వైభవంగా గియాన్‌ మత్సూరీ సంబరాలు.. | Gion Matsuri Festival Sunday Agadam Bagadam Special Story | Sakshi
Sakshi News home page

`వైభవంగా గియాన్‌ మత్సూరీ సంబరాలు..

Jul 19 2026 10:31 AM | Updated on Jul 19 2026 12:08 PM

Gion Matsuri Festival Sunday Agadam Bagadam Special Story

అగడం.. బగడం..

పాన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సాంస్కృతిక ఉత్సవం గియాన్‌ మత్సూరీ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూలై నెల మొత్తం అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. యాసకా ఆలయానికి సంబంధించిన ఈ చారిత్రాత్మక ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన భారీ రథాల ఊరేగింపు జూలై 17న ప్రారంభమైంది. అంగరంగవైభవంగా నిర్వహించే ఈ వేడుకలను వీక్షించేందుకు ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు క్యోటో నగరానికి క్యూకట్టారు.

దైవదూతగా స్థానిక బాలుడు!
క్రీస్తుశకం 869లో నగరంలో వ్యాపించిన ఒక తీవ్రమైన అంటువ్యాధి నుంచి తమను రక్షించాలని దేవుళ్లను వేడుకుంటూ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఉత్సవాలను నిరంతరాయంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ పండుగలో ఇప్పటికీ ఒక విలక్షణమైన ఆచారాన్ని పాటిస్తారు. ఒక స్థానిక బాలుడిని దైవదూతగా ఎంపిక చేస్తారు. ఆ బాలుడు జూలై 13 నుంచి 17వ తేదీన ఊరేగింపు పూర్తయ్యే వరకు నేలపై కాలు మోపరాదనే కఠినమైన నియమం పాటించాల్సి ఉంటుంది.

ఆకట్టుకునే భారీ రథాలు
ఈ ఉత్సవాల్లో ముఖ్యమైనది భారీ రథాల ఊరేగింపు. ఈ ఊరేగింపులో యమ, హొకో అనే రెండు రకాల రథాలను ఉపయోగిస్తారు. ఇందులో హోకో రథాలు సుమారు 25 మీటర్ల ఎత్తు, 12 టన్నుల బరువుతో మనుషులంత పరిమాణం ఉన్న భారీ చక్రాలతో నిర్మితమై ఉంటాయి. జూలై 17న జరిగిన మొదటి ఊరేగింపులో 23 రథాలు పాల్గొంటాయి. జూలై 24న జరిగే రెండో ఊరేగింపులో మిగిలిన 10 రథాలు నగర వీధుల్లో విహరిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రథాల తయారీలో ఒక్క మేకును కూడా ఉపయోగించకుండా కేవలం తాళ్లతోనే రథ భాగాలను అనుసంధానిస్తారు.

రాత్రి వేళల్లో యోయియామా బ్లాక్‌ పార్టీలు!
జూలై 17, 24 తేదీల్లో జరిగే ప్రధాన ఊరేగింపులకు ముందు వచ్చే మూడు సాయంత్రాలు క్యోటో నగరం సరికొత్త శోభను సంతరించుకుంటాయి. వీటిని వరుసగా యోయి– యామా వీధి వేడుకలుగా పిలుస్తారు. వేడుకల సమయంలో రాత్రి వేళల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేస్తారు. ఆహార శాలలు, రంగురంగుల దుకాణాలతో వీధులలో పండుగ  వాతావరణం నెలకొంటుంది. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా సాంప్రదాయ ‘యుకతా’ నూలు వస్త్రాలు ధరించి, వీధుల్లో నృత్యాలు చేస్తారు. ఈ సమయంలోనే స్థానిక ప్రజలు తమ ఇళ్ల తలుపులు తెరిచి, తమ వంశపారంపర్యంగా వస్తున్న పురాతన వస్తువులను ప్రదర్శించే ‘బ్యోబు మత్సూరీ’ అనే వేడుక కూడా ఈ సమయంలోనే జరుగుతుంది.
- రమా జంబుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement