విడాకులు మంజూరైనా భరణం కోరవచ్చు | Divorced Woman Entitled To Maintenance Even Got Divorce says Allahabad HC | Sakshi
Sakshi News home page

Section 125 CrPC విడాకులు మంజూరైనా భరణం కోరవచ్చు

Sep 24 2026 3:27 PM | Updated on Sep 24 2026 3:49 PM

Divorced Woman Entitled To Maintenance Even Got Divorce says Allahabad HC

ఆమెకు మళ్లీ వివాహం జరిగి ఉండకూడదు 

తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉండాలి 

అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు  

లక్నో: భర్త వదిలివేసిన కారణంగా విడాకులు మంజూరైనప్పటికీ.. విడాకులు పొందిన మహిళ తన మాజీ భర్త నుంచి భరణం కోరవచ్చని అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే, ఆమెకు మళ్లీ వివాహం జరిగి ఉండకూడదని, ఆమె తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉండాలని, అలాగైతేనే మాజీ భర్త నుంచి భరణం పొందడానికి అర్హురాలు అవుతుందని స్పష్టంచేసింది. భరణం అభ్యర్థనను తిరస్కరిస్తూ సుల్తాన్‌పూర్‌ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును వ్యతిరేకిస్తూ సునీత అనే మహిళ దాఖలు చేసిన క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ను లక్నో బెంచ్‌కు చెందిన జస్టిస్‌ రామ్‌ మనోహర్‌ నారాయణ్‌ మిశ్రా అనుమతించారు. 

అదనపు కట్నం కోసం తన భర్త, అత్తమామలు తీవ్రంగా వేధించారని, రూ.లక్ష నగదు, ఒక మోటార్‌సైకిల్, ఒక కలర్‌ టీవీ ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారని ఆరోపిస్తూ సునీత 2009లో సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 కింద భరణం కోసం ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను ఆమె భర్త ఖండించాడు. ఆమె తనను వదిలి వెళ్లిపోయిందని, తనతో కలిసి జీవించడానికి ఇష్టపడటం లేదని పేర్కొన్నాడు. కోర్టులో విచారణ సమయంలో 2014 సెప్టెంబర్‌ 25న ఏకపక్షంగా విడాకుల డిక్రీని పొందాడు. అతడు ఆ తర్వాత పునర్వివాహం చేసుకున్నాడని, అతని సర్విస్‌ రికార్డుల్లో ఆ రెండో మహిళ పేరు అతని భార్యగా నమోదు చేసినట్లు సూచించే ఆధారాలను కూడా హైకోర్టు గుర్తించింది. కేవలం భర్త వదిలివేసిన కారణంతో విడాకులు మంజూరైనంత మాత్రాన ఒక మహిళ భరణం పొందే హక్కుకు ఎటువంటి ఆటంకం కలగదని న్యాయస్థానం పేర్కొంది. 

చట్టపరమైన నిబంధనలకు లోబడి, విడాకులు తీసుకున్న మహిళ పునరి్వవాహం చేసుకునే వరకు లేదా తన సొంత సంపాదనతో తనను తాను పోషించుకోగలిగేంత వరకు భరణం పొందడానికి అర్హురాలని తీర్పులో హైకోర్టు న్యాయమూర్తి తేల్చిచెప్పారు. ఈ వ్యవహారాన్ని తిరిగి పరిశీలించడం కోసం కుటుంబ న్యాయస్థానానికి పంపారు. తదుపరి విచారణ పెండింగ్‌లో ఉన్నంత కాలం, సునీతకు నెలకు రూ.4,000 చొప్పున మధ్యంతర భరణం చెల్లించాలని ఆమె మాజీ భర్తను ఆదేశించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement