మారిన మందు.. ఐదుగురు చిన్నారులు ఐసీయూలో.. | Children given Diabetes Medicine Instead of Paracetamol | Sakshi
Sakshi News home page

మారిన మందు.. ఐదుగురు చిన్నారులు ఐసీయూలో..

Sep 27 2026 8:58 AM | Updated on Sep 27 2026 8:58 AM

Children given Diabetes Medicine Instead of Paracetamol

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో చిన్నారులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చోటుచేసుకుంది. టీకాలు వేసిన అనంతరం చిన్నారులకు ఇవ్వాల్సిన పారాసిటామాల్‌కు బదులుగా పొరపాటున డయాబెటిస్‌ మందు ఇచ్చారు. దీంతో ఐదుగురు చిన్నారుల ఆరోగ్యం క్షీణించడంతో వారిని పీఐసీయూలలో చేర్చి చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన పల్సానా తాలూకాలోని కణావ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పల్సానా-01 ఉపకేంద్రంలో సెప్టెంబర్‌ 23న జరిగింది.

‘మమతా దివస్‌’ సందర్భంగా మొత్తం ఏడుగురు చిన్నారులకు టీకాలు వేశారు. టీకాల అనంతరం జ్వరం వచ్చే అవకాశం ఉండటంతో ఐదుగురు చిన్నారులకు పారాసిటామాల్‌ కిడ్‌ టాబ్లెట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే సిబ్బంది పొరపాటున గ్లిమెపైరైడ్‌ 2 మిల్లీగ్రాముల మాత్రలు ఇచ్చారు. ఇది మధుమేహం చికిత్సలో ఉపయోగించే మందు. దీనిని తీసుకున్న అనంతరం ఐదుగురు చిన్నారుల ఆరోగ్యం విషమించింది. దీంతో సెప్టెంబర్‌ 24న వారిని ఐసీయూలకు తరలించారు. బాధిత చిన్నారుల్లో సుమారు మూడున్నర నెలల వయసు నుంచి ఏడాది వయసు వరకు ఉన్నవారు ఉన్నారని గుజరాత్‌ ఆరోగ్య మంత్రి ప్రఫుల్‌ పన్సేరియా తెలిపారు. ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించింది.

పిల్లలకు వేరే మందు ఇవ్వడానికి మహిళా ఆరోగ్య కార్యకర్త ఇందుబెన్‌ రతిలాల్‌ చౌధరి కారణమని అధికారులు గుర్తించారు. దీంతో సూరత్‌ జిల్లా ముఖ్య ఆరోగ్య అధికారి ఆమెను సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌ కాలంలో డాంగరాపాడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉమర్‌పాడా తాలూకాలో ఆమె ప్రధాన కార్యాలయంగా నిర్ణయించారు. అనుమతి లేకుండా ప్రైవేటు ఉద్యోగం లేదా వ్యాపారం చేయడం, ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లడం నిషేధించారు. ఘటనపై విచారణ పూర్తయిన తర్వాత తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. టీకా అనంతరం పిల్లలకు జ్వరం వచ్చే అవకాశం ఉన్నందున సాధారణంగా పారాసిటామాల్‌ ఇస్తారని మంత్రి తెలిపారు. అయితే ఈ ఘటనలో పొరపాటున డయాబెటిస్‌ మందు ఇవ్వడంతో పిల్లలను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఐదుగురు చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతోందని, వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. త్వరలోనే వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నారని తెలిపారు.

ఇదీ చదవండి: ఎల్‌పీయూలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. రెండువేల మంది విద్యర్థుల ఆందోళన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement