ఒక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. దైవభక్తి అతడికి మెండుగా ఉండేది. రోజూ దేవాలయానికి వెళ్లి దీపం వెలిగించేవాడు. ఆ పట్టణంలో అతడిని తెలిసినవారందరూ ‘దైవానుగ్రహం’ పొందిన అదృష్టవంతుడిగా గౌరవించేవారు. అతడు కూడా అంతా ‘దేవుడి దయ’వలననే సమకూరిందని నమ్మే వాడు.
అయితే, రోజులు గడిచే కొలది అతడిలో అహంభావం పెరిగింది. ‘నేను ఎంత గొప్ప భక్తుడిని! దేవుడే నాకు ప్రత్యేకంగా అన్ని సుఖాలు ఇస్తున్నాడు కదా!’ అని భావించి, తన కర్మలను నిర్లక్ష్యం చేశాడు. ఒక రోజు దేవాలయంలో దీపం వెలిaగించడానికి వెళ్లినప్పుడు, పూజారి అతడిని చూసి ‘దీపం వెలిగించడమే కాదు, వెలిగించే తైలంకూడా శుద్ధంగా ఉండాలి. శుద్ధమైనది కాకపోతే దీపం సరిగా వెలగదు. ఇది నా మాట కాదు. ఆంధ్ర మహాభారతం, అనుశాసనిక పర్వంలో తిక్కన మహాకవి చెప్పిన మాట!’ అని ఈ పద్యాన్ని చదివాడు.
కం. నేయి పొలు పఱిన దీవియ
త్వాయత్తంబై తానును
మాయును దైవానుకూల్య మహిమ మహీశా!
పూజారి మాటలను పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ కొద్ది నెలల్లోనే అతడి జీవితం మారిపోయింది. వ్యాపారం నష్టాల్లోకి వెళ్లింది. కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఆరోగ్యం క్షీణించింది. ‘ఇంత భక్తి ఉన్న నన్ను ఎందుకు ఇలా చూస్తున్నావు?’ అని దేవుడిని నిందించాడు.
ఒక రాత్రి దేవాలయంలో ఒంటరిగా కూర్చొన్నప్పుడు, పూజారి మళ్లీ వచ్చి ‘దీపం ఆరిపోవడానికి కారణం దేవుడు కాదు. తైలం తగ్గిపోవడమే. మనిషి చేసే మంచిపనులు తగ్గిపోతే దైవానుకూలత కూడా తగ్గిపోతుంది. దేవుడు దయను ఆపడు. మనమే దానికి అర్హత కోల్పోతాం!’ అన్నాడు. పూజారి మాటలు అతడిలో ఆత్మ విమర్శకు దారి తీశాయి. కొద్ది కాలంలోనే అతడి జీవితం మళ్లీ వెలుగుతో నిండింది.
– భట్టు వెంకటరావు
ఇదీ చదవండి: పరిమిత కోరికల నుండి పరమ శాంతి వైపు


