మనీలాండరింగ్ కేసు: రాబర్ట్ వాద్రాకు భారీ ఉపశమనం | Robert Vadra Gets Bail In Gurugram Land Deal Case | Sakshi
Sakshi News home page

మనీలాండరింగ్ కేసు: రాబర్ట్ వాద్రాకు భారీ ఉపశమనం

May 16 2026 11:49 AM | Updated on May 28 2026 11:44 AM

Robert Vadra Gets Bail In Gurugram Land Deal Case

షికోహ్‌పూర్: హర్యానాలోని గురుగ్రామ్ జిల్లా షికోహ్‌పూర్ భూముల కొనుగోలుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అల్లుడు, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శనివారం ఉపశమనాన్ని కల్పించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. రూ. 50,000 వ్యక్తిగత బాండ్, ఒక షూరిటీపై ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ విచారణకు హాజరైన అనంతరం వాద్రా మాట్లాడుతూ.. తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, తాను దాచాల్సింది ఏమీ లేదని అన్నారు.

కోర్టు ఆదేశాలు – బెయిల్ మంజూరు
గత ఏడాది జూలైలో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు.. మే 16న వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ రాబర్ట్ వాద్రాతో పాటు ఇతర నిందితులకు ఏప్రిల్ 15న సమన్లు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు శనివారం కోర్టుకు హాజరైన వాద్రాకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈడీ దాఖలు చేసిన సమన్లను సవాలు చేస్తూ వాద్రా అంతకుముందే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ.. విచారణాధికారుల ముందు హాజరుకాక తప్పలేదు. 57 ఏళ్ల వాద్రాపై ఒక దర్యాప్తు సంస్థ క్రిమినల్ ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

వివాదాస్పద భూ లావాదేవీల నేపథ్యం
ఈ మనీలాండరింగ్ కేసు 2008 నాటి హర్యానా భూ లావాదేవీలకు సంబంధించినది. గురుగ్రామ్‌లోని మానెసర్-షికోహ్‌పూర్ (ప్రస్తుత సెక్టార్ 83) ప్రాంతంలో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుండి ‘స్కైలైట్ హాస్పిటాలిటీ’ అనే సంస్థ (అప్పట్లో వాద్రా ఇందులో డైరెక్టర్‌గా ఉన్నారు) 3.5 ఎకరాల భూమిని రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో హర్యానాలో భూపిందర్ సింగ్ హుడ్డా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ తర్వాత 2012లో ఇదే భూమిని ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం డిఎల్ఎఫ్ సంస్థకు రూ. 58 కోట్లకు విక్రయించడంతో ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది.

రాజకీయ కక్షసాధింపే: వాద్రా ఆరోపణలు
అప్పటి భూ కన్సాలిడేషన్‌ డైరెక్టర్ జనరల్, ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా నియమ నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఈ భూమి మ్యుటేషన్‌ను రద్దు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఆరోపణలన్నింటినీ రాబర్ట్ వాద్రా తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తనను, తన కుటుంబ సభ్యులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకుని ఈ కేసులు పెట్టిందని ఆరోపించారు. ఈడీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకే, రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తోందని ఆయన విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement