మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్‌ను మరోసారి క్లిష్ట పరిస్థితిలోకి నెడుతున్నాయి. ఇరాన్-అమెరికా ఘర్షణలు, హౌతీ తిరుగుబాటుదారుల కదలికలు, సౌదీ అరేబియా భద్రతపై ముప్పు నేపథ్యంలో పాకిస్తాన్‌పై సైనికంగా స్పందించాలనే ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2015లో యెమెన్ యుద్ధ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితినే పాకిస్తాన్ ఎదుర్కొంది. సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి హౌతీలపై యుద్ధం ప్రారంభించినప్పుడు, తమకు మద్దతుగా పాకిస్తాన్ సైన్యాన్ని పంపాలని రియాద్ కోరింది. అయితే పాకిస్థాన్ పార్లమెంట్ విస్తృత చర్చల అనంతరం యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకూడదని నిర్ణయించింది.
అప్పట్లో పాకిస్తాన్‌కు రెండు వైపులా సవాళ్లు ఎదురయ్యాయి. ఒకవైపు సౌదీ అరేబియాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్షణ, ఆర్థిక సంబంధాలు ఉండగా, మరోవైపు ఇరాన్ పొరుగుదేశంగా ఉండటంతో ఆ దేశంతో సంబంధాలను దెబ్బతీయాలని ఇస్లామాబాద్ కోరుకోలేదు. తాజాగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ వేడెక్కుతున్నాయి. హౌతీలు సౌదీ లక్ష్యాలను టార్గెట్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు, ఎర్ర సముద్రంలో నౌకాయాన భద్రతపై ఆందోళనలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దౌత్యపరంగా సమతుల్య వైఖరిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవైపు సౌదీ అరేబియాకు మద్దతు ప్రకటిస్తూనే, మరోవైపు ఇరాన్‌తో సంబంధాలను కొనసాగించాలని చూస్తోంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతూ, సౌదీ భద్రతకు మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చితే పాకిస్తాన్‌పై ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలనే ఒత్తిడి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2015లో యెమెన్ యుద్ధానికి దూరంగా నిలిచిన పాకిస్థాన్.. ఇప్పుడు మరోసారి అదే నిర్ణయాన్ని కొనసాగించగలదా? లేక మారిన పరిస్థితులు దాని విధానాన్ని మార్చేలా చేస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
పాకిస్తాన్‌కు మూడు ప్రధాన సవాళ్లు..
సౌదీతో వ్యూహాత్మక సంబంధాలను కాపాడుకోవడం
ఇరాన్‌తో పొరుగుదేశ సంబంధాలను కొనసాగించడం
ప్రత్యక్ష యుద్ధంలో చిక్కుకోకుండా దేశ ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను రక్షించడం
అయితే, పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతోంది. మరోవైపు, సైనికంగా ఏదైనా చర్య తీసుకుంటే అది దేశీయంగా, అంతర్జాతీయంగా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇస్లామాబాద్ ప్రస్తుతం "దౌత్య సమతుల్యత" విధానాన్నే అనుసరిస్తోంది. యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా, అవసరమైతే మధ్యవర్తిత్వ పాత్ర పోషించాలని ప్రయత్నిస్తోంది.


