విజయ్‌ మరో సంచలన నిర్ణయం.. కఠిన మార్గదర్శకాలు! | CM Vijay Government Takes Major Step On Corruption Cases, Introduces Time Limits For Probe Proceedings | Sakshi
Sakshi News home page

విజయ్‌ మరో సంచలన నిర్ణయం.. కఠిన మార్గదర్శకాలు!

Jul 5 2026 10:23 AM | Updated on Jul 5 2026 12:08 PM

CM Vijay Government Takes Major Step on Corruption Cases

సాక్షి, చైన్నె: అవినీతి అంతం దిశగా రాష్ట్రంలోని సీఎం విజయ్‌ ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. ప్రభుత్వ ఉద్యోగులపై నమోదయ్యే అవినీతి నిరోధక దర్యాప్తులు, శాఖాపరమైన విచారణలు సంవత్సరాల తరబడి సాగకుండా ఉండేందుకు కఠినమైన నిర్ణయానికి వచ్చారు. కాలపరిమితితో కూడిన సరికొత్త వివరణాత్మక మార్గదర్శకాలను తాజాగా జారీ చేసింది. 

అయితే, వివిధ శాఖలలో క్రమశిక్షణా చర్యల దర్యాప్తులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటంపై మద్రాస్‌ హైకోర్టు ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక ఉత్తర్వులను వెలువరించింది. అనవసరమైన జాప్యానికి కారణమయ్యే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన హైకోర్టు, అన్ని శాఖలలో పారదర్శకతను పెంచేలా మార్గదర్శకాలు ఉండాలని కోరింది.

కాలపరిమితి నిర్దేశం, కొత్త నిబంధనలు

ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు, పింఛను (పెన్షన్‌) ప్రయోజనాలు ఈ పెండింగ్‌ కేసుల వల్ల నిలిచిపోకుండా చూసేందుకు ప్రత్యేక మార్గదర్శాలు, గడువులను విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

● అవినీతి నిరోధక శాఖలో నమోదైన కేసులలో, కేసు నమోదైన తేదీ నుండి 3 నెలలలోపు తుది నివేదిక ముసాయిదాను తప్పనిసరిగా సిద్ధం చేయాలి.

● ప్రభుత్వ ఉద్యోగులపై నేరపూరిత దుష్ప్రవర్తన ఆరోపణలకు సంబంధించిన క్రమశిక్షణా చర్యల ప్రక్రియను గరిష్టంగా 9 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

● ఆరోపణలకు సంబంధించిన విచారణల్లో అవసరమైన పత్రాలు, సాక్ష్యాధారాలను 4 నెలల్లోగా సంబంధిత విభాగానికి అందజేయాలి.

● అవినీతి కేసులలో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన తర్వాత, దర్యాప్తు అధికారి 6 నెలల్లోగా దర్యాప్తును పూర్తి చేయాలి. అనంతరం 2 వారాల వ్యవధిలో తుది నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

● విచారణ నోటీసు అందిన 20 రోజుల్లోగా ప్రభుత్వం దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఉద్యోగ సంఘాల ఆహ్వానం..
తాజాగా ఉత్తర్వులను ఉద్యోగ సంఘాలు ఆహ్వానించాయి. నిజాయితీపరులైన అధికారులు కూడా ఈ నిరంతర క్రమశిక్షణా చర్యల జాప్యం వలన ఇబ్బందులు పడుతున్నారని తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహకులు పేర్కొన్నారు. టీవీకే విజయ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కాలపరిమితి విధానాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే దర్యాప్తు అధికారులు నిర్దేశించిన ఈ గడువులను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పాటించేలా చూడాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement