వనపర్తి జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని తనకు దూరం చేయడం.. ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేయబోతున్నారని తెలియడంతో తీవ్ర మనో వేదనకు గురైన ఓ యువకుడు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమరచింత మండలం నందిమళ్లకు చెందిన పూడూరు కిషోర్‌కుమార్‌రెడ్డి ఘటన స్థానికంగా విషాదం నింపింది. కిషోర్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే యువతి మైనర్ అంటూ ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిషోర్‌పై పోక్సో కేసు నమోదై జైలుకు వెళ్లాడు.
ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి జూన్‌లో తప్పించుకునేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించి మరో కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే జైలులో ఉన్న కిషోర్‌కు స్నేహితుల ద్వారా తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసినట్లు సమాచారం. దీంతో ఆమెను కలుసుకోవాలనే ఉద్దేశంతో చంచల్‌గూడ జైలు నుంచి కూడా తప్పించుకుని స్వగ్రామమైన నందిమళ్లకు చేరుకున్నాడు. అక్కడి నుంచి మళ్లీ పోలీసులకు చిక్కుతానన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

‘వేధింపులే కారణం’.. తండ్రి ఆరోపణ
తన కుమారుడు కిషోర్‌కుమార్‌రెడ్డి ఆత్మహత్యకు యువతి తండ్రి వేధింపులే కారణమని కిషోర్ తండ్రి పూడూరు శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. యువతికి 18 ఏళ్లు పూర్తయినా ఆధార్‌లో వయస్సు తక్కువగా చూపించేలా పత్రాలు సృష్టించి మైనర్‌గా పేర్కొని కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. తమది పేద కుటుంబమని, కుమారుడిపైనే ఆధారపడి జీవించేవారమని కన్నీరుమున్నీరయ్యారు.
రెండు జైళ్ల నుంచి పరారీ.. ఏడుగురు పోలీసులపై వేటు
కిషోర్ వ్యవహారం పోలీసు శాఖలోనూ కలకలం రేపింది. మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి తప్పించుకున్న ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బంది సస్పెండ్ కాగా.. చంచల్‌గూడ జైలు నుంచి పరారైన ఘటనలో తాజాగా మరో ఐదుగురు పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సీఐ శివకుమార్ తెలిపారు. మొత్తంగా కిషోర్ పరారీ ఘటనలకు సంబంధించి ఏడుగురు పోలీసు సిబ్బంది సస్పెండ్ అయినట్లు వెల్లడించారు.


