నిరాహార దీక్ష విర‌మించిన అభిజిత్ దీప్కే | Abhijeet Dipke ended his hunger strike at Jantar Mantar | Sakshi
Sakshi News home page

నిరాహార దీక్ష విర‌మించిన అభిజిత్ దీప్కే

Jul 20 2026 2:06 PM | Updated on Jul 20 2026 3:12 PM

Abhijeet Dipke ended his  hunger strike at Jantar Mantar

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) సోమ‌వారం చేప‌ట్టిన చ‌లో సంస‌ద్ ర్యాలీతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పార్ల‌మెంట్ వైపు దూసుకువ‌చ్చిన సీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు ఎక్క‌డిక‌క్క‌డ‌ అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించాయి. ఆందోళ‌న‌కారుల‌పై భాష్ప‌వాయువు ప్ర‌యోగించి, లాఠిచార్జి చేసి చెద‌ర‌గొట్టాయి. దీంతో పార్ల‌మెంట్ స‌మీపంలో హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

మ‌రోవైపు జంత‌ర్ మంతర్ వ‌ద్ద ఉద్విగ్న ప‌రిస్థితులు క‌నిపించాయి. సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే నిరాహార‌దీక్ష విర‌మించారు. 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఐసా విద్యార్థి నాయకులు నేహా, మనీష్, అమీన్ కూడా త‌మ దీక్ష‌ల‌కు ముగింపు ప‌లికారు. వీరితో బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి ష‌బానా అజ్మీ, విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌, ఆర్జేడీ ఎంపీ మ‌నోజ్‌కుమార్ ఝా, ఆర్జేడీ నేత రాజారామ్ పాల్‌, సీపీఎం ఎంపీ అమ్రారామ్‌, సామాజిక కార్య‌క‌ర్త యోగేంద్ర యాద‌వ్ దీక్ష‌లు విర‌మింప‌జేశారు. నిరాహారదీక్ష ముగిసినా సీజేపీ పోరాటం కొన‌సాగుతుంద‌ని ఈ సంద‌ర్భంగా వీరు ప్ర‌క‌టించారు.

దీక్ష విర‌మించేందుకు అంగీక‌రించిన వాంగ్‌చుక్
తాను చేస్తున్న ఆమ‌ర‌ణ‌ నిరాహారదీక్ష విర‌మిస్తాన‌ని సోన‌మ్ వాంగ్‌చుక్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు మూడు ష‌ర‌తుల‌తో ఆస్ప‌త్రి నుంచి ఆయ‌న స్వ‌ద‌స్తూరితో లేఖ విడుద‌ల చేశారు. మ‌రోవైపు సీజేపీ ర్యాలీలో పాల్గొనేందుకు త‌న‌ను అనుమ‌తించాల‌ని ఆయ‌న కోరారు. త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని, ర్యాలీకి వెళ్తాన‌ని అన్నారు. 

థాంక్యూ ఖ‌ర్గే
యువత ఆందోళ‌న గురించి పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావించినందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేకు కాక్రోచ్‌ జనతా పార్టీ ధ‌న్య‌వాదాలు తెలిపింది. రాజ్య‌స‌భ‌లో ఈ అంశాన్ని ఆయ‌న లేవ‌నెత్తారు. శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌పై పోలీసులు లాఠిచార్జి చేశార‌ని, ఇది సరికాద‌ని ఆయ‌న అన్నారు.

వ‌ర్షాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా..
ఢిల్లీలో వ‌ర్షంలోనూ కాక్రోచ్‌ జనతా పార్టీ ర్యాలీ కొన‌సాగింది. చ‌లో సంస‌ద్ ర్యాలీలో పాల్గొనేందుకు దేశం  న‌లు మూల‌ల నుంచి వేలాదిగా యువ‌త హ‌స్తిన‌కు త‌ర‌లివ‌చ్చారు. భ‌ద్ర‌తా సిబ్బంది అడ్డుకున్నా లెక్క‌చేయ‌కుండా ముందుకు సాగారు. ప‌లువురు సినిమా న‌టులు, రాజకీయ నాయ‌కులు, ప్ర‌జాస్వామ్య‌వాదులు, హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు కూడా సీజేపీ నిర‌స‌న ర్యాలీలో ప‌లుపాంచుకున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా స్పందించి దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని వారు డిమాండ్ చేశారు. 

వీడియోలు వైర‌ల్‌
సీజేపీ ర్యాలీకి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో పోటెత్తాయి. యువ‌త వేలాదిగా త‌ర‌లిరావ‌డంతో పార్ల‌మెంట్ ప‌రిస‌ర ప్రాంతాలు నినాదాల‌తో మార్మోగాయి. ఓ యువ‌కుడిని భ‌ద్రతా సిబ్బంది చుట్టుముట్టి కొడుతున్న వీడియో వైర‌ల్‌గా మారింది. భ‌ద్రతా సిబ్బంది లాఠీల‌తో కొడుతున్నా ఆ యువ‌కుడు ఏమాత్రం బెద‌ర‌కుండా ఎదురెళ్ల‌డం అంద‌రినీ ఆలోచింప‌జేసింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement