ఈ వారం కథ: చీమ బ్రతుకేనా? | Funday Weekly Story On Corporate Life Work Life Balance Real Life Lesson | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: చీమ బ్రతుకేనా?

Sep 27 2026 10:27 AM | Updated on Sep 27 2026 10:27 AM

Funday Weekly Story On Corporate Life Work Life Balance Real Life Lesson

ఫండే

ఈ వారం కథ

ఉదయం ఎనిమిది గంటలైంది.
హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌ నుంచి బయటికి వచ్చి రోడ్డు దాటుతున్నాను. ఎదురుగా గాజు గోడలతో మెరిసిపోతున్న నా కంపెనీ భవనం కనిపించింది. ఆ భవనం వైపు వందలమంది ఒకే దిశగా నడుస్తున్నారు. వాళ్ళందర్నీ చూస్తుంటే నాకు ఒక్కసారిగా చీమలు గుర్తొచ్చాయి.

వాన పడే ముందు చీమలు వరుసగా ఆహారం మోసుకుంటూ వెళ్ళినట్టు... వీళ్ళు కూడా ల్యాప్‌టాప్‌ బ్యాగులు భుజాన వేసుకుని, ఐడీ కార్డులు మెడలో వేలాడదీసుకుని, ఒకే వేగంతో లోపలికి వెళ్ళి పోతున్నారు.
ఎవరి ముఖంలోనూ చిరునవ్వు లేదు;
ఎవరి కళ్ళల్లోనూ ఉత్సాహం లేదు;
అయినా అడుగులు మాత్రం ఆగడం లేదు.

ఆ దృశ్యం చూసిన ప్రతిసారీ నా మనసులో ఒకే ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది.
‘మనం ఉద్యోగం చేస్తున్నామా? లేక ఎవరో కనిపించని శక్తి మనల్ని నడిపిస్తే నడుస్తున్నామా?‘
ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే  గడిచిపోయింది నా పదిహేనేళ్ళ కార్పొరేట్‌ జీవితం.
నేను కూడా ఒకప్పుడు ఇదే భవనం ముందు నిలబడి ఫొటోలు దిగాను.
మొదటి ఉద్యోగం.
మొదటి జీతం.
మొదటి ఐడీ కార్డు.
ఆ రోజు నా నాన్న కళ్ళల్లో కనిపించిన గర్వం... 
నా అమ్మ చేతులతో తినిపించిన మొదటి జీతం భోజనం...
ఇప్పటికీ మరచిపోలేను.
అప్పుడు నాకు అనిపించింది.

‘ఇక నా జీవితం సెటిల్‌ అయిపోయింది.‘
కానీ జీవితం అప్పుడే మొదలైందని తెలియలేదు.
మొదటి ఆరు నెలలు కలలా గడిచిపోయాయి.
ఏసీ ఆఫీస్‌.
ఫ్రీ కాఫీ.
శుక్రవారం పార్టీలు.
టీమ్‌ ఔటింగ్స్‌.
అన్నీ కొత్తగా, అందంగా అనిపించాయి.
ఏడో నెలలో మొదటి అప్రైజల్‌ వచ్చింది.
‘నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ కమిట్‌మెంట్‌ చూపాలి.’ అని మేనేజర్‌ నవ్వుతూ చెప్పాడు.
ఆ మాట నాకు ప్రశంసగా వినిపించింది. అదే రోజు నుంచి నేను ఇంటికి ఆలస్యంగా వెళ్ళడం మొదలుపెట్టాను.
ఆదివారాలు కూడా ల్యాప్‌టాప్‌ తెరవడం మొదలుపెట్టాను.
సెలవు అంటే నేరం చేసినట్టు అనిపించేది.

నాకు తెలియకుండానే...
నేను కూడా ఒక చీమగా మారిపోతున్నాను.
ఒకరోజు క్యాంటీన్‌లో కిటికీ పక్కన కూర్చుని తింటున్నాను.
కిటికీ అద్దం కింద చిన్న చీమల బారు కనిపించింది.
ఒక్క చీమ బిస్కట్‌ ముక్కను మోస్తోంది.
దాని వెనుక ఇంకో చీమ.
దాని వెనుక ఇంకోటి.
ఒక్కటీ దారి మార్చడం లేదు.
అప్పుడే నా సహోద్యోగి రాహుల్‌ వచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు.
‘ఏం చూస్తున్నావు?’
‘చీమలు.’
అతను కిందికి చూసి నవ్వి,
‘వాటిని ఎందుకు చూడడం?’ అన్నాడు. 
నేను నవ్వలేదు.
‘వాటిలో మనల్ని చూస్తున్నాను.’
అతనికి అర్థం కాలేదు.
నాకు మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది.

