మీ ఉ‍ప్పులో అయోడిన్‌ ఉందా? | Is there iodine in your salt and Benefits | Sakshi
Sakshi News home page

మీ ఉ‍ప్పులో అయోడిన్‌ ఉందా?

May 17 2026 8:12 AM | Updated on May 17 2026 8:34 AM

Is there iodine in your salt and Benefits

పాత కాలంలో గాయం అయితే దానికి అయోడిన్‌ పూసి కట్టు కట్టే వారు. అంతకుమించి అయోడిన్‌ గురించి ఎక్కువగా తెలియదు. అయోడిన్‌ అన్నది ఒక ఖనిజం. అది మన ఆహారంలో తప్పకుండా ఉండి తీరాలి. శరీరంలో మామూలుగా జరిగే జీవ చర్యలను, పెరుగుదలను, జీర్ణ క్రియను, గుండె కొట్టుకునే వేగాన్ని, శరీరపు ఉష్ణోగ్రతను నియంత్రించే హార్మోన్‌ల తయారీలో అయోడిన్‌కు ప్రధాన పాత్ర ఉంటుంది. అంటే మనకు అనునిత్యం ఆహారంలో అయోడిన్‌ తప్పకుండా ఉండి తీరాలని అర్థం.

గర్భవతులకు ప్రధానంగా అయోడిన్‌ అవసరం ఎక్కువ. థైరాయిడ్‌కు సంబంధించిన హార్మోన్లు గర్భంలో పెరిగే శిశువు పెరుగుదలను, ముఖ్యంగా శిశువు మెదడు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. అటువంటి స్థితిలో అయోడిన్‌ ఉండవలసిన స్థాయికన్నా ఏ కొంచెం తగ్గినా శిశువు తెలివితేటలు 0.3 నుంచి 13 ఐక్యూ పాయింట్ల దాకా తగ్గుతుంది. ఇక శిశువు పుట్టిన తర్వాత కూడా మెదడు పెరుగుదల థైరాయిడ్‌ పనితీరు విషయంగా అయోడిన్‌ ఎంతో అవసరం. పిల్లలలోగానీ, పెద్దలలోగానీ అయోడిన్‌ లోపం బలంగా ఉంటే ‘గాయిటర్‌’ అనే లక్షణం కనబడుతుంది. దీన్ని తెలుగులో ‘కంఠమాల’ అంటారు. గొంతు బాగా వాచి పెద్దదిగా కనిపించే ఈ సమస్యకు కారణం అయోడిన్‌ లోపమే. ఫలితంగా థైరాయిడ్‌ గ్రంథి పెద్దది అవుతుంది. ఎక్కువ అయోడిన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.

20వ శతాబ్దంలో ప్రపంచమంతటా తెలివితేటలు పెరగడానికి కారణం అయోడిన్‌ కలిపిన ఉప్పు తినడమే అన్నసంగతి పరిశోధకులు గమనించారు. సముద్రంలో పెరిగే మొక్కలు, మిగతా సముద్రం నుంచి వచ్చే తిండి పదార్థాలలో అయోడిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఆవు పాలలో కూడా అయోడిన్‌ ఉంటుంది. మనదేశంలో కాకపోవచ్చు కానీ చాలా చోట్ల ఆవులకు పెట్టే తిండిలో అయోడిన్‌ కలుపుతారు. పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో కొంతవరకు అయోడిన్‌ ఉండే వీలుంది. అవి నేల నుండి ఈ ఖనిజాన్ని గ్రహిస్తాయి. అయితే అన్నిచోట్లా ఈ పదార్థం అన్ని రకాల పంటలలో ఒకే రకంగా ఉండదు. ఒకప్పుడు స్విట్జర్లాండ్‌లోనూ, యూఎస్‌లోని మిషిగన్‌ ప్రాంతంలోనూ కంఠమాల వ్యాధి ఎక్కువగా కనిపించేది. భారతదేశంలో కూడా ఈ సమస్య గమనించవలసిన స్థాయిలో కనిపించేది.

ఆ జాగ్రత్త ఉందా?
1922 సంవత్సరంలో స్విట్జర్లాండ్‌ దేశంలో ఉప్పుతోబాటు అయోడిన్‌ కలిపి తినాలని నిర్ణయించారు. దాని తర్వాత కొంత కాలంలోనే ఆ దేశంలో గాయిటర్‌ వ్యాధి బాగా తగ్గినట్టు తెలిసింది. పిల్లల ఎత్తు బాగా పెరిగింది. ‘డిమిట్రా పొలిటి’ అనే ఆర్థికవేత్త తెలివి విషయంగా ఆ ప్రాంతాలలో జరిగిన మార్పు గురించి ఎంతో కృషిచేసి పత్రాలు సమర్పించారు. 1924లో మిషిగన్‌లో కూడా అయోడైజ్డ్‌ ఉప్పు వాడకం మొదలయింది. ఆ తర్వాత మరెన్నో దేశాలు అదే దారిలో నడిచాయి. మన దేశంలో మాత్రం ఆ జాగ్రత్త కనిపించలేదు. తర్వాత కాలంలో మాత్రమే అయోడైజ్డ్‌ ఉప్పు గురించి ప్రచారం మొదలైంది. మొత్తం మీద ప్రపంచమంతటా 20వ శతాబ్దంలో అయోడిన్‌ వాడకం కారణంగా ఐక్యూ స్థాయిలో పెరుగుదల కనిపించింది.

అయోడిన్‌ ప్రకృతి సిద్ధమయిన ఖనిజ పదార్థం. కానీ అదేదో అనవసరమైనది అన్న భావం చాలామందికి ఉండటం ఆశ్చర్యకరం. యూఎస్‌లో జరిగిన ఇటీవల పరిశోధనల్లో సుమారు సగం మంది గర్భవతులకు తగినంత అయోడిన్‌ అందడం లేదని తేలింది. మనదేశంలో ఇటువంటి పరిశోధనలు జరుగుతున్న పరిస్థితి  కనిపించడం లేదు. అందరూ మరొక సారి, అయోడిన్‌ కలిపిన ఉప్పు గురించి ఆలోచించాలి. దాని వాడకం ద్వారా పెద్దలకు, ముఖ్యంగా గర్భవతులు, శిశువులకు మెదడు పెరుగుదల గురించి కలిగే ప్రయోజనాలను అందరికీ అందజేయాలి అంటున్నారు పరిశోధకులు.
-కే.బి, గోపాలం.. వ్యాసకర్త సైన్స్‌ అంశాల రచయిత

Advertisement
 
Advertisement
Advertisement