేదా ఇన్సులిన్ ఇవ్వవచ్చు. ఇవి తల్లికి, బిడ్డకు సేఫ్‌గా ఉంటాయి. చాలా సందర్భాల్లో డెలివరీ అయిన తర్వాత ఈ జెస్టేషనల్ డయాబెటిస్ తగ్గిపోతుంది. అయితే భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
నేను ఇప్పుడు ఎనిమిది వారాల గర్భవతిని. గతంలో ఏడు వారాలలో మిస్‌క్యారేజ్ అయింది. ఈ గర్భధారణలో ఇప్పటివరకు నాకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది.
– రూప, కర్నూలు.
గర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశ చాలా కీలకం, ఎందుకంటే ఈ సమయంలో శిశువు ముఖ్యమైన అవయవ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. అయితే ఇదే సమయంలో మిస్‌క్యారేజ్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ప్రతి గర్భిణీ గమనించాల్సిన రెండు ముఖ్యమైన లక్షణాలు బ్లీడింగ్, కడుపు నొప్పి. ఫస్ట్ ట్రైమెస్టర్లో బ్లీడింగ్‌కు అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో చాలా సందర్భాల్లో ఇది తల్లి లేదా శిశువుకు హానికరం కాకపోవచ్చు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, ఇన్ఫెక్షన్లు, సెక్స్ తర్వాత రక్తస్రావం, హార్మోన్ల మార్పులు వంటి కారణాలు ఉండవచ్చు.
అయితే ముందుగా తప్పకుండా రూల్ అవుట్ చేయాల్సిన రెండు ముఖ్యమైన పరిస్థితులు మిస్‌క్యారేజ్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. మీరు డాక్టర్‌ను కలిసినప్పుడు పూర్తి వైద్య చరిత్ర తీసుకుంటారు, శరీర పరీక్ష చేస్తారు, అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా శిశువు పరిస్థితిని చెక్ చేస్తారు. ఈ పరీక్షలతో బ్లీడింగ్‌కు గల అసలు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్యం స్థిరంగా ఉండి, స్కాన్‌లో బిడ్డ బాగానే కనిపిస్తే, బ్లీడింగ్ పరిమాణం, కారణాన్ని బట్టి చికిత్స ఇస్తారు.
ఇందులో ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, మనశ్శాంతిగా ఉండడం చాలా ముఖ్యం. అవసరమైతే ప్రొజెస్టెరాన్ మందులు కూడా ఇస్తారు, ఇవి గర్భధారణకు మద్దతు ఇస్తాయి. గతంలో మిస్‌క్యారేజ్ జరిగినందుకు ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భధారణ వేరు. చాలాసార్లు సరైన పర్యవేక్షణతో ఆరోగ్యంగా గర్భధారణ కొనసాగుతుంది.
బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ఆసుపత్రిలో అబ్జర్వేషన్ కోసం ఉంచవచ్చు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం, డాక్టర్ సూచనలు పాటించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలా మంది మహిళలు ఆరోగ్యంగా బిడ్డలను ప్రసవిస్తున్నారు.
డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: బీపీని నియంత్రణలో ఉంచే ‘3-3-3’ రూల్ అంటే..? వైద్యులు ఏమంటున్నారంటే..)