మనం కూడా అలాగే ఉన్నాం.
ఉదయం కార్డు స్వైప్‌.
మీటింగ్,
టాస్క్,
డెడ్‌లైన్,
అప్రైజల్,
ప్రమోషన్,
ఇంకో డెడ్‌లైన్,
ఇంకో అప్రైజల్‌.
ఇంకో సంవత్సరం...
చీమల బారుకీ...
మన జీవితానికీ...
తేడా కనిపించలేదు.
∙∙ 
ఆ రోజు నుంచి నేను మనుషుల్ని కాదు... వాళ్ళ మనస్తత్త్వాన్ని గమనించడం మొదలుపెట్టాను.
లిఫ్ట్‌ ముందు నిలబడ్డ వాళ్ళందరి చూపు మొబైల్‌లోనే ఉంటుంది.
లిఫ్ట్‌ తలుపు తెరుచుకోగానే, గూటిలోకి వెళ్ళే చీమల్లా అందరూ ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్తారు.
ఎవ్వరూ ఎవ్వరినీ చూడరు.
‘గుడ్‌ మార్నింగ్‌‘ అనేది కూడా ఒక అలవాటే గానీ, పలకరింపు కాదు.
ఆఫీస్‌ ఫ్లోర్‌లో అడుగు పెట్టగానే మరో ప్రపంచం మొదలవుతుంది.
కీబోర్డుల శబ్దం.
మీటింగ్‌ రూముల గాజు తలుపులు.
చెవిలో హెడ్‌సెట్‌.
ముఖంలో ఒత్తిడి.
అంతా బతికే ఉన్నారు. 
కానీ జీవిస్తున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ.

మా టీమ్‌లో సతీష్‌ అనే అబ్బాయి ఉండేవాడు.
అతడు నాకు బాగా నచ్చేవాడు. కారణం,  అతడు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు.
ఒకరోజు రాత్రి పదకొండు గంటల వరకు ఇద్దరమే ఆఫీస్‌లో ఉన్నాం.
అకస్మాత్తుగా అతడు, 
‘సార్‌... చీమలు ఎందుకు పని చేస్తాయో తెలుసా?’ అని అడిగాడు. 
నేను నవ్వుతూ, ‘ఆహారం కోసం’ అన్నాను.
‘కాదు సార్‌... వాటికి మరో మార్గం తెలియదు.’
ఆ మాట నా గుండెల్లో దిగిపోయింది.
అతడే మళ్ళీ అన్నాడు, 
‘మన పరిస్థితీ అదే కాదా? ఉద్యోగం లేకపోతే జీవితం లేదని మనమే నమ్మేశాము.’
అతని మాటల్లో తిరుగుబాటు లేదు.
నిజం మాత్రమే ఉంది.
మూడురోజుల తర్వాత సతీష్‌ ఆఫీస్‌కు రాలేదు.
హార్ట్‌ ఎటాక్‌.
ముప్పై నాలుగేళ్ళ వయసు.

ఆ వార్త విన్నప్పుడు మొత్తం ఫ్లోర్‌ అంతా నిశ్శబ్దమైంది, ఐదు నిమిషాలు.
అవును. అంతే! కేవలం ఐదు నిమిషాలు మాత్రమే.
ఆ తర్వాత మళ్ళీ మీటింగులు మొదలయ్యాయి.
మెయిళ్ళు మొదలయ్యాయి.
డెడ్‌లైన్లు మొదలయ్యాయి.
అతని సిస్టమ్‌ దగ్గర ఇంకొకరు కూర్చున్నారు.
అతని ఐడీ డీయాక్టివేట్‌ అయిపోయింది.
అతని పేరు ప్రాజెక్ట్‌ నుంచి తొలగించబడింది.
అంతే! 
చీమల బారులో ఒక చీమ తగ్గితే, మరో చీమ ఆ ఖాళీని నింపినట్టే.
ఆ రోజు నాకు అర్థమైంది.

కార్పొరేట్‌ ప్రపంచంలో మనిషి విలువ, అతడు ఉన్నంత వరకే. అతడు కంపెనీకి కంట్రిబ్యూట్‌ చేస్తున్నంత వరకే. 
ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక నా కొడుకు నన్ను చూసి పరుగెత్తుకుంటూ వచ్చి, 
‘నాన్నా! క్రికెట్‌ ఆడదాం.’ 
‘రేపు ఆడదాం రా!’ అన్నాను. 
‘రేపు కూడా ఇదే అంటావు.’
అంతే! వాడు అలిగి లోపలికి వెళ్ళిపోయాడు. వాడన్న ఆ చిన్న మాటతో నా గుండెల్లో పెద్ద గాయమైంది.
నేను ఎవరి కోసం పరుగెడుతున్నాను?
వాడి కోసమే కదా!
అయితే వాడికే సమయం ఇవ్వలేకపోతే ఈ పరుగు అర్థమేంటి? అన్న ఆలోచనలతో, 
ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు.
బాల్కనీలో నిలబడి కిందకు చూస్తుంటే, వీధి దీపం కింద మళ్ళీ చీమల బారు కనిపించింది.
ఒక చీమ దారి తప్పింది.

మిగతావి ముందుకు వెళ్ళిపోయాయి. అది కాసేపు అటూ ఇటూ తిరిగి, మళ్ళీ తన దారిని వెతుక్కుంది.
అప్పుడు నాకు అనిపించింది. చీమకు ఆలోచించే స్వేచ్ఛ లేదు. కానీ, మనిషికి ఉంది. అయినా, మనమే దాన్ని వాడుకోవడం మానేశాం. 
మరుసటి రోజు ఆఫీస్‌కు వెళ్ళాను. రాజీనామా లెటర్‌ ఇవ్వడానికి కాదు.
నా రాజీ మనస్తత్త్వానికి రాజీనామా చెప్పడానికి.
ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకే ల్యాప్‌టాప్‌ మూసేశాను.
మేనేజర్‌ ఆశ్చర్యంగా చూసి, 
‘ఏమైనా అర్జెంట్‌ పని ఉందా?’ అని అడిగాడు. 
‘అవును.’
‘ఏమిటది?’
‘నా కుటుంబం.’
అతడు ఏమీ మాట్లాడలేదు.
నేను వెనక్కి తిరిగి చూడకుండా, ముందుకే నడిచాను.
ఆ నడకలో ఓటమి లేదు.
విముక్తి ఉంది.

ఈ రోజుకి కూడా నేను అదే కంపెనీలో పనిచేస్తున్నాను.
అదే కుర్చీ.
అదే ల్యాప్‌టాప్‌.
అదే మీటింగులు.
కానీ, అదే మనిషిని కాదు. ఇప్పుడు పని నా జీవితంలో ఒక భాగం మాత్రమే. జీవితం కాదు.
ప్రమోషన్‌ వస్తే సంతోషిస్తాను.
రాకపోయినా ప్రశాంతంగా నిద్రపోతాను.
డబ్బు సంపాదిస్తాను.
కానీ నా అమూల్యమైన సమయాన్ని కోల్పోను.
ఎందుకంటే, పిల్లల బాల్యం మళ్ళీ రాదు.
తల్లిదండ్రుల వృద్ధాప్యం మళ్ళీ రాదు.
మన ఆరోగ్యం మళ్ళీ రాదు.

కానీ ఉద్యోగాలు మళ్ళీ వస్తాయి. ఇప్పటికీ ప్రతి ఉదయం ఆ గాజు భవనం ముందు నిలబడి, లోపలికి వెళ్తున్న జనాన్ని చూస్తుంటాను.
వాళ్ళు నాకు ఇంకా చీమల్లాగే కనిపిస్తారు.
కానీ ఇప్పుడు వాళ్ళను చూసి జాలి చెందను.
ఎందుకంటే, 
చీమగా మారడం వాళ్ళ తప్పు కాదు.
తాము చీమల్లా బతుకుతున్నామని గుర్తించకపోవడమే అసలు విషాదం.
జీవితం అంటే కేవలం జీతం కాదు. జీవితం అంటే కేవలం ప్రమోషన్‌ కాదు. జీవితం అంటే కేవలం ఈఎంఐలు కాదు.
మనల్ని ప్రేమించే వాళ్ళతో నవ్వుతూ గడిపిన క్షణాలు. మన కోసం మనం తీసుకున్న చిన్న విరామాలు. 
మనసుకు నచ్చిన పని.
రాత్రి ప్రశాంతంగా పడుకునే నిద్ర.
ఇవే నిజమైన సంపద.

ఆ రోజు నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.
చీమల క్రమశిక్షణను నేర్చుకోవాలి. కానీ చీమల గమ్యంలేని పరుగు కాదు.
ఎందుకంటే, చీమ పుడుతుంది, పని చేస్తుంది, చనిపోతుంది.
మనిషి మాత్రం ఎందుకు పుట్టానో తెలుసుకునే అవకాశం ఉన్న ఏకైక జీవి.
ఆ అవకాశాన్ని కూడా కేవలం జీతం కోసం మార్చేసుకుంటే, 
మనకు ‘ఆరు అంకెల జీతం’ ఉండొచ్చు.
కానీ, 
మూడక్షరాల ‘జీవితం’ మాత్రం ఉండదు.

- డాక్టర్‌ ప్రభాకర్‌ జైనీ

ఇదీ చదవండి: మా అమ్మానాన్నల విడాకుల కేస్‌ కోర్ట్‌లో నడుస్తోంది...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement