మన జీవితంలో మార్పు రావాలని కోరుకుంటాం. పరిస్థితులు మారాలని కోరుకుంటాం. ఇతరులు మారాలని కోరుకుంటాం. కానీ మనం మారడానికి సిద్ధంగా ఉన్నామా? ఇదే ఆధ్యాత్మిక ప్రయాణంలోని కీలకమైన ప్రశ్న. మనలోని చీకటిని మనమే గుర్తించాలి. మనలోని వెలుగును కూడా మనమే అనుభవించాలి. మన బలహీనతలను అంగీకరించి వాటిని అధిగమించాలి. మనలోని మంచితనాన్ని పెంపొందించాలి.
‘‘నేను ఎలా ఉన్నాను?’’ అనే ప్రశ్నతో ప్రారంభమైన ఆత్మపరిశీలన, ‘‘నేను ఎలా ఉండాలి?’’ అనే ఆలోచనకు దారితీస్తుంది. చివరికి ‘‘ఆ మార్పు కోసం నేను ఏం చేస్తున్నాను?’’ అనే ప్రశ్నకు సమాధానం వెతికే స్థితికి తీసుకెళ్తుంది. అదే నిజమైన అంతరంగ పరివర్తనకు ఆరంభం.
ప్రపంచాన్ని మార్చాలనే ఆలోచన గొప్పదే. సమాజం కోసం పనిచేయాలనే సంకల్పం కూడా గొప్పదే. కానీ ఆ మార్పుకు బలమైన పునాది మనలోని మార్పే. మనస్సులో ప్రశాంతత, ఆలోచనల్లో స్వచ్ఛత, ప్రవర్తనలో సహజత్వం, హృదయంలో ప్రేమ– ఇవే మనిషి నిజమైన ఉన్నతికి సూచికలు.
అందుకే ప్రతిరోజూ మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం:
‘‘నేను ఎలా ఉన్నాను?
నేను నిజంగా ఎదుగుతున్నానా?
నా ఉన్నతి కోసం నేను ఏం చేస్తున్నాను?’’
ఈ మూడు ప్రశ్నలకు మనసాక్షితో ఇచ్చే సమాధానమే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి దిశానిర్దేశం చేయగలదు.
కుటుంబం నుంచి సమాజం వరకు
కుటుంబంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, సమాజంలో ఉన్నా మనలోని ప్రశాంతతను కా΄ాడుకోవడం ఒక సాధన. ఇతరులతో వ్యవహరించే సమయంలో ప్రేమ, గౌరవం, సహనం చూపడం ఒక సాధన. సమస్యలు ఎదురైనప్పుడు ఆవేశానికి లోనుకాకుండా వివేకంతో స్పందించడం కూడా ఒక సాధన.
ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోవడం కాదు.
మనం ఉన్న చోటే మనల్ని మనం మార్చుకోవడం. మనిషి తనను తాను మార్చుకున్నప్పుడు ఆ మార్పు అతని కుటుంబంలో కనిపిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత పెరిగితే అది సమాజంలోకి విస్తరిస్తుంది. ఒక వ్యక్తి తన కోపాన్ని నియంత్రించుకోవడం చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ అలాంటి మార్పులు వేలాది మందిలో వచ్చినప్పుడు సమాజంలో సంస్కారం, సహనం, పరస్పర గౌరవం పెరుగుతాయి.
అందుకే దేశం గురించి, సమాజం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించే ముందు ‘‘నా వంతుగా నేను ఏం చేస్తున్నాను?’’ అనే ప్రశ్న వేసుకోవాలి. దేశం మారాలంటే ప్రజలు మారాలి. ప్రజలు మారాలంటే వ్యక్తులు మారాలి. వ్యక్తిలో మార్పు రావాలంటే ముందుగా అతను తన అంతరంగాన్ని పరిశీలించాలి.
– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులు(మాతాజీ నిర్మలాదేవి ఆధ్యాత్మిక స్ఫూర్తితో)
ఇదీ చదవండి: అత్యంత విలక్షణమైన గణేశ్ ఆలయం..! ఆ రూపంలోనే పూజలందుకుంటాడు..)


