విశ్వవ్యాప్తంగా విభిన్న మతాలు, జాతులు కలిసి జీవిస్తున్నాయి. ఒకరి విశ్వాసాలు మరొకరు గౌరవించుకుని కలసి జీవించడం అనాదిగా సాగుతున్న వాస్తవం. దీనినే భిన్నత్వంలో ఏకత్వం అంటాం. ఎక్కడయితే ఒక మతాన్ని, ఒక జాతిని వేరుపరచే విద్వేషాలు నూరిపోసి ఆటంకాలు కలిగిస్తే, అక్కడ అశాంతి, అలజడి జరిగి మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.
ఇది ప్రజాజీవన క్రమ వికాసానికి అవరోధం అవుతుంది. దీనివల్ల సమైకత్య, సహజీవన సహభావం కొరవడి నిత్యం అలజడి, అభద్రత, అశాంతి కలిగి దేశ అభివృద్ధి కుంటుపడుతుంది. పైగా భవిత అస్తవ్యస్తమై యువత నిరాశ నిçస్పృహలతో నిర్వీర్యమై అంతర్గత విప్లవం ప్రారంభమవుతుంది.
ఎక్కడయితే సర్వజాతులు, మతాలు, వర్గాలు కలిసిమెలిసి జీవిస్తాయో అక్కడ ఆనందం, శాంతి, సమాధానం పుష్పిస్తాయి. అందుకే పవిత్ర బైబిలు గ్రంథంలో కీర్తనలు 133లో ‘సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం’ అని దావీదు మహారాజు క్రీస్తుపూర్వం 1010లోనే వివరించాడు. ఇక్కడ సహోదరులు అంటే విశ్వవ్యాప్త సోదరులని భావన. అటువంటి చోట పరిమళ తైలపు సువాసనలు వెదజల్లుతాయి అని వివరిస్తాడు. అక్కడే ఆశీర్వాదం, శాశ్వత శాంతి జీవనం కలిగి సమాజం తేజోవంతంగా వెలుగుతుంది.
ఆ దేశం నిత్యం ప్రగతిపథంలో ఎదిగి ఇతరులకు మార్గదర్శకం అవుతుంది. సమాజం ఐక్యంగా జీవించినపుడే శాంతి సౌభాగ్యాలతోపాటు సమసమాజ నిర్మాణం పటిష్టమవుతుంది. అదే సర్వసత్తాక శాంతిమయ కాంతి జీవన జగతిగా భాసిస్తుంది.
– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి
ఇదీ చదవండి: కూతురే...దేశానికి గర్వకారణం!


