నిర్దోషని కోర్టు చెప్పినా..14 ఏళ్లు నిర్బంధంలోనే.. | Legal Advice: Rudul Sah Vs State of Bihar and Another | Sakshi
Sakshi News home page

నిర్దోషని కోర్టు చెప్పినా..14 ఏళ్లు నిర్బంధంలోనే..

May 17 2026 10:09 AM | Updated on May 17 2026 10:40 AM

Legal Advice: Rudul Sah Vs State of Bihar and Another

హత్య కేసులో ఓ వ్యకి జైలు కెళ్లాడు. సెషన్స్‌ కోర్టులో కేసు విచారణ జరిగింది. ఆ వ్యక్తిని  కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయినా ఆ వ్యక్తికి స్వేచ్ఛ లభించలేదు. జైలు గోడలు దాటి బయటకు రాలేదు. రోజులు నెలలయ్యాయి.. నెలలు సంవత్సరాలయ్యాయి.. అలా 14 సంవత్సరాలు గడిచాయి. విడుదల ఊసు లేదు. 

ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. తనను విడుదల చేయాలని బాధితుడే చివరికి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. ఫైలు కదిలింది..ఆ వ్యక్తికి విడుదల లభించింది. తీర్పుకు ముందే ఇదంతా జరిగింది. అయితే అధికారుల తీరును, వ్యవస్థలోని లోపాలను కోర్టు తప్పుబట్టింది. ఓ వ్యక్తి జీవించే హక్కును కాలరాశారంటూ మండిపడింది. పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఒక చారిత్రక ముందడుగుకు ఈ కేసు మార్గం చూపింది.

బిహార్‌కు చెందిన రుదుల్‌ సాహ్‌ ఓ హత్య కేసులో అరెస్టయి జైలు కెళ్లాడు. ముజఫర్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు అతనిపై నమోదైన అభియోగాలను కొట్టేసింది. 1968లో నిర్దోషిగా ప్రకటించింది. అయినా అతడ్ని విడుదల చేయలేదు. దాంతో 1982 వరకు అంటే 14 సంవత్సరాల పాటు నిర్బంధంలోనే ఉన్నాడు.  

‘సుప్రీం’లో పిటిషన్‌
తన నిర్బంధం చట్టవిరుద్ధమని, నిర్దోషిగా ప్రకటించినా కారాగారంలోనే ఉంచారని,  వెంటనే విడుదల చేయాలని రుదుల్‌ సాహ్‌ సుప్రీంకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు.. పునరావాసం, అక్రమ నిర్బంధానికి పరిహారం ఇవ్వాలని  అభ్యర్థించాడు. అయితే బాధితుడు పిటిషన్‌ వేసిన తర్వాత అధికారులు అతడ్ని జైలు నుంచి విడుదల చేశారు. ఈ పిటిషన్‌ 1982 నవంబర్‌ 22న విచారణకు వచ్చింది. పిటిషనర్‌ ఇప్పటికే విడుదలైనందున ‘విడుదల’ అభ్యర్థన అర్థం లేనిదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నాడు. 

విడుదలే పరిష్కారం కాదు
పిటిషనర్‌ విడుదలతో ఈ కేసు ముగిసినట్టు కాదని విచారణ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్‌ను 14 సంవత్సరాలు జైల్లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు జైలులో ఉంచాలని సెషన్స్‌ కోర్టు పేర్కొంది..అతని మానసిక స్థితి కూడా సరిగా లేకపోవడంతో విడుదలలో జాప్యం జరిగింది’ అని ముజఫర్‌పూర్‌ జైలు అధికారి అఫిడవిట్‌ సమర్పించాడు. 

సరైన ఆధారాలేవీ?
అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్‌ మానసిక స్థితి సరిగా లేదని నిరూపించే మెడికల్‌ సర్టిఫికెట్లు, చికిత్స వివరాలు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది. 1977లో సాధారణ స్థితికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత అయినా ఎందుకు విడుదల చేయలేదని ధర్మాసనం నిలదీసింది. 

ఒకవేళ పిటిషనర్‌ మానసిక స్థితి సరిగా లేకపోతే చట్టం అతడికి కల్పించిన హక్కుల ప్రకారం విచారణ కూడా చేయకూడదు కదా? అని ప్రశ్నించింది.‘ పిచ్చి వాడనే’వాదన తర్వాత తయారు చేసినట్టుగా కనిపిస్తోందని ఆక్షేపించింది.  అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పరిహారం చెల్లింపునకు ఆదేశం
ప్రాథమిక హక్కు ఉల్లంఘిస్తే, ఆ ఉల్లంఘనకు పరిహారం చెల్లించాలని ఆదేశించడం కూడా కోర్టు పరిధిలోకి వస్తుందని ‘సుప్రీం’ స్పష్టం చేసింది. అక్రమంగా 14 ఏళ్లపాటు జైలులో ఉన్నాడు. కాబట్టి కావున అతనికి పరిహారం ఇవ్వడం తప్పని సరి అని కోర్టు పేర్కొంది. తాత్కాలిక ఉపశమనంగా చెల్లించిన ఐదువేల రూపాయలకి అదనంగా మరో రూ. 30,000 చెల్లించాలని ఆదేశించింది. 

మరింత నష్టపరిహారం కోసం సివిల్‌ కోర్టును ఆశ్రయించడానికి ఇది అడ్డంకి కాదని పేర్కొంది. వ్యక్తిగత హక్కుల రక్షణే ప్రజాస్వామ్యానికి మూలాధారం. ప్రభుత్వ అధికారులు చేసిన తప్పుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని, ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిందే అని సర్వోన్నత న్యాయస్థానం  పేర్కొంది. ఈ కేసుకు ముందు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే కేవలం విడుదల ఆదేశాలకు మాత్రమే కోర్టు పరిమితమయ్యేది. కానీ, ఒక వ్యక్తి ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తే ..  నేరుగా జోక్యం చేసుకుని పరిహారం ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వగలదని ఈ కేసులో స్పష్టం అయింది.   కేసులో ప్రధానంగా ఆర్టికల్‌ 21, ఆర్టికల్‌ 32 గురించి ధర్మాసనం ప్రస్తావించింది..

ఆర్టికల్‌ 21: చట్టబద్ధమైన కారణం లేకుండా ప్రభుత్వం ఎవరినీ నిర్బంధించకూడదు. ఏ వ్యక్తి జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదని ఈ ఆర్టికల్‌  చెబుతోంది. 
ఆర్టికల్‌ 32: రాజ్యాంగ పరిహారాల హక్కుకు హామీ ఇస్తుంది . ఇది ప్రాథమిక హక్కుల  అమలు కోసం నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించే అధికారాన్ని పౌరులకు కల్పిస్తుంది.   

Advertisement
 
Advertisement
Advertisement