అడ్వర్టైజ్‌మెంట్‌లు... మా రాంబాబుగాడి మూఢనమ్మకాలు! | Funniest Commercials and Adverts of All Time | Sakshi
Sakshi News home page

అడ్వర్టైజ్‌మెంట్‌లు... మా రాంబాబుగాడి మూఢనమ్మకాలు!

Jul 24 2026 4:23 PM | Updated on Jul 24 2026 5:05 PM

Funniest Commercials and Adverts of All Time

మా రాంబాబుగాడికి కొన్ని మూఢనమ్మకాలున్నాయి. అవి అలాంటిలాంటి మూఢనమ్మకాలు కావు. అన్నీ అడ్వరై్టజ్‌మెంట్స్‌ గురించే. పాత రోజుల్లో... అప్పట్లో ఓ డ్రింక్‌ తాలూకు అడ్వర్టైజ్‌మెంట్‌ ఏదో వచ్చేదట... ‘టేస్ట్‌ ద థండర్‌’ అంటూ! అప్పటి నుంచి పిడుగు ఎక్కడ పడుతుందో తెలుసుకుని దాన్ని కాస్తంత టేస్ట్‌ చూడాలన్నది వాడి తాపత్రయం. ఎక్కడో ఫలానా చోట పిడుగుపడిందంటే ఎంత ఖర్చయినా పెట్టుకుని అక్కడికి వెళ్లేవాడు. 

‘‘సార్‌... ఇక్కడ పిడుగు పడిందట. ఏమనుకోక΄ోతే... కాస్తంత పిడుగు రుచి చూపిస్తారా? ఒకే ఒకసారి కొద్దిగా టేస్ట్‌ చేస్తా సార్‌’’ అంటూ అక్కడివాళ్లను బతిమాలాడు. దాంతో ఆ అడ్వర్టైజ్‌మెంట్‌ తాలూకు బాటిల్‌ను వాడికి ఇచ్చి,.. ‘‘ఇందులో పిడుగును బంధించాం సార్‌. అదెంత పవర్‌ఫుల్‌ అంటే... జస్ట్‌ మీరు బాటిల్‌ మూత రుచి చూసినా టేస్టు  తెలిసిపోతుంద’’న్నారు వాళ్లు. ‘‘ఏదో గొప్పగా ఉంటుందనుకున్నాగానీ... థండర్‌ రుచి చాలా పేలవంగా ఉంది సార్‌’’ అంటూ అక్కణ్నుంచి నిరాశగా వెళ్లిపోయాడు మన రాంబాబు. 
∙∙ 
ఇక మరో అడ్వర్టైజ్‌మెంట్‌ ఏదో వచ్చేదట... ‘ఖడ్గంతో గడ్డం చేసుకోండి’ అని! అప్పట్నుంచి వాడిలో మరో మూఢనమ్మకం మొదలైంది. ‘మామూలు చిన్న బుజ్జి బ్లేడ్‌తో చేసుకుంటేనే ఇంత బాగుంది కదా. మరి ఖడ్గంతో చేసుకుంటే ఎంత స్మూత్‌గా ఉంటుందో’ అని. ‘‘ఒరేయ్‌ నాయనా... కొట్టడానికి సైకిల్‌ చైన్‌ ఫ్లెక్సిబుల్‌గా ఉండనట్టే... ఖడ్గంతో గడ్డం చేసుకోవడమూ కష్టమవుతుందిరా బాబూ’’ అంటే ఎంతకీ వినడే. 

దాంతో వాడి ఫ్రెండ్‌ ఒకడు ఒక బ్లేడ్‌ తెచ్చిచ్చి... ‘‘నీకు తెలుసా... ఖడ్గం నుంచి ఎక్స్‌ట్రాక్ట్‌ చేసిన మెటల్‌తోనే ఇది తయారైంది. ఖడ్గానికి మినీ వర్షన్‌రా ఇదీ! దీంతో గడ్డం చేసుకుంటే ఖడ్గంతో చేసుకున్నట్టే’’ అని వాడిని కన్విన్స్‌ చేశారు. అప్పట్నుంచి వాడు మామూలు బ్లేడ్‌నే ఖడ్గఖండమనే భ్రమలో ఉంటూ... అలా గడ్డం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. 
∙∙ 
ఇక మరో దశలో వీడి పిచ్చి ఇంకాస్త పీక్స్‌కు చేరింది. అదేదో సబ్బు రుద్దుకోవాలంటే తప్పనిసరిగా జలపాతం కిందే స్నానం చేయాలన్నది వాడి మరో మూఢనమ్మకంగా మారింది. ఆ సబ్బు వాడటానికి జలపాతానికి వెళ్లాలంటూ రోజూ పొద్దున్నే ఒకటే గొడవ. చివరకు వాళ్ల నాన్న వాళ్లింట్లో షవర్‌ పెట్టించాడు. 

‘‘ఒరే నాన్నా... అందరూ అడవిదాకా వెళ్లి జలపాతంలోనే స్నానం చేయాలంటే కుదర్దు కదా. అందుకే ఆ కంపెనీల వాళ్లు జలపాతానికి ఆల్టర్నేట్‌గా షవర్‌లను తయారు చేశారు. షవరంటే ఏమనుకున్నావు... జలపాతాన్ని మడిచి బాత్‌రూమ్‌లో పెట్టిన టెక్నాలజీ రా ఇదీ’’ అంటూ సముదాయిస్తూ... షవర్‌లో వాడి చేత ఆ సబ్బు రుద్దించారు. 
∙∙ 
వీడి మూఢనమ్మకాలకు ట్రీట్‌మెంట్‌ ఇప్పించడానికి రాంబాబు వాళ్ల నాన్న చాలా మంది డాక్టర్లను కలిశాడు. చాలా హాస్పిటల్స్‌ తిరిగాడు. కానీ ఎక్కడా నయం కాలేదు. ఓరోజు రాంబాబుగాడి క్లోజ్‌ ఫ్రెండు దగ్గర తన గోడు వెళ్లబోసుకుంటుంటే...  వాడో సింపుల్‌ సొల్యూషన్‌ చెప్పాడు. ‘‘ఇదంతా ఎందుకు అంకుల్‌. వాడు ఎట్టిపరిస్థితుల్లోనూ టీవీ చూడకుండా ఉండేలా వాణ్ణి బిజీ చేసేయండి. జస్ట్‌ ఇది చేస్తే అంతా సర్దుకుంటుంది చూడండి’’ అంటూ సలహా ఇచ్చాడు.   
– యాసీన్‌ 

(చదవండి: 20 ఏళ్లుగా భార్యతో మాటల్లేవ్‌.. కానీ కలిసే ఉన్నారు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement