రెస్ట్‌ అంటే గంటల తరబడి కాదు.. ఈ చిన్న బ్రేక్‌ చాలు! | Micro Rest Benefits Work Stress Relief | Sakshi
Sakshi News home page

రెస్ట్‌ అంటే గంటల తరబడి కాదు.. ఈ చిన్న బ్రేక్‌ చాలు!

Sep 26 2026 8:10 AM | Updated on Sep 26 2026 8:10 AM

Micro Rest Benefits Work Stress Relief

లైఫ్‌స్టైల్‌

రోజంతా ఆఫీస్‌లో పని.. ఫోన్‌ .. కంప్యూటర్‌.. ఇంటి బాధ్యతలు.. ఇలా ఒక పని పూర్తికాకముందే మరో పని మొదలవుతుంది. రెస్ట్‌ అంటే కలగా మారుతున్న రోజులు ఇవి. అయితే పూర్తిగా నీరసపడిపోయేవరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదంటోంది కొత్త వెల్‌నెస్‌ విధానం ‘మైక్రో రెస్ట్‌’. అంటే.. కొన్ని సెకన్లు లేదా కొన్ని నిమిషాలు.. పనులన్నింటినీ పక్కనపెట్టి మనసుకు, శరీరానికి చిన్న విరామం ఇవ్వడం.

30 సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు పని నుంచి పూర్తిగా దూరంగా ఉండటమే మైక్రోరెస్ట్‌. కళ్లుమూసుకోవడం, నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, భుజాలను వదులుగా ఉంచడం, కిటికీలోంచి బయటకు చూడటం, కాసేపు నడవడం లేదా చిన్నపాటి స్ట్రెచింగ్‌ చేయడం వంటివన్నీ ఈ మైక్రోరెస్ట్‌లోకి వస్తాయి.

ఎప్పుడు అవసరం..
ఒకే పనిపై ఎక్కువ సమయం దృష్టి పెట్టినప్పుడు, అదే వాక్యాన్ని మళ్లీ మళ్లీ చదువుతున్నప్పుడు, చిరాకు పెరుగుతున్నప్పుడు, భుజాలు బిగుసుకున్నప్పుడు, కళ్లలో అలసట కనిపించినప్పుడు చిన్న విరామం తీసుకోవచ్చు. నిపుణుల సూచన ప్రకారం 30 సెకన్ల నుంచి ఐదు నిమిషాల వరకు, ప్రతి గంటకు ఒకసారి విరామం తీసుకోవచ్చు.

నిద్రకు ప్రత్యామ్నాయం కాదు..
అయితే మైక్రో రెస్ట్‌ నిద్రకు ప్రత్యామ్నాయం కాదు. రోజంతా పేరుకుపోయే అలసటను ముందుగానే తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నిరంతర అలసట, నిద్రలో సమస్యలు, నొప్పి లేదా తలతిరుగుడు ఉంటే మాత్రం ఎక్కువ విశ్రాంతి లేదా వైద్య సలహా అవసరం కావచ్చు.
పని మధ్యలో ఒక్కనిమిషం అలా ఆగండి. ఫోన్‌  పక్కన పెట్టేసి కళ్లకు విశ్రాంతి ఇవ్వండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. కాసేపు కదలండి. మళ్లీ పనిలోకి వెళ్లండి. చిన్న విరామమే అయినప్పటికీ అలసటను తగ్గించడంలో, ఉత్సాహాన్ని పెంచడంలో గొప్ప ప్రయోజనాలను చూపించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

మరో తెర చూడటం కాదు!
కంప్యూటర్‌ పనితో విసిగిపోయామని వెంటనే ఫోన్‌ పట్టేస్తుంటం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం అంటూ స్క్రోల్‌ చేస్తుంటాం. ఇది విశ్రాంతిలా అనిపించవచ్చు. కానీ అక్కడ కూడా మెదడు కొత్త సమాచారాన్ని నిరంతరం స్వీకరిస్తూనే ఉంటుంది. అందుకే మైక్రో రెస్ట్‌లో మరో తెరను చూడటం కాకుండా, మెదడుకు నిజమైన విరామం ఇవ్వాలి.

ఇదీ చదవండి: ఇంద్రవెల్లికి అందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement