సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పుపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. లీగల్ ఫైట్ చేయడంలో తప్పు లేదంటూ వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజల మనిషి అని.. తనకు ప్రజల మద్దతు ఉంటుందని అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దానం నాగేందర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. మళ్ళీ పోటీ చేయడానికి కోర్టు అవకాశం ఇచ్చింది. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాను. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాను. ప్రజల ఆశీస్సులతో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా. ఎంపీగా పోటీ చేసినప్పుడే ఇలాంటి పరిస్థితులు వస్తాయని అనుకున్నా. పదో షెడ్యూల్ ప్రకారం ఊరట లభిస్తుంది అనుకున్నాను. కానీ, అలా జరగలేదు.
ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నా. నేను ప్రజల మనిషిని.. ప్రజల మద్దతు నాకు ఉంటుంది. ఖైరతాబాద్ ప్రజలకు నిరంతరం సేవ చేసుకుంటూ వచ్చాను. నాకు ప్రజాబలం ఉంది. సిటీ మొత్తం అభివృద్ధి చేయాలని ఎంపీగా పోటీ చేశాను. కానీ, విజయం దక్కలేదు. నేను ఎవ్వరినీ కలవలేదు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరాను. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం ఏర్పాట్లలో బిజీగా ఉన్నా. న్యాయపోరాటంతో ఆఖరి ప్రయత్నం చేశా’ అని చెప్పుకొచ్చారు.
టికెట్ వచ్చాక అని వివరాలను చెబుతాను. షెడ్యూల్ వచ్చిన తర్వాత రాజకీయం గురించి మాట్లాడుతాను. షెడ్యూల్ వచ్చాక ఏ పార్టీ నుంచి పోటీ అన్నది చెబుతాను. నా అనుచరులు అంతా పోటీ చేయడానికి మద్దతు ఇచ్చారు. ప్రజల మధ్య ఉండే నేతకు ఏ పార్టీలో ఉన్నా మద్దతు ఉంటుంది. కాంగ్రెస్ అన్ని పథకాలు అమలు చేస్తుంది . రోజుకు సీఎం 18 గంటలు పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీకి లాభం చేస్తాయి. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నేను ఇంతవరకు సీఎంను కలవలేదు. ఉప ఎన్నిక వచ్చినప్పుడు నిధులు ఎక్కువ వస్తాయి... నా నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్నికల్లో రిజల్ట్స్ చూపిస్తా’ అని కామెంట్స్ చేశారు.
ఇదీ చదవండి: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్


