న్యూఢిల్లీ: ఉత్తర, తూర్పు భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు తీవ్రరూపం దాల్చాయి. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, నాగాలాండ్‌లలో సంభవించిన వర్ష సంబంధిత ప్రమాదాల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్, రజౌరీ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో మృతుల సంఖ్య 12కి చేరింది. పూంచ్‌లోని సురాన్‌కోట్ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని జమ్ముకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, అమర్‌నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 10 జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేయగా, 84 రోడ్లు మూసుకుపోయాయి. నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఆకస్మిక వరదలకు ఇళ్లు కొట్టుకుపోయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.


