‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Nagabandham Movie Review And Rating In Telugu, A Visually Rich Mythological Adventure | Sakshi
Sakshi News home page

Nagabandham Review: ‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Jul 3 2026 3:50 AM | Updated on Jul 3 2026 9:09 AM

Nagabandham Movie Review And Rating In Telugu

టైటిల్‌ : నాగబంధం:ది సీక్రెట్ ట్రెజర్
నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సాహ్నీ తదితరులు
దర్శకుడు: అభిషేక్‌ నామా
నిర్మాణ సంస్థలు:ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్
నిర్మాతలు: కిషోర్‌ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి
సినిమాటోగ్రఫీ: సుందర్ రాజన్ ఎస్
సంగీతం: జునైద్ కుమార్- అబే
విడుదల తేదీ:  జులై 03, 2026

సీనీ ప్రేక్షకులు మైండ్‌సెట్‌ మారిపోయింది. ఒకప్పుడు స్టార్‌ హీరోలు ఉంటేనే సినిమా చూసేవాళ్లు. కానీ ఇపుడు కథలో దమ్ముంటే చాలు స్టార్స్‌ని పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్య కంటెంట్‌ని నమ్ముకొని సినిమాలో తీస్తున్నారు. అలా తెరకెక్కించిన చిత్రమే ‘నాగబంధం’. కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న హీరో(విరాట్‌ కర్ణ)ని పెట్టుకొని రూ. 100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అభిషేక్‌ నామా. టీజర్‌, ట్రైలర్‌ కూడా అంచనాలను పెంచేశాయి. మరి సినిమా కూడా ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఉందా? దర్శకుడిగా అభిషేక్‌ నామా హిట్‌  కొట్టాడా లేదా రివ్యూలో చూద్దాం. (Nagabandham Movie Telugu Review)

​‍కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1756-1962 నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ సాగుతుంది. ఇండియన్‌ ప్రముఖ ఆర్కియాలజిస్ట్‌ ప్రభాకర్‌(జగపతి బాబు) తన 30 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రహస్యాలను ఛేదించినా.. నాగబంధం రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోతాడు. దీనిపై తన శిష్యులు టెస్లా, అలీ(రిషబ్‌ సాహ్నీ) పరిశోధన చేస్తూ హిమాలయాలకు వెళ్తారు . అక్కడ ఎన్నో ఏళ్లుగా బంధించబడి ఉన్న బైరాగి(గరుడ రామ్‌) తన మంత్ర శక్తితో అలీ గతాన్ని గుర్తు చేసి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ప్రపంచాన్ని జయించాలంటే నాగ బంధాన్ని విడిపించాలని అందుకోసం బ్రహ్మ కమలం తీసుకురావాలని ఆలీని ఆదేశిస్తాడు. అలీ తన అనుచరులతో బ్రహ్మకమలం వెతుకుతూ.. అడ్డుకున్న వాళ్లను, దానికి సంబంధించిన వివరాలు తెలిసి చెప్పని వాళ్లను క్రూరంగా చంపుతుంటాడు. 

చివరకు ఆ బ్రహ్మకమలం శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉన్న స్వామివారి నాభిలో ఉండే పద్మంలో ఉందని తెలిసి.. ఓ ప్లాన్‌ ప్రకారం ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. ఓ కారణంగా అది భైరవకోన సమీపంలోని సముద్రంలో పడిపోతుంది. దాన్ని తీసుకొచ్చింది అలీ మనుషులు తులసీవనం గ్రామానికి వెళ్తారు. అక్కడ డబ్బు ఆశ చూపి రుద్ర(విరాట్‌ కర్ణ) సహాయంతో పడవలో భైరవకోనకు బయలుదేరుతారు. మరి ఆ స్వర్ణ కమలం అలీ మనుషులకు దొరికిందా లేదా? రుద్ర వాళ్లకు సహాయం చేశాడా లేదా? ఆ బ్రహ్మకమలానికి రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? అతను ప్రాణంగా ప్రేమించే చెల్లి మాసస(సోనియా సింగ్‌) చావుకు కారణం ఎవరు? పార్వతి(నభా నటేష్‌) ఎవరు? రుద్రతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? 1956లో ఏం జరిగింది? ముస్లిం రాజుతో కలిసి భైరాగి పన్నిన కుట్ర ఏంటి? అసలు నాగబంధం నేపథ్యం ఏంటి?చివరకు బైరాగి నాగబంధాన్ని విడిపించాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Nagabandham Movie Story)

ఎలా ఉందంటే..
సినిమాకు కథ అనేది గుండెకాయ అయితే, స్క్రీన్ ప్లే ఆ గుండె నుంచి వచ్చే లయబద్ధమైన శబ్దం. ఈ రెండూ సరిగ్గా కుదిరినప్పుడే వెండితెరపై మాయాజాలం సాధ్యమవుతుంది. అలా కాకుండా కేవలం కంటికి ఇంపుగా ఉండే విజువల్స్ చూపించినా, వందల కోట్ల బడ్జెట్‌తో భారీ వీఎఫ్‌ఎక్స్‌ హంగులు అద్దినా... ప్రేక్షకుడికి అసలైన 'ఎమోషన్' కనెక్ట్ అవ్వనప్పుడు ఆ హంగామా అంతా వృథా ప్రయాసగానే మిగిలిపోతుంది. ‘నాగబంధం’  విషయంలో అదే జరిగింది. విజువల్స్‌ బాగున్నాయి. యాక్షన్‌ సీక్వెన్స్‌ అదిరిపోయాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ కూడా ఇప్పుడు ట్రెండింగ్‌దే.  కానీ కథనం మాత్రం ఆకట్టుకునేలా సాగలేదు. అసలు కథను వదిలేసి అక్కర్లేని ట్రాక్‌లను పెట్టి.. కథను సాగదీశారు. 

ఈ సినిమాలో కొన్ని పాత్రలు ఎందుకు పెట్టారో తెలియదు. ఆ పాత్రలను చంపాల్సిన అవసరం ఏంటో కూడా తెలియదు. పోనీ ఆయా పాత్రలు అసలు కథతో ఏదైనా సంబంధం ఉందా అదీ లేదు. అదో సపరేట్‌ట్రాక్‌. ఇక  హీరోయిన్‌తో హీరో ప్రేమలో పడిన సీన్‌ అయితే మరీ విచిత్రంగా ఉంటుంది. క్షణాల్లో ప్రేమ పుడుతుంది. తొలిసారే కలిసినా..అప్పుడే రొమాన్స్‌..పాట వరకు వెళ్తుంది. దానికి గల కారణం ఏంటో సెకండాఫ్‌లో చూపించినప్పటికీ అంత కన్విన్సింగ్‌గా అనిపించదు.  

హీరో కూడా ప్రతిసారి తనకు సంబధించిన వాళ్లు చనిపోయినా తర్వాతనే ఫైట్‌ చేస్తాడు. ఇదే రిపీట్‌ అవ్వడంతో... అదేదో ముందే చేసి తనవాళ్లను రక్షించొచ్చు కదా? అనే ప్రశ్న మన మైండ్‌లోకి వస్తుంది. ఇక ఇప్పుడు  ట్రెండింగ్‌లో ఉన్న సనాతన ధర్మం, హిందుత్వం టాపిక్‌పై మంచి మంచి డైలాగ్స్‌ పెట్టారు. కానీ తెరపై చూస్తుంటే అవి ఇరికించినట్లుగానే అనిపిస్తుంది తప్ప.. కథలో భాగంగా వచ్చాయాలనే ఫిలింగ్‌ కలుగదు.  అలాగే ఈ చూస్తున్నంత సేపు అప్పట్లో వచ్చిన చిరంజీవి ‘అంజి’తో పాటు ఈ మధ్య వచ్చిన ‘కార్తికేయ ’, హనుమాన్‌, మిరాయ్‌ లాంటి చిత్రాలు గుర్తుకొస్తాయి. 

నాగబంధం నేపథ్యాన్ని తెలియజేస్తూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. నాగబంధానికి సంబంధించిన పుస్తకం, ఆ రహస్యాన్ని ప్రధానికి చేరవేసేదుందకు టెస్లా ప్రయత్నించడం.. వెంటనే అలీ వచ్చి అతన్ని చంపేయడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. హీరో ఎంట్రీ తర్వాత కథ ఫ్యామిలీ ఎమోషన్‌ చుట్టూ తిరుగుతుంది.

 విలన్‌ మనుషులతో కలిసి పద్మకమలం కోసం హీరో సముద్రంలోకి వెళ్లినప్పటి నుంచి కథ ఆసక్తి పెరుగుతంది. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా లేకపోయినా..విజువల్స్‌, పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథనం నెమ్మదిగా సాగిందనే ఫీలింగ్‌ కలుగుతుంది. హారో ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ(1756) ఆకట్టుకుంటుంది. నాగబంధం రక్షణకు హీరో పాత్రకు గల సంబధం తెలియజేసే సీన్లు బాగుంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు హీరో చేసే యాక్షన్‌ సీన్లు అదిరిపోతాయి. ముఖ్యంగా చివర్లో పాములతో వచ్చే సీన్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి.  పార్ట్‌ 2 ఉన్నట్లుగా ప్రకటిస్తూ కథను ముగించారు. (Nagabandham Movie Positives, Negatives)

ఎవరెలా చేశారంటే.. 
రెండో సినిమానే అయినా విరాట్‌ కర్ణ నటనపరంగా అదరగొట్టేశాడు. రుద్రగా, సాధువుగా రెండు విభిన్నమైన పాత్రలను పోషించి.. వేరియేషన్‌ చూపించాడు. ఇక నభా నటేష్‌కి మంచి పాత్ర లభించింది. ఇందులో డ్యూయెల్‌ రోల్‌  ద్విపాత్రాభినయం చేసి తనదైన నటనతో మెప్పించింది. విలన్‌గా రిషబ్‌ చాలా బాగా నటించాడు. ఒకరకమైన మేనరిజంతో నడుస్తూ..నవ్వుతూనే కొన్ని చోట్ల భయం పుట్టించాడు. ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్‌గా జగపతిబాబు  మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. 
బైరాగీగా గరుడ రామ్‌ అదరగొట్టాడు. హీరో మరదలుగా ఐశ్వర్య మీనన్‌ తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా ఉన్నంత బాగానే నటించింది. అనసూయ, మురళీ శర్మ వంటి వారు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతికంగా సినిమా బాగుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు అద్భుతంగా ఉంది. ఆనంత పద్మనాభ స్వామి టెంపుల్‌ సెట్‌తో పాటు ప్రతీ సెట్‌ చాలా వాస్తవికంగా..గుర్తుపట్టేలేనంతగా ఉంది. అంతే అందంగా సినిమాటోగ్రాఫర్‌ తెరపై చూపించాడు. నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. ‘నమో..నమో’సాంగ్‌ తెరపై చూస్తే..మరింత ఆకట్టుకుంటుంది. వీఎఫెక్స్‌ పర్వాలేదు. ఏఐని కూడా బాగానే వాడారు. ఎడిటింగ్‌ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఏ మాత్రం వెనకడాలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. 
 -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌  

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement