టాలీవుడ్‌లో పలువురు హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బంతా భూములు, ఇతర స్థిరాస్తులపై పెట్టుబడిగా పెడుతుంటారు. ఈ జాబితాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆయన శంకర్‌పల్లి సమీపంలో 26 ఎకరాల తోటను కేవలం రూ.12 లక్షలకు కొనుగోలు చేసినట్లు నటుడు అజయ్ ఘోష్ తెలిపారు. ప్రస్తుతం ఆ భూమి విలువ వందల కోట్లకు చేరిందని ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది.
రవితేజ, అజయ్ ఘోష్ కలిసి నటించిన ‘మాస్ జాతర’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కోసం శంకర్‌పల్లి సమీపంలోని 26 ఎకరాల తోటలో రైల్వే స్టేషన్, ఇల్లు తదితర సెట్లు ఏర్పాటు చేసినట్లు అజయ్ ఘోష్ వెల్లడించారు. ఆ తోట రవితేజకు చెందినదేనని చెప్పారు.
(చదవండి: నిజంలో బతకడం రవితేజకే చెల్లింది.. అజయ్ ఘోష్)
‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. “నేను, రవితేజ కలిసి ‘మాస్ జాతర’ సినిమా చేశాం. ఆ సినిమాకు రైల్వే స్టేషన్ సెట్, ఇల్లు సెట్‌ను ఒక తోటలో వేశారు. శంకర్‌పల్లి దగ్గర ఉన్న 26 ఎకరాల తోట అది. ఆ తోట రవితేజ గారిదే. ఎప్పుడో దాన్ని రూ.12 లక్షలకు కొన్నారు. ఇప్పుడు దాని విలువ వందల కోట్లు ఉంది” అని తెలిపారు.
అదే సమయంలో సెట్‌లో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను కూడా అజయ్ ఘోష్ గుర్తుచేసుకున్నారు. ఆ తోట విలువ గురించి తెలుసుకున్న ఓ వ్యక్తి ఆశ్చర్యపోయి.. ‘ఈ తోట అన్ని కోట్ల విలువ చేస్తుందని అంట కదా?” అని రవితేజను అడిగారట. అందుకు రవితేజ స్పందిస్తూ.. ‘ఇవన్నీ ఇక్కడే ఉంటాయి.. మనం పోతాం. ఇవన్నీ ఉన్నాయని సంతోషించాలి. కానీ మనం పని చేసుకోవాలి’ అని చెప్పినట్లు అజయ్ ఘోష్ వెల్లడించారు. రవితేజ ఆస్తులపై అజయ్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.


