గత 36 యేళ్లుగా దేశవ్యాప్తంగా 300కు పైగా లగ్జరీ హోటళ్లను మోసం చేసిన వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సీరియల్ కిల్లర్ 'చార్లెస్ శోభరాజ్' స్ఫూర్తితో, రకరకాల గెటప్పుల్లో ఈ మోసాలకు పాల్పడినట్లు నిందితుడు వెల్లడించడం కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన 69 ఏళ్ల బింగ్సన్ జాన్ మోడెస్ ఒపరాండీ, మోసాల చరిత్ర తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.
నిందితుడు బింగ్సన్ జాన్ 1990 నుండి ఫైవ్ స్టార్ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతూ వచ్చాడు. 5 స్టార్ హోటళ్లలో జల్సాలు చేసి, బిల్లు కట్టకుండా ఉడాయించడం ఇతగాడి స్టైల్. చాలా పకడ్బందీగా పలు అబద్దాలు ఆడుతూ, పోష్‌గా ఇంగ్లీషులో చకా చకా మాట్లాడేస్తూ అందర్నీ బురిడీ కొట్టించే వాడు. హోటళ్లలో చెక్-ఇన్ అవ్వడానికి విదేశీ టూరిస్ట్ గైడ్, ఇంగ్లీష్ టీచర్ లేదా యోగా ట్రైనర్ అని అబద్ధాలు చెప్పేవాడు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల ఇతని మాటతీరు, ప్రవర్తన చూసి హోటల్ సిబ్బంది నమ్మి అడ్వాన్స్ కూడా అడిగేవారు కాదు అంటే అతని నటనా చాతుర్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అలా లగ్జరీ హోటళ్లలో కొన్ని రోజుల పాటు ఉండి, అక్కడి సౌకర్యాలన్నీ వాడుకుని, బిల్లు కట్టకుండానే మాయం కావడం ఇదీ అతని వైఖరి. కొన్నిసార్లు హోటల్ లోని విలువైన వస్తువులను కూడా దొంగిలించేవాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని హయత్ హోటల్‌లో అదేతరహాలో మోసంచేశాడు.కానీ పోలీసులకు చిక్కక తప్పలేదు. ఇక్కడ రెండు రోజులు స్టే చేసినందుకు గాను రూ. 63,755 బిల్లు కట్టాల్సి ఉంది. కానీ మనోడు ఎప్పటిలాగానే బిల్ కట్టకుండా దర్జాగా పారిపోయాడు. దాంతో పాటు రూ. 1.48 లక్షల విలువైన హోటల్ లాప్‌టాప్‌ను కూడా దొంగిలించాడు. దీనిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో రాయ్‌పూర్ సైబర్ క్రైమ్ , పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో ఒడిశాలోని భువనేశ్వర్‌లో 72 గంటల్లోనే అరెస్ట్ చేసి, లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: 256 గంటలు, 131 మంది శ్రమ : ఆమీర్-గౌరీ అరుదైన వెడ్డింగ్ రింగ్
శోభ్‌రాజే స్ఫూర్తే
పోలీసుల విచారణలో బింగ్సన్ జాన్ పలు విస్తుపోయే నిజాలు అంగీకరించాడు. 1980లలో ఢిల్లీలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేసినప్పుడు ఒక లగ్జరీ హోటల్ సిబ్బంది ఇతడిని అవమానించారట. దీనిపై పగ తీర్చుకోవడానికే లగ్జరీ హోటళ్లను టార్గెట్ చేయడం ప్రారంభించాడు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభ్‌రాజ్ (Charles Sobhraj) నేరాల శైలిని చూసి ప్రభావితుడయ్యాడట. అతని లాగే నకిలీ గుర్తింపులతో మోసాలు చేయడం నేర్చుకున్నాడు.
1996లో ఇతడు మొదటిసారి అరెస్ట్ అయి తీహార్ జైలుకు వెళ్లాడు. గతంలో కేరళ, తమిళనాడు, గోవా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి వివిధ రాష్ట్రాల జైళ్లలో దాదాపు 15 ఏళ్లు గడిపాడు. 2022లో కూడా కేరళలోని కొల్లాం రైల్వే స్టేషన్ సమీపంలో ఇలాంటి హోటల్ మోసం కేసులోనే అరెస్టయ్యాడు. ప్రస్తుతం రాయ్‌పూర్ పోలీసులు దేశవ్యాప్తంగా ఇతనిపై ఉన్న మిగతా కేసుల వివరాలను సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది


